రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: తాను ఇష్టపడిన యువతి తన ప్రేమను తిరస్కరించిందని ఆవేదనతో యువకుడు ఆత్మహత్య చేసుకుంటే, ఆ యువతి నేరస్థురాలవుతుందా అనే ప్రశ్నను కేంద్రంగా తీసుకుని రూపొందించిన కోర్ట్‌రూమ్ థ్రిల్లర్ చిత్రం ‘పూజా మేరీ జాన్’ ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. మృణాల్ ఠాకూర్ పూజ అనే యువతిగా టైటిల్ పాత్రలో నటించగా, ఆమె ప్రియుడు అనికేత్‌గా విక్రం సింగ్ చౌహాన్, న్యాయవాదులుగా హ్యూమా ఖురేషి, విజయ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు. విపాషా అరవింద్, నవజోత్ గులాటి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
కథలో పూజ స్టార్టప్ ప్రారంభించాలని కలలు కంటూ, రంగస్థలంపై ఆసక్తి పెంచుకుంటుంది. ప్రసిద్ధ నాటకం ‘రోమియో అండ్ జూలియట్’లో అనికేత్, పూజ ప్రేమజంటగా నటిస్తారు. ఈ క్రమంలో అనికేత్ పూజను మనసారా ఇష్టపడతాడు. అయితే పూజ అతన్ని స్నేహితుడిగానే చూస్తుంది. కొంతకాలం క్రితం విక్రం అనే బాయ్‌ఫ్రెండ్‌తో ఆమెకు బ్రేకప్ జరిగిన నేపథ్యం ఉంటుంది.
ఒక రోజు నాటకం ముగిసిన వెంటనే ప్రేక్షకుల ముందే అనికేత్ పూజకు ప్రేమను వ్యక్తపరుస్తాడు. ఆకస్మికంగా జరిగిన ఈ సంఘటనతో దిగ్భ్రాంతికి గురైన పూజ మాట రాక గ్రీన్‌రూంలోకి వెళ్లిపోతుంది. అక్కడ అనికేత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విక్రంతో తన సంబంధం మళ్లీ మొదలైందని చెబుతుంది. తన ప్రేమను తిరస్కరించినందుకు తాను ఏదైనా అఘాయిత్యం చేస్తే, దానికి పూజే బాధ్యత వహించాల్సి వస్తుందని అనికేత్ హెచ్చరిస్తాడు. నువ్వు ఏం చేసుకున్నా తనకు సంబంధం లేదని పూజ స్పష్టంగా చెప్పి వెళ్లిపోతుంది.
ఆ రాత్రే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పూజకు ఈమెయిల్ పంపించి అనికేత్ ప్రాణాలు తీసుకుంటాడు. అతడి మరణానికి పూజనే కారణమని భావించిన అనికేత్ స్నేహితులు ఆమెను దూరం పెడతారు. పూజ స్నేహితుల్లో కొందరూ కూడా ఆమెనే నిందిస్తారు. మీడియా, సామాజిక మాధ్యమాల్లో ఈ ఘటన విస్తృతంగా ప్రచారం కావడంతో సమాజం మొత్తం పూజను దోషిగా చూడటం ప్రారంభిస్తుంది.
ఇలాంటి సమయంలో పురుషుల హక్కుల పరిరక్షణే తన లక్ష్యమని చెప్పుకునే లాయర్ జతిన్ రంగంలోకి దిగుతాడు. అనికేత్ కుటుంబానికి న్యాయం చేస్తానని హామీ ఇస్తూ వారితో కేసు వేయిస్తాడు. దీంతో పోలీసులు పూజపై ఆత్మహత్యకు ప్రేరేపించిన అభియోగాలు నమోదు చేసి ఆమెను అరెస్టు చేస్తారు. పూజ తరఫున వాదించడానికి ఆమె స్నేహితురాలు సనా ముందుకు వస్తుంది.

