క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, సపోర్టింగ్ పాత్రలతో కెరీర్ ప్రారంభించి.. తర్వాత విలన్‌గా మెప్పించి, అనంతరం హీరోగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సుహాస్. టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సుహాస్ ఇప్పుడు కోలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడు. ఈ ఎంట్రీ ప్రకటించిన నాటి నుంచే ‘మండాడి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సుహాస్ తన నటనతో అదరగొట్టాడని చెప్పాలి.

తమిళ నటుడు సూరి, సుహాస్ ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘మండాడి’ నేడు భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రపు నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ డ్రామా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ: కళింగపట్నం అనే ఊర్లో జరిగే సముద్ర పడవల పోటీలు ఎంతో ప్రసిద్ధి. ఆ ఊరిని సట్టపులి (సుహాస్) తన ప్రభావంతో పాలిస్తుంటాడు. తన ‘సునామి రైడర్స్’ టీమ్‌తో గత 20 ఏళ్లుగా ఆ ఊరికి వరుస విజయాలు అందిస్తున్నాడు. ఇదిలా ఉండగా, శ్రీను (రవీంద్ర విజయ్) కొడుకు మల్లేష్ (మిథున్ జై శంకర్) పడవల పోటీకి సంబంధించిన ఒక వివాదంలో సట్టపులి కొడుకుపై దాడి చేయడానికి ప్రయత్నించి విఫలమవుతాడు.

ప్రాణభయంతో మల్లేష్, ఒక అమ్మాయి సాయంతో హైదరాబాద్‌కు పారిపోతాడు. అక్కడ స్విమ్మింగ్ పూల్‌లో పనిచేస్తూ ఒంటరి జీవితం గడుపుతున్న ముత్తుకాళీ (సూరి) దగ్గర ఆశ్రయం పొందుతాడు. సట్టపులి మనుషులు మల్లేష్‌ను చంపడానికి హైదరాబాద్ చేరుకోవడంతో, 20 ఏళ్ల తర్వాత ముత్తుకాళీ, మల్లేష్‌ను తీసుకుని తిరిగి కళింగపట్నంకే వస్తాడు.

అక్కడ పెద్దలు రాజీ కుదర్చడానికి ప్రయత్నించినా, పరిస్థితి చేయి దాటిపోయి పెద్ద గొడవగా మారుతుంది. చివరికి కళింగపట్నం నుంచి రెండు టీమ్‌లు పడవల పోటీలో పాల్గొనాలని, ఓడిన వారు శాశ్వతంగా ఆటను వదిలేయాలని సవాల్ చేసుకుంటారు. ముత్తుకాళీ తన ‘కళింగ వారియర్స్’ టీమ్‌ను సిద్ధం చేస్తాడు. కానీ సట్టపులి కుట్రల వల్ల ప్రాక్టీస్ మ్యాచ్‌లోనే ముత్తుకాళీ టీమ్ పడవ బోల్తా పడి సభ్యులు ఆస్పత్రి పాలవుతారు.

మరోవైపు, 20 ఏళ్ల క్రితం ముత్తుకాళీ తన తల్లి ఏంజిల్ (మహిమా నంబియార్)ను ప్రేమించాడని తెలిసి మల్లేష్, ముత్తుకాళీపై కోపంగా ఉంటాడు. అసలు 20 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఒకప్పుడు ప్రాణ స్నేహితులైన సట్టపులి, ముత్తుకాళీ బద్ధ శత్రువులుగా ఎలా మారారు? ముత్తుకాళీ ప్రేమ ఎందుకు విఫలమైంది? 20 ఏళ్లుగా అతను అనుభవిస్తున్న నరకానికి కారణం ఏమిటి? ఫైనల్ పడవల పోటీలో ఎవరు గెలిచారు? అనేదే సినిమా మిగతా కథ.

విశ్లేషణ: ‘మండాడి’ కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, దర్శకుడు ఎంచుకున్న సముద్రపు నేపథ్యం, దాన్ని తెరపై చూపించిన తీరు సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ మొత్తం సూరి, సుహాస్ టీమ్‌ల మధ్య జరిగే పడవల పోటీల చుట్టూ ఆసక్తికరంగా సాగుతుంది. వాటర్ సీక్వెన్సెస్, సముద్రంలో చిత్రీకరించిన యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయి.

20 ఏళ్ల క్రితం చేసిన తప్పుకు సూరి అనుభవిస్తున్న నరకం, ప్రాయశ్చిత్తం కోసం అతను పడే తపన కథలో భావోద్వేగ గాఢతను తీసుకొస్తాయి. సెకండాఫ్‌లో వచ్చే ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్, స్నేహితులు శత్రువులుగా మారే క్రమం కొంత రొటీన్‌గా అనిపించినా, నటీనటుల ప్రతిభ దాన్ని కవర్ చేస్తుంది. అయితే క్లైమాక్స్‌ను మరింత భావోద్వేగంగా, బలంగా రూపకల్పన చేసి ఉంటే సినిమా స్థాయి ఇంకాస్త పెరిగేదని అనిపిస్తుంది. మధ్య మధ్యలో నెమ్మదించే స్క్రీన్‌ప్లే మినహా, మొత్తం మీద ఒక గ్రిప్పింగ్ యాక్షన్ డ్రామాగా సినిమా సాగుతుంది.

కథ పాతదే అయినా, నటీనటుల విశ్వరూపం, అదిరిపోయే వాటర్ సీక్వెన్సెస్, మైండ్‌బ్లోయింగ్ మేకింగ్‌తో థియేటర్లలో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌పై కూర్చోబెట్టే ఎంగేజింగ్ రైడ్‌గా ‘మండాడి’ నిలిచింది.

నటీనటులు, సాంకేతికత: ప్రధాన ఆకర్షణ నటీనటుల నటన. సూరి, సుహాస్ ఇద్దరూ స్క్రీన్‌పై పోటీ పడి నటించారు. తమ అద్భుతమైన యాక్టింగ్‌తో పాత్రలకు న్యాయం చేశారు. హీరోయిన్ కూడా తన పాత్ర మేరకు బాగా నటించి ఆకట్టుకుంది. సీనియర్ నటుడు సత్యరాజ్ పోషించిన పాత్ర నిడివి చిన్నదైనా, కథను కీలక మలుపు తిప్పే పాత్రలో ఆయన ఒదిగిపోయారు.

సాంకేతిక విభాగం ఈ సినిమాకు వెన్నెముకగా నిలిచింది. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బాగా పనిచేసింది. సన్నివేశాల్లోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేయడంలో సంగీతం పూర్తి స్థాయిలో సఫలమైంది. విజువల్స్, ముఖ్యంగా వాటర్ సీక్వెన్సెస్‌లో కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా అత్యున్నతంగా కనిపించాయి. మేకింగ్ విషయంలో కాంప్రమైజ్ కాకుండా ఒక రొటీన్ కథను కూడా విజువల్ వండర్‌గా మార్చడంలో టెక్నికల్ టీమ్ సక్సెస్ అయింది.

మొత్తం మీద ‘మండాడి’ తమిళ్ ఫ్లేవర్‌తో కూడిన ఎంగేజింగ్ మూవీగా ప్రేక్షకులను అలరిస్తుంది.

రేటింగ్:- 2.75/5

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.