రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్:
రావు బహదూర్ సినిమా రివ్యూ: సైకలాజికల్ డ్రామాతో సత్యదేవ్
‘కేరాఫ్ కంచెరపాలెం’, ‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకటేష్ మహా, దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత మళ్లీ సత్యదేవ్‌తో కలిసి చేసిన చిత్రం ‘రావు బహదూర్’. పీరియాడిక్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీ చక్రాస్ ఎంటర్టైన్మెంట్స్, A+S మూవీస్, బెటర్ ఇన్వెస్ట్ మీడియా విజన్ ఫండ్, మహాయాన మోషన్ పిక్చర్స్ బ్యానర్లపై చింతా గోపాల కృష్ణారెడ్డి, అనురాగ్ రెడ్డి, శరత్ చంద్ర, ఈశ్వరన్ విజయ రాఘవన్ నిర్మించారు. ఈ ప్రాజెక్టుకు మహేష్ బాబు, నమ్రత సమర్పకులుగా వ్యవహరించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. టీజర్, ట్రైలర్‌లు కథపై స్పష్టత ఇవ్వకపోవడంతో, ప్రేక్షకులు ఎలాంటి అంచనాలు లేకుండా ఓపెన్ మైండ్‌తో థియేటర్‌కు రావాలని దర్శకుడు, నిర్మాతలు ముందుగానే సూచించారు.
కథ సారాంశం
భువనం రామప్ప రావు బహదూర్ అలియాస్ రామప్ప (సత్యదేవ్) రాజవంశానికి చెందిన వాడు. అయితే పెళ్లి, వంశ పరంపరల నుంచి దూరంగా ఉండాలని భావించి, ప్రపంచ సౌందర్యాలను ఆస్వాదించేందుకు విదేశాలకు వెళ్లిపోతాడు. కుమారుడి భవిష్యత్తుపై ఆందోళన చెందిన తండ్రి సిద్దప్ప (కునాల్ కౌశిక్) అనారోగ్యానికి గురవుతాడు. రామప్ప స్నేహితుడు, కుటుంబ వైద్యుడు ఆచారి (వికాస్ ముప్పాల) ప్రపంచం మొత్తం వెతికి అతని ఆచూకీ తెలుసుకుని, విషయం నేరుగా చెప్పకుండా రామప్పను తిరిగి సంస్థానానికి రప్పిస్తాడు.
ఈ సమయంలో సిద్దప్పకు సేవలు చేయడానికి వచ్చిన ఆంగ్లో ఇండియన్ నర్స్ రేణుక (దీపా థామస్)ను రామప్ప తొలిచూపులోనే చూసి ప్రేమలో పడతాడు. సిద్దప్ప మరణించిన తర్వాత రేణుకకు ఆ ఇంట్లో పని లేకపోవడంతో, ఆమె వెళ్లిపోవడానికి సిద్ధమవుతుంది. అప్పుడు రామప్ప తన ప్రేమను వ్యక్తం చేస్తాడు. కానీ తాను ఇప్పటికే మరొకరిని ప్రేమిస్తున్నానని రేణుక చెప్పి వెళ్లిపోతుంది. తర్వాత ఆచారి సహాయంతో రేణుకను ఒప్పించి రామప్ప పెళ్లి చేసుకుంటాడు.
వీరికి మొదటి సంతానంగా లవణ (ప్రణయ్ వాకా) జన్మిస్తాడు. రామప్ప అతడిని ఎంతో ప్రేమగా పెంచుకుంటాడు. కొంతకాలానికి రెండో సంతానంగా కుసుమప్ప (మాస్టర్ కిరణ్) పుడతాడు. అయితే కుసుమప్ప నల్లగా పుట్టడంతో బంధువులు అతని రంగుపై అవహేళనగా మాట్లాడుతుంటారు. ఆ అవమానాన్ని తట్టుకోలేని రామప్ప, కుసుమప్పను అసహ్యించుకుంటూ, అతడు తన కొడుకే కాదనే అనుమానంతో భార్య రేణుకను లోలోపల వేధిస్తుంటాడు. ఈ అవమానాలను తట్టుకోలేక కుసుమప్ప ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో రేణుక రామప్పను అసహ్యించుకుని, అతనికి దూరంగా ఒక గదిలోకే పరిమితమైపోతుంది. ఈ సంఘటనల తర్వాత రామప్ప మరింత కృంగిపోయి మద్యానికి బానిసవుతాడు. కాలేయం దెబ్బతినడంతో ఏడాదిలో చనిపోవాల్సిన అతడు, ఏళ్లు గడిచినా చనిపోడు. దీనికి కారణమేంటి అన్నదే మిగతా కథ.