కోర్టు విచారణలో పూజ, అనికేత్‌ల మధ్య జరిగిన ఛాటింగ్ వివరాలు, అనికేత్ పూజకు పంపిన రూ.10 లక్షల వెనుక కారణం, అనికేత్‌తో తన బంధం గురించి సనాకు చెప్పకుండా పూజ దాచిన విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తాయి. పూజ నిజంగానే అనికేత్‌ను ఆత్మహత్యకు ప్రేరేపించిందా, లేక సమాజం ఆమెపై మోపిన నింద న్యాయమా అన్న ప్రశ్నలకు సమాధానం కోసం చిత్రాన్ని పూర్తిగా చూడాల్సిందే.
‘అమ్మాయి తన ప్రేమను తిరస్కరించడంతో అబ్బాయి ఆత్మహత్య’ వంటి వార్తలు తరచూ వినిపిస్తున్న ఈ కాలంలో, అమ్మాయికి ‘నో’ చెప్పే హక్కు లేదా, తన భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ లేదా, మనసు మారితే బంధాన్ని ముగించే హక్కు లేదా అనే ప్రశ్నలను ఈ చిత్రం గట్టిగా లేవనెత్తుతుంది. ప్రేమలో తిరస్కరణ కూడా సహజమేనని, దాన్ని అంగీకరించడం నేర్చుకోవాల్సిన అవసరాన్ని పురుషులకు గుర్తుచేస్తుంది.
న్యాయస్థానంలో నింద నుంచి బయటపడినా, సమాజంలో మాత్రం ఆ ముద్ర నుంచి బయటపడలేని పరిస్థితుల్లో ఉన్న మహిళల వాస్తవాన్ని చిత్రం చూపిస్తుంది. రెండు గంటలకు తగ్గ నిడివితో థ్రిల్ పంచడంలో చిత్రం బాగా పనిచేసిందని భావన కలుగుతుంది. అయితే కోర్ట్‌రూం సన్నివేశాలు మరింత బలంగా ఉండాల్సిందనే అభిప్రాయం కలుగుతుంది. సాక్షుల విచారణ కొన్నిచోట్ల నిస్సారంగా అనిపిస్తుంది. పాటలు కథాగమనానికి పెద్దగా ఉపయోగపడక, కొన్నిసార్లు అడ్డు తగిలేలా ఉంటాయి.
తాను చేయని నేరానికి నింద మోస్తున్న యువతిగా మృణాల్ ఠాకూర్ నటన ఆకట్టుకుంటుంది. పూజను మొదట అనుమానించినా, తరువాత ఆమెపై పడిన నిందను తొలగించేందుకు కృషి చేసే స్నేహితురాలిగా హ్యూమా ఖురేషి బాగా నెరవేర్చింది. లాయర్ జతిన్ పాత్రలో విజయ్ రాజ్ తన అనుభవాన్ని చూపించాడు. విభిన్న కోణాలున్న అనికేత్ పాత్రలో విక్రం సింగ్ చౌహాన్ మెప్పించాడు.
కుటుంబంతో కలిసి చూడటానికి కొంత ఇబ్బందికరంగా అనిపించే సన్నివేశాలు ఉన్నప్పటికీ, సమకాలీన సామాజిక అంశంపై ఆలోచన రేకెత్తించే చిత్రంగా ‘పూజా మేరీ జాన్’ నిలుస్తుంది. జీ5 వేదికగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి ప్రస్తుతం హిందీ ఆడియో మాత్రమే అందుబాటులో ఉంది.
ప్రధాన పాత్రధారుల నటన, థ్రిల్ పంచే కథనం, ప్రస్తుత సమాజానికి అవసరమైన సందేశం చిత్ర బలాలుగా నిలిస్తే, కొంత బలహీనంగా ఉన్న కోర్ట్‌రూం సన్నివేశాలు, కథనానికి అడ్డు తగిలే పాటలు మైనస్‌గా మారాయి. మొత్తానికి, ‘పూజా మేరీ జాన్’ థ్రిల్‌తో పాటు ఆలోచింపజేసే సందేశాన్ని అందించే చిత్రంగా నిలిచింది.
రేటింగ్:- 3.5/5
గమనిక:- ఈ సమీక్ష పూర్తిగా సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయాన్ని మాత్రమే ప్రతిబింబిస్తుంది.







