మిత్రన్ దర్శకత్వంలో కార్తీ హీరోగా వచ్చిన ‘సర్దార్’ చిత్రం భారీ విజయాన్ని సాధించిన విషయం సినీప్రియులకు తెలిసిందే. అదే కాంబినేషన్‌లో ఇప్పుడు రూపొందిన సీక్వెల్ ‘సర్దార్ 2’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి భాగానికి ఉన్న క్రేజ్, ప్రమోషనల్ కంటెంట్ బాగా వర్కౌట్ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

కథ పరంగా చూస్తే… సర్దార్ (కార్తీ) చనిపోయాడని భావించిన అతని కుమారుడు విజయ్ (కార్తీ) తన పనిపైనే దృష్టి పెడతాడు. ‘రా’ (RAW) లో పని చేస్తున్న విజయ్, క్రమశిక్షణ చర్యల కారణంగా పెద్దగా ప్రాధాన్యం లేని యూనిట్‌లో పనిష్మెంట్ పోస్టింగ్‌కి వెళ్తాడు. అక్కడ కష్టపడుతూ తన ప్రతిభను నిరూపించుకుని మళ్లీ మంచి స్థాయికి చేరుకోవాలని ప్రయత్నిస్తాడు.

ఈ క్రమంలో ఒక ఏజెంట్‌ను ట్రేస్ చేసే ఆపరేషన్ సందర్భంగా మరోసారి ‘రా’ చీఫ్ ఎదుట డిసిప్లినరీ కమిటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే సమయంలో అతనికి కొన్ని సంచలన విషయాలు తెలుస్తాయి. ఒక కీలక మిషన్ కోసం ‘బ్లాక్ డాగర్’ సూర్య అండ్ గ్యాంగ్ రంగంలోకి దిగిందని తెