రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: హీరోగా ఇప్పటివరకు ఆధునిక నేపథ్యంలోని కథలతోనే సినిమాలు చేసిన అఖిల్ అక్కినేని, మొదటిసారిగా రూరల్ జానర్‌ను టచ్ చేస్తూ వచ్చిన చిత్రం ‘లెనిన్’. యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రానికి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించగా, అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. భాగ్యశ్రీ బోర్సె హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా జూలై 10, 2026న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మనం ఎంటర్‌ప్రైజెస్ ఎల్ఎల్‌పి, సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రానికి తమన్.ఎస్ సంగీతం, లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ, నవీన్ నూలి ఎడిటింగ్ అందించారు.
కథ పరంగా ‘లెనిన్’ శ్రీరామపురం గ్రామం నేపథ్యంతో సాగుతుంది. అక్కడ జరిగే భారతం మిట్ట జాతరను పదెనిమిది రోజుల పాటు ఎలాంటి రక్తపాతం లేకుండా నిర్వహించడం ఆ గ్రామ ఆచారం. ఆ జాతర నిర్వహణ బాధ్యతలను ఎన్నో ఏళ్లుగా లెనిన్ (అఖిల్ అక్కినేని) చూసుకుంటుంటాడు. అనాథ అయిన లెనిన్‌ను ఊరి పెద్ద జయంతి (ఈశ్వరీరావు) తన స్వంత కొడుకులా చూసుకుంటుంది. అదే జాతరలో భారతి (భాగ్యశ్రీ బోర్సె)తో లెనిన్‌కు ఏర్పడిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే పెద్దలు జయంతి కొడుకు వసంత్ (ప్రమోద్ పంజు)తో భారతి వివాహాన్ని నిశ్చయిస్తారు. ఆ తర్వాత లెనిన్ జీవితంలో జరిగే సంఘటనలే కథకు మూలం.
వసంత్ ద్రోహం, జాతరలో జరిగే హత్య కేసులో లెనిన్ జైలుకు వెళ్లడం, వసంత్ కుటుంబంపై యతిరాజు (శివాజీ) పగ, లెనిన్ కారణంగా ఎమ్మెల్యే రాఘవరెడ్డి, దామోదర (బ్రహ్మాజీ) ఎదుర్కొనే అవమానాలు, లెనిన్‌ను ప్రాణంగా ప్రేమించిన భారతి అతనికి ఎలా దూరమవుతుంది వంటి అంశాల చుట్టూ సినిమా నడుస్తుంది.
నటీనటుల పరంగా చూస్తే, గత చిత్రాలతో పోలిస్తే అఖిల్ నటనలో మెచ్యూరిటీ స్పష్టంగా కనిపించింది. కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీ మెరుగుపడ్డాయి. ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకున్నాడు. కొన్ని సంభాషణల్లో నాగార్జున స్టైల్ గుర్తుకు వచ్చేలా చేశాడు. భాగ్యశ్రీ బోర్సె నేచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. డామినేషన్ నేచర్ కలిగిన అమ్మాయిగా ఆమె పాత్ర బాగా నిలిచింది. అఖిల్–భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా బాగుంది.
మంచివాడిగా కనిపించే విలన్ పాత్రలో ప్రమోద్ పంజు మంచి వేరియేషన్లు చూపించాడు. విలనిజం పండించే సీన్లలో ప్రభావం చూపించాడు. సెకండ్ ఇన్నింగ్‌లో శివాజీ చేసిన మంచి సినిమాల్లో ‘లెనిన్’ ఒకటిగా నిలుస్తుంది. పాజిటివ్‌గా కనిపించే నెగెటివ్ క్యారెక్టర్‌లో అతని నటన ఆకట్టుకుంది. హీరో ఎలివేషన్ల కోసం సునీల్ పాత్రను దర్శకుడు సమర్థంగా వినియోగించాడు. ఈశ్వరీరావు నటన సంతృప్తికరంగా ఉంది. బ్రహ్మాజీకి ఇలాంటి పాత్రలు కొత్త కాదు. గెటప్ శీను, ప్రవీణ్‌తో పాటు అనేకమంది కమెడియన్లు తమ పరిధిలో ఆకట్టుకున్నారు.
