ఓటీటీ వేదిక Amazon Prime Videoలో స్ట్రీమింగ్‌ అవుతున్న ‘ఇసకపట్నం’ వెబ్‌ సిరీస్‌ మొత్తం 7 ఎపిసోడ్స్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 1980-90 దశకాల నేపథ్యంలో సాగే ఈ సిరీస్‌లో ఐశ్వర్య రాజేశ్, సముద్రఖని, రాజీవ్ కనకాల, సునీల్, నరేష్ అగస్త్య, సుధాకర్ కోమాకుల, బెనర్జీ, రాజా చెంబోలు, జ్వాలా కోటి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. గ్యారీ బీహెచ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ను రాహుల్ తమడ, సందీప్ రెడ్డి బొర్ర నిర్మించారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం, వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ అందించారు.

కథ ఇసకపట్నం ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతుంది. అక్కడ నిజాయితీగల నాయకుడు చిన్నారావు (రాజీవ్ కనకాల) మత్స్యకారుల సమస్యలను పరిష్కరిస్తూ మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకుంటాడు. నాయుడు (సముద్రఖని) బతుకుదెరువు కోసం భార్య, కూతురుతో కలిసి ఇసకపట్నం చేరి, చిన్నారావు దగ్గర కూలీగా పని మొదలుపెడతాడు. ఊహించని విధంగా గంగమ్మ జాతరలో చిన్నారావును హత్య చేసి, ఆ తర్వాత పోర్ట్‌ ఏరియాను తన గుప్పిట్లోకి తెచ్చుకొని మాఫియా డాన్‌గా ఎదుగుతాడు.

తండ్రి నాయుడు చేసే రౌడీయిజం, అక్రమాలు నచ్చని భారతి (ఐశ్వర్య రాజేశ్) ఒక ఎన్జీవో సంస్థకు విరాళాలు ఇస్తూ ప్రజా సేవ చేస్తూ ఉంటుంది. ఆమెను ఓ యువకుడు (సుధాకర్ కోమాకుల) ప్రేమిస్తుంటాడు. అయితే తనను ప్రేమించే వ్యక్తిని కాకుండా ధనవంతుడు ప్రతాప్ వర్మను ఆమె వివాహం చేసుకుంటుంది. పస్ట్ నైట్‌ రోజే ప్రతాప్ వర్మ మరణించడంతో, అతని చావుకు కారణం ఎవరు అన్నది కథలో కీలక ప్రశ్నగా మారుతుంది.

ఇసకపట్నంలో నాయుడు చేస్తున్న అకృత్యాలకు అడ్డుకట్ట వేయడానికి పోలీసు అధికారి వర్మ (సునీల్) వేసిన ప్లాన్‌ ఏమిటి? నాయుడికి కుడిభుజంగా మెలిగే కోటయ్య (బెనర్జీ) దారుణ హత్యకు గురికావడానికి గల కారణాలేంటి? ఇసకపట్నం ప్రాంతంలో జరిగిన గ్యాస్‌ లీకేజ్‌ ఘటన వెనుక ఉన్న అసలు నేపథ్యం ఏమిటి? భారతి పన్నిన వ్యూహాలు ఫలించాయా లేదా? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సిరీస్‌ పూర్తిగా చూడాల్సిందే.

తెలుగులో స్మగ్లింగ్‌ మాఫియా, వలస కార్మికులపై ఆధిపత్య సంఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే పలు సినిమాలు, సిరీస్‌లు వచ్చినప్పటికీ, ‘ఇసకపట్నం’లో దర్శకుడు గ్యారీ బీహెచ్ ఎంచుకున్న కథ పాతదే అయినా, కథనం మాత్రం కొత్తగా అనిపిస్తుంది. మొత్తం 7 ఎపిసోడ్స్‌లో మొదటి మూడు ఎపిసోడ్స్‌ కాస్త నెమ్మదిగా సాగుతాయి. పాత్రల పరిచయానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, ఒక్కో పాత్ర పరిచయం అవుతున్నకొద్దీ కథపై ఆసక్తి పెరుగుతుంది.

1980 నాటి సామాజిక పరిస్థితులను చూపిస్తూ కథను ప్రారంభించిన దర్శకుడు, ఆనాటి వాతావరణాన్ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. నాయుడు డాన్‌గా ఎదిగిన తర్వాత కథనంపై ఆసక్తి మరింత పెరుగుతుంది. తండ్రీకూతుళ్ల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు, మరోవైపు నాయుడు సామ్రాజ్యాన్ని కూల్చేందుకు సొంత మనుషులే చేసే కుట్రలు, పోలీసు అధికారి వర్మ వేసే కొత్త ఎత్తుగడలతో కథలో క్యూరియాసిటీ పెరుగుతుంది. గ్యాస్‌ లీకేజ్‌ ప్రమాదం తర్వాత కథ మరో మలుపు తిరిగి, వచ్చే ట్విస్టులు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి.

సిరీస్‌ ప్రారంభం నెమ్మదిగా సాగినా, నాలుగో ఎపిసోడ్‌ నుంచి కథనం ఆసక్తికరంగా మారుతుంది. అయితే కొన్ని బలమైన పాత్రలకు పెద్దగా పరిచయంలేని నటీనటులను ఎంపిక చేయడంతో, ఆ సీన్లు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయాయి. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్టులు మాత్రం బలంగా పనిచేస్తాయి.

నాయుడు పాత్రలో సముద్రఖని పూర్తిగా ఒదిగిపోయి, తెరపై క్రూరత్వాన్ని నమ్మించేలా చూపించాడు. విలన్‌ కూతురైన భారతి పాత్రలో ఐశ్వర్య రాజేశ్‌కు మంచి స్కోప్‌ లభించింది; సామాన్యులకు మేలు చేసే యువతిగా ఆమె నటన ఆకట్టుకుంది. పోలీసు అధికారిగా సునీల్, ప్రేమికుడిగా సుధాకర్ కోమాకుల, ఆటో డ్రైవర్‌గా నరేష్ అగస్త్యతో పాటు మిగతా నటీనటులు తమ పాత్రల పరిధిలో చక్కగా నటించారు.

సాంకేతికంగా ‘ఇసకపట్నం’ సిరీస్‌ బాగుంది. ప్రవీణ్ లక్కరాజు అందించిన నేపథ్య సంగీతం సిరీస్‌ స్థాయిని పెంచింది. డైలాగులు ప్రభావవంతంగా ఉన్నాయి. వంశీ పచ్చిపులుసు సినిమాటోగ్రఫీ ఇసకపట్నం వాతావరణాన్ని నిజ జీవితానికి దగ్గరగా చూపించింది. ఎడిటింగ్‌ పర్వాలేదనిపించే స్థాయిలో ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉండడంతో, మొత్తం మీద ‘ఇసకపట్నం’ మాఫియా నేపథ్య కథనాన్ని కొత్త శైలిలో చెప్పిన వెబ్‌ సిరీస్‌గా నిలిచింది.

రేటింగ్‌: 3/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)