ఓటీటీ వేదిక జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ వెబ్‌సిరీస్ ప్రేక్షకులకు థ్రిల్లింగ్ అనుభూతిని అందిస్తోంది. సైబర్ క్రైమ్ నేపథ్యంగా రూపొందిన ఈ సిరీస్‌లో మిస్టరీ, కామెడీ, భావోద్వేగాలు, సామాజిక సందేశాన్ని మేళవించే ప్రయత్నం చేశారు. కథలో పెద్దగా ఊహించని మలుపులు లేకపోయినా, వేగవంతమైన కథనం, నటీనటుల అద్భుతమైన నటన ఈ సిరీస్‌ను ఆసక్తికరంగా మార్చాయి.

ఆరు ఎపిసోడ్‌లతో రూపొందిన ఈ వెబ్‌సిరీస్ మొదటి ఎపిసోడ్ నుంచే ప్రేక్షకులను కథలోకి లాగుతుంది. ప్రతి ఎపిసోడ్ సస్పెన్స్‌ను కొనసాగిస్తూ, తర్వాత ఏమి జరుగుతుందనే ఆసక్తిని కలిగిస్తుంది.

కథలో పెడ్రో పాత్రను అర్షద్ వార్సీ పోషించారు. అతడు ఒక పోలీస్ అధికారి. కొన్ని కారణాల వల్ల అతడిని క్రైమ్ బ్రాంచ్ నుంచి సైబర్ క్రైమ్ విభాగానికి బదిలీ చేస్తారు. అయితే అతని మనసు మాత్రం ఇప్పటికీ క్రైమ్ బ్రాంచ్‌లోనే ఉంటుంది. మరోవైపు తన చిన్న కుమారుడిని కోల్పోయిన బాధ అతడిని తీవ్రంగా వెంటాడుతుంటుంది. ఆ విషాదం కారణంగా భార్య మోనా సింగ్‌తో అతని దాంపత్య జీవితం కూడా దూరమవుతుంది.

ఇలాంటి సమయంలో ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన ఓ మంత్రి కుమారుడు అదృశ్యమవుతాడు. ఈ కేసును ఛేదిస్తే మళ్లీ క్రైమ్ బ్రాంచ్‌లో చేరే అవకాశం వస్తుందని భావించిన పెడ్రో దర్యాప్తు ప్రారంభిస్తాడు. ఈ ప్రయాణంలో అతనికి పరిచయం అవుతాడు ప్రీతమ్. ఈ పాత్రలో వీర్ హిరానీ నటించారు.

ప్రీతమ్ అసాధారణ ప్రతిభ కలిగిన యువ హ్యాకర్. తన తాతకు చెందిన టేప్ రికార్డర్‌ను వెతకడం అతని వ్యక్తిగత లక్ష్యం. అందులో తన అమ్మమ్మ గొంతు రికార్డు అయి ఉండటమే కారణం. ఒక ఏటీఎం దోపిడీ కేసును ఛేదించడంలో ప్రీతమ్ సహాయం చేయడంతో, అతని టేప్ రికార్డర్‌ను వెతకడానికి పెడ్రో కూడా సహకరిస్తాడు.

అక్కడి నుంచి ఇద్దరూ కలిసి మంత్రి కుమారుడి కిడ్నాప్ కేసు దర్యాప్తు చేపడతారు. ఈ క్రమంలో పెద్ద సైబర్ క్రైమ్ నెట్‌వర్క్, హ్యాకింగ్ ముఠాలు, అనేక రహస్యాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి. ఈ కథలో కీలక పాత్ర పోషించేది మార్టిన్. విక్రాంత్ మాస్సే ఈ పాత్రలో నటించారు. అతని నిర్ణయాలే కథను కీలక మలుపులు తిప్పుతాయి.

ఈ సిరీస్‌లో సైబర్ బులీయింగ్, హ్యాకింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వ్యసనం, చిన్నారులపై ఇంటర్నెట్ ప్రభావం వంటి సమకాలీన అంశాలను ప్రస్తావించారు. అయితే ఈ అంశాలను లోతుగా విశ్లేషించకుండా, కథలో భాగంగా మాత్రమే చూపించారు. సామాజిక సందేశం ఇవ్వాలన్న ప్రయత్నం కనిపించినా, మరింత బలంగా చూపించే అవకాశం ఉండేదని అనిపిస్తుంది.

రచన పరంగా చూస్తే కథ చాలా క్లిష్టంగా ఉండదు. సులభంగా అర్థమయ్యేలా సాగుతుంది. కొన్ని ట్విస్టులు ఊహించినట్టుగానే అనిపిస్తాయి. మరికొన్ని చోట్ల సన్నివేశాలు కాస్త సినిమాటిక్‌గా కనిపిస్తాయి. భావోద్వేగ సన్నివేశాలకు ఇంకాస్త బలం ఉంటే బాగుండేదనిపిస్తుంది. అయినా కథ ఎక్కడా నెమ్మదించదు. కేవలం ఆరు ఎపిసోడ్‌లే ఉండటంతో కథ వేగంగా ముందుకు సాగుతుంది. ఎక్కువ అంచనాలు లేకుండా చూస్తే మంచి వినోదాన్ని అందించే థ్రిల్లర్‌గా నిలుస్తుంది.

అర్షద్ వార్సీ మరోసారి తన సహజ నటనతో ఆకట్టుకున్నారు. బాధలో ఉన్న తండ్రిగా, విధి నిర్వహణలో నిబద్ధత కలిగిన పోలీస్ అధికారిగా రెండు కోణాలను అద్భుతంగా చూపించారు. కథ బలహీనంగా ఉన్న సందర్భాల్లో కూడా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. వీర్ హిరానీ తొలి ప్రాజెక్ట్‌లోనే మంచి నటన కనబరిచారు. ప్రీతమ్ పాత్రకు అవసరమైన చలాకీతనం, సహజత్వాన్ని తెరపై బాగా ఆవిష్కరించారు. అర్షద్ వార్సీతో ఆయన కెమిస్ట్రీ ఈ సిరీస్‌కు ప్రధాన బలంగా నిలిచింది.

విక్రాంత్ మాస్సే స్క్రీన్ టైమ్ తక్కువే ఉన్నప్పటికీ, మార్టిన్ పాత్రలో మిస్టరీని, భయాన్ని సమర్థంగా చూపించారు. మోనా సింగ్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యం లేకపోవడం కొంత నిరాశ కలిగిస్తుంది. ప్రారంభంలో ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటుందని అనిపించినా, తర్వాత కథ మొత్తం పెడ్రో, ప్రీతమ్ చుట్టూనే తిరుగుతుంది.

‘ప్రీతమ్ అండ్ పెడ్రో’ పూర్తిగా కొత్తదనంతో నిండిన సైబర్ థ్రిల్లర్ కాకపోయినా, ఆసక్తికరమైన కథనం, మంచి నటన, వేగవంతమైన స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరిస్తుంది. సస్పెన్స్, కామెడీ, ఎమోషన్‌ల సమతుల్య మేళవింపుతో వీకెండ్‌లో ఒకేసారి పూర్తిచేయగల మంచి బింజ్-వాచ్ వెబ్‌సిరీస్‌గా నిలుస్తుంది. ఇంటర్నెట్ ప్రపంచంలో దాగి ఉన్న ప్రమాదాలను గుర్తు చేస్తూనే వినోదాన్ని అందించడంలో ఈ సిరీస్ చాలా వరకు విజయవంతమైంది.

రివ్యూ:- 3/5