సాంకేతికంగా, మురళీ కిషోర్ అబ్బూరు మహాభారతాన్ని రిఫరెన్స్‌గా తీసుకుని రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ‘లెనిన్’ కథను రాసుకున్నారు. ఈ ఇతిహాసంలోని ధర్మం, కుట్రలు, వెన్నుపోట్లు వంటి అంశాలను ప్రేమకథతో మిళితం చేసి నేటి తరానికి అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్‌తో, మహాభారతంలో జూదం తర్వాత జరిగిన సంఘటనలను చెప్పుతూ సినిమా ఆసక్తికరంగా మొదలవుతుంది.
తమన్ సంగీతం చిత్రానికి పెద్ద ప్లస్‌గా నిలిచింది. ‘వారేవా’ పాటతో పాటు యాక్షన్ ఎపిసోడ్స్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గూస్‌బంప్స్ కలిగించేలా ఉంది. లియోన్ బ్రిట్టో సినిమాటోగ్రఫీ కలర్‌ఫుల్‌గా, జాతర ఎపిసోడ్స్‌ను నేచురల్‌గా చూపించింది. నిర్మాతలైన నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కథకు అవసరమైనంత బడ్జెట్‌ను సమకూర్చారు. ఎక్కడా వేస్టేజ్ కనిపించలేదు.
విశ్లేషణ పరంగా, ప్రస్తుతం టాలీవుడ్‌లో మైథాలజీ, రూరల్ బ్యాక్‌డ్రాప్ సినిమాలు బాక్సాఫీస్ సక్సెస్ ఫార్ములాగా మారాయి. ‘పుష్ప’, ‘పుష్ప 2’ విజయాల తర్వాత చిత్తూరు యాస, భాషలతో కథలు చెప్పేందుకు దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. ఈ రెండు ట్రెండ్స్‌ను ఫాలో అవుతూ వచ్చిన సినిమానే ‘లెనిన్’. పాండవులు తమ ఆప్తులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఎదుర్కొన్న సంఘర్షణను హీరో పాత్ర ద్వారా అర్థవంతంగా చూపించారు.
భారతం మిట్ట జాతరను మహాభారతంతో లింక్ చేస్తూ కథలోకి వెళ్లిన తీరు ఆకట్టుకుంటుంది. హీరో–హీరోయిన్ ప్రేమకథతో ఫస్ట్ హాఫ్ ఆహ్లాదంగా సాగుతుంది. మాస్ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని లవ్‌స్టోరీని నడిపించారు. ఎమ్మెల్యే, బ్రహ్మాజీ పాత్రలతో పాటు ఈశ్వరీరావును విలన్‌లా చూపిస్తూ సస్పెన్స్‌ను మెయింటేన్ చేశారు. సెకండ్ హాఫ్ పూర్తిగా ఎమోషనల్‌గా సాగుతుంది. అసలు విలన్ ఎవరో రివీల్ అయ్యే ఎపిసోడ్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.
క్లైమాక్స్‌లో రక్తపాతం కొంచెం ఎక్కువైనా, అక్కడ వచ్చే ట్విస్ట్ బాగుంది. చిత్తూరు యాస, భాషలు సినిమాకు ప్లస్ అయ్యాయి. బస్ యాక్షన్ ఎపిసోడ్, హీరో–హీరోయిన్ పెళ్లి సమయంలో వచ్చే ఫైట్ సీన్లు ఆకట్టుకుంటాయి. జాతర సీన్ ‘పుష్ప’ను గుర్తు చేస్తుంది. రూరల్ లవ్‌స్టోరీగా తెలుగులో సినిమా రావడం చాలా కాలం తర్వాత. ఆ లోటును ‘లెనిన్’ భర్తీ చేసినట్లు కనిపిస్తోంది.
మొత్తానికి, స్ట్రాంగ్ ఎలివేషన్లు, ఎమోషన్లతో సాగే పర్‌ఫెక్ట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ‘లెనిన్’ మాస్ ఆడియెన్స్‌కు మంచి విందుభోజనం లాంటి సినిమాగా నిలిచింది.
ఈ చిత్రానికి ఇచ్చిన రేటింగ్ 3/5. ( రివ్యూవర్ అభిప్రాయం మాత్రమే)