నటీనటుల నటన
సత్యదేవ్‌కు రామప్ప పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. వాటన్నింటినీ సమతుల్యంగా ప్రదర్శిస్తూ అతడు అద్భుతంగా నటించాడు. ప్రమోషన్లలో దర్శకుడు అతన్ని కమల్ హాసన్‌తో పోల్చినా, ఆ పోలికలను పక్కనపెడితే సత్యదేవ్ నటనను ప్రేక్షకులు ఆస్వాదించే అవకాశం ఉంది. తెలుగు ప్రేక్షకులకు కొత్త అయిన దీపా థామస్ తన నటన, హావభావాలతో ఆకట్టుకుంది. స్నేహితుడి పాత్రలో వికాస్ ముప్పాల చక్కగా నటించాడు. తండ్రి సిద్దప్పగా కునాల్ కౌశిక్ తక్కువ సీన్‌ల్లోనే ఆకట్టుకున్నాడు. సీనియర్ నటుడు ఆనంద్ భారతి పాత్ర సరిపడా ఉంది. పనిమనిషి అచ్చమ్మగా బాల పరసర్ బాగా చేసింది. మాస్టర్ కిరణ్ నటన భావోద్వేగంగా అనిపించేలా ఉంది. మిగతా నటీనటుల ప్రదర్శన సగటు స్థాయిలో సాగింది.
సాంకేతిక నిపుణుల పనితీరు
వెంకటేష్ మహా దాదాపు ఐదేళ్ల పాటు ‘రావు బహదూర్’ స్క్రిప్ట్‌పై పనిచేసినట్లు సమాచారం. ప్రమోషన్లలో ఈ చిత్రం ‘బాహుబలి’, ‘ఆర్ ఆర్ ఆర్’ స్థాయి అనుభవాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నాడు. దర్శకుడి తన ప్రాజెక్టుపై ప్రేమకు హద్దులు ఉండవు గానీ, ప్రేక్షకులు అలాంటి పోలికలను అంగీకరించాలంటే సినిమా కూడా ఆ స్థాయి అనుభవాన్ని ఇవ్వాలి. ‘రావు బహదూర్’ విషయంలో అలాంటి అనుభవం అందించలేకపోయిన భావన కలుగుతుంది.
సినిమా ఫస్ట్ హాఫ్ చాలా నెమ్మదిగా సాగుతుంది. నాలుగు సన్నివేశాల్లో చెప్పాల్సిన విషయాన్ని నలభై సన్నివేశాల్లో చెప్పినట్టుగా అనిపించేంత స్లో నెరేషన్ కనిపిస్తుంది. కథనం ఎక్కడా వేగం పుంజుకోదు. సెకండ్ హాఫ్ కొంత మెరుగ్గా ఉన్నా, అద్భుతమని చెప్పలేం. అయితే ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్‌లో కథలో కొంత లోతు కనిపిస్తుంది. వెంకటేష్ మహా గత చిత్రాల్లాగే ఇందులో కూడా మానవ విలువలను కొనసాగించే ప్రయత్నం చేశాడు.
స్మరణ్ సాయి సంగీతం బాగుంది. రెండు పాటలు వినడానికి బాగుండగా, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకులను అలర్ట్‌గా ఉంచే ప్రయత్నం చేశాడు. కార్తీక్ పర్మార్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకునేలా ఉంది. లాంగ్ షాట్స్ ఎక్కువగా ఉండటం దర్శకుడి అభిరుచిగా కనిపిస్తుంది. కథ మొత్తం ఒకే ప్యాలెస్‌లో తిరిగేలా నిర్మాణం చేయడం వల్ల ప్రొడక్షన్ విలువలు కథకు తగ్గట్టుగానే ఉన్నాయి.
విశ్లేషణ, రేటింగ్
తెలుగు చిత్రసీమలో సైకలాజికల్ థ్రిల్లర్లు పెద్దగా వర్కౌట్ కాలేదు. అయినప్పటికీ ‘రావు బహదూర్’ ద్వారా వెంకటేష్ మహా అలాంటి ప్రయోగానికి ప్రయత్నించాడు. ఎంత ఓపెన్ మైండ్‌తో థియేటర్‌కు వచ్చినా, ఇంత స్లో నెరేషన్ ప్రేక్షకులకు నచ్చకపోవచ్చు. మొత్తం మీద ఇది బోరింగ్ సైకలాజికల్ డ్రామాగా అనిపించే చిత్రం.
రేటింగ్: 2.5/5







