యాక్షన్ హీరోగా తెలుగు, తమిళ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్, ఇప్పుడు తొలిసారిగా దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘మకుటం’. సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థ 99వ మైలురాయి చిత్రంగా రూపొందిన ఈ యాక్షన్ డ్రామా, భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ చిత్రం ఆ అంచనాలను అందుకుందా? బాక్సాఫీస్ వద్ద విశాల్‌కు ‘మకుటం’ దక్కిందా? అన్న ప్రశ్నలకు సమాధానం వెతికితే మాత్రం నిరాశే ఎక్కువగా కనిపిస్తోంది.

కథలోకి వెళ్తే…

కృప (విశాల్) నెలకు ₹25,000 జీతంతో నెట్టుకొస్తున్న సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య (దుషారా విజయన్), ఇద్దరు పిల్లలతో కలిసి చాలీచాలని సంపాదనతో జీవనం సాగిస్తుంటాడు. పెళ్లికి ముందు మామగారికి తనకు కారు ఉందని అబద్ధం చెప్పిన కృప, ఆ మాట నిలబెట్టుకోవడానికి ఎలాగోలా ఒక పాత BMW కారు కొంటాడు. కుటుంబంతో కలిసి ఊటీకి విహారయాత్రకు బయలుదేరుతాడు.

అయితే ఊటీకి వెళ్లిన తర్వాత అనూహ్యంగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కృపను చంపడానికి ప్రయత్నిస్తారు. ఒక సాధారణ మెడికల్ రిప్రజెంటేటివ్‌పై ఇంతటి దాడి ఎందుకు జరుగుతుంది? గతంలో ఉన్న లింగా (విశాల్) ఎవరు? అన్నపూర్ణ (అంజలి) పాత్రతో కృపకు ఉన్న సంబంధం ఏమిటి? శత్రువుల నుంచి తన కుటుంబాన్ని కృప ఎలా కాపాడుకున్నాడు? అన్నదే మిగతా కథ.

కథ, కథనం – పాత బాటలోనే…

కథాపరంగా చూస్తే ‘మకుటం’ తెలుగులో ఎన్నోసార్లు చూసిన పాత రివెంజ్, ఫ్యాక్షన్ ధోరణి కథలను గుర్తు చేస్తుంది. శత్రువుల నుంచి కొడుకును రక్షించడానికి ఊరు దాటించి సాధారణ వ్యక్తిగా పెంచడం, ఆ తర్వాత ఊహించని సమయంలో గతం బయటపడటం వంటి అంశాలు దశాబ్దాలుగా వస్తున్న రొటీన్ పాయింట్లే. కమర్షియల్ ఎలిమెంట్లకు మంచి అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడిగా విశాల్ రాసుకున్న స్క్రీన్‌ప్లే, తీసిన తీరు మాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

సినిమా ఆరంభంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సన్నివేశాల నుంచి మొదలుకొని అనేక సన్నివేశాలు బోరింగ్‌గా సాగుతాయి. ఎక్కడా ఆసక్తికరమైన మలుపు, కొత్తదనం కనిపించదు. విజువల్ ఎఫెక్ట్స్ నాసిరకంగా ఉండటంతో పాటు, రొటీన్ డ్రామా ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంది. రొటీన్ కథతో వచ్చిన ‘మకుటం’, కథనంలోనూ, టేకింగ్‌లోనూ ఎలాంటి కొత్తదనం చూపించలేక పూర్తిగా నిరాశపరుస్తుంది. హీరోగా, దర్శకుడిగా విశాల్ కెరీర్‌కు ఈ సినిమా ఉపయోగపడేలా కనిపించడం లేదు.

నటీనటుల నటన

విశాల్ ద్విపాత్రాభినయంలో తండ్రి, కొడుకులుగా కనిపించాడు. కొడుకు పాత్ర సాధారణ లుక్‌తో సాగగా, తండ్రి పాత్రలోని వృద్ధాప్య గెటప్ ఆయనకు సరిపోలలేదు. ఫ్లాష్‌బ్యాక్ లుక్ గతంలో వచ్చిన ‘మార్క్ ఆంటోనీ’ని గుర్తు చేస్తుంది. నటన పరంగా కూడా విశాల్ నుంచి కొత్తదనం కనిపించదు. దుషారా విజయన్, అంజలి కథానాయికలుగా నటించినప్పటికీ, వారి పాత్రలకు సరైన ప్రాధాన్యత లేకపోవడంతో పెద్దగా గుర్తుండిపోయేలా చేయలేకపోయారు. జయప్రకాశ్, జాన్ విజయ్, ఝాన్సీ వంటి సీనియర్ నటీనటులు ఉన్నప్పటికీ, అనేక పాత్రల్లో మోతాదుకు మించిన లౌడ్ యాక్టింగ్ కనిపిస్తుంది.

సాంకేతిక విభాగం

జీవీ ప్రకాష్ కుమార్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకునే స్థాయిలో లేవు. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్‌లలో వచ్చే లౌడ్ సౌండ్స్ ఇబ్బందికరంగా అనిపిస్తాయి. యాక్షన్ సన్నివేశాల్లో కొత్తదనం చూపే ప్రయత్నం చేసినప్పటికీ, అవి థియేటర్లలో కొన్నిచోట్ల అసహనాన్ని, మరికొన్ని చోట్ల అనుకోకుండా హాస్యాన్ని పుట్టిస్తాయి. పాత పాటలకు విశాల్ వేసిన డాన్స్ స్టెప్పులు సింక్ కాకపోవడం కూడా మైనస్‌గా మారింది. సూపర్ గుడ్ ఫిల్మ్స్ పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై కనిపించినా, బలమైన కంటెంట్ లేకపోవడంతో ఆ గ్రాండియర్ వృథా అయినట్టే.

ముగింపుగా…

‘మకుటం’ – పాత చింతకాయ పచ్చడి కథ, జాడీతో సహా వచ్చిన యాక్షన్ డ్రామాగా మాత్రమే మిగిలిపోయింది.

రేటింగ్:- 2/5

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే