రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: ప్రమోషన్ల సమయంలో హీరోయిన్ చేసిన “సినిమా నచ్చకపోతే గుండు కొట్టించుకుంటా” అనే వ్యాఖ్యతో పాటు కిరణ్ సబ్బవరం , బన్నీ వాసు వంటి ప్రముఖులు సపోర్ట్ చేయడంతో ఒక్కసారిగా సినీ వర్గాల దృష్టిని ఆకర్షించిన చిన్న చిత్రం ‘సహా (Life Of Sanju)’ సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్, ట్రైలర్ల ద్వారా స్వచ్ఛమైన ప్రేమకథగా కనిపించిన ఈ చిత్రం, ప్యూర్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా ఎంతవరకు ప్రేక్షకులను మెప్పించిందో ఇప్పుడు చూద్దాం.
కథ: ఓ Sub Registrar కార్యాలయంలో పని చేసే 40 ఏళ్ల సంజు (శివ కుమార్ కాసారం) తన భార్య సహా (శ్వేతా లక్ష్మణ్) జ్ఞాపకాలతోనే జీవిస్తుంటాడు. ఉదయం లేచిన దగ్గరి నుంచి ఫోన్‌లో ఆమెతో మాట్లాడుతూనే తన గతాన్ని నెమరువేసుకుంటాడు. స్కూల్ రోజుల నుంచే సహాను ప్రాణంగా ప్రేమించిన సంజు, ఆమె కోసం ఎన్నో గొడవలు పడతాడు. చివరకు సంజు ప్రేమలోని స్వచ్ఛతను చూసి సహా కూడా అతడిని ప్రేమిస్తుంది. పెద్దలు ఒప్పుకోకపోవడంతో కాలేజీ పూర్తయ్యాక ఊరు విడిచి వెళ్లి పెళ్లి చేసుకుంటారు.
ఆ తర్వాత సహా గర్భవతి కావడంతో ఆమె తల్లిదండ్రులు వీరిద్దరినీ మళ్లీ ఇంటికి ఆహ్వానిస్తారు. అదే సమయంలో సంజు ఉద్యోగం కోల్పోతాడు. ఇంటికి వచ్చే బంధువులు, తల్లిదండ్రులు సంజు సంపాదనపై సూటిపోటి మాటలు అనడంతో దంపతుల మధ్య మనస్పర్థలు, కలహాలు మొదలవుతాయి. ఈ గొడవల వల్ల వీరి వైవాహిక జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? చివరకు వీరి బంధం ఏ తీరానికి చేరుతుంది? అనేదే మిగతా కథ.
విశ్లేషణ: దర్శకుడు నిశాంత్ దోటి ఎంచుకున్నది కొత్త కథ కాదు. అబ్బాయి అమ్మాయి వెంటపడటం, ఆమె కోసమే జీవించడం వంటి కథలు ఇప్పటికే చాలానే వచ్చాయి. అయితే ఈ రొటీన్ పాయింట్‌ను ‘నాన్-లీనియర్’ స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా నడిపించే ప్రయత్నం చేశారు. 40 ఏళ్ల సంజు Sub Registrar ఆఫీస్‌లో ఉండే వర్తమాన దృశ్యాలు, స్కూల్–కాలేజీ రోజుల గతం సమాంతరంగా సాగుతాయి.
ఫస్ట్ హాఫ్‌లో స్కూల్ లవ్, EAMCET ఎగ్జామ్ నాటి పరిణామాలు, కాలేజీలోకి Fake IDతో వెళ్లే సన్నివేశాలు క్యూట్‌గా, సరదాగా సాగుతాయి. Sub Registrar ఆఫీస్ చుట్టూ అల్లిన చిన్నపాటి డ్రామా కూడా బాగానే కుదిరింది. సెకండ్ హాఫ్‌లో పెళ్లి తర్వాత దంపతుల మధ్య వచ్చే సమస్యలు, జాబ్ పోయిన తర్వాత ఎదురయ్యే మానసిక సంఘర్షణ, ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే ఎమోషన్స్‌తో కథ సీరియస్ మూడ్‌లోకి మారుతుంది.
కొన్ని చోట్ల ‘7/G బృందావన్ కాలనీ ’, ‘ సినిమా చూపిస్తా మావ ’ సినిమాల ఛాయలు కనిపిస్తాయి. కథలో బలమైన మలుపులు లేకపోవడం, సాగదీత సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో కొన్ని సందర్భాల్లో నిడివి ఎక్కువైన షార్ట్ ఫిలిం చూస్తున్న భావన కలుగుతుంది. క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ప్రారంభ సన్నివేశాల్లోనే ఊహించేలా ఉండటం మైనస్ అయినప్పటికీ, ముగింపులో వచ్చే ఎమోషన్స్ మాత్రం హృదయాలను బరువెక్కిస్తాయి.
ప్రమోషన్ల సమయంలో సినిమా నచ్చకపోతే అమీర్పేట్ సెంటర్‌లో గుండు కొట్టించుకుంటానని ఛాలెంజ్ చేసిన హీరోయిన్ విషయంలో, సినిమా పూర్తిగా బాలేదని అనలేని స్థాయిలో ఉండటంతో ఆమె జుట్టు సేఫ్‌గా ఉన్నట్టే భావించవచ్చు.
నటీనటులు: హీరోగా శివ కుమార్ కాసారం అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. స్కూల్ బాయ్, కాలేజీ స్టూడెంట్, కొత్తగా పెళ్లయిన కుర్రాడు, 40 ఏళ్ల మధ్యవయస్కుడు… ఇలా నాలుగు భిన్నమైన వయసులకు తగిన వేరియేషన్లను బాడీ లాంగ్వేజ్, నటనలో పర్ఫెక్ట్‌గా పలికించారు. శ్వేతా లక్ష్మణ్ క్యూట్ లుక్స్‌తో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లో పరిణతితో కూడిన నటనను కనబరిచి ఆకట్టుకున్నారు. హీరో స్నేహితుడిగా హర్షవర్ధన్ తన పాత్రకు న్యాయం చేశారు. వ్రజన పాండ్య , మహిపాల్ , అప్పాజీ , భారతి తమ పరిధి మేరకు బాగానే చేశారు.
సాంకేతిక విభాగం: సినిమాటోగ్రఫీ చాలా సహజంగా, రిచ్‌గా ఉంది. రియల్ లొకేషన్లలో చిత్రీకరించడం వల్ల విజువల్స్ సహజత్వానికి దగ్గరగా ఉన్నాయి. సంగీతం, నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని భావోద్వేగాలను బాగా ఎలివేట్ చేశాయి. ఎడిటింగ్ మరింత కత్తిరించి ఉంటే సినిమా పేస్ ఇంకా బాగుండేది. కథ పాతదే అయినా, ఫీల్-గుడ్ లవ్ డ్రామాగా మలచడంలో దర్శకుడు చాలావరకు సఫలమయ్యారు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ఫైనల్‌గా: గుండెల్ని పిండేసే ఎమోషన్స్‌తో ‘సహా’ ఓ ఫీల్-గుడ్ ఎమోషనల్ డ్రామాగా నిలిచింది.
రేటింగ్: 2.5/5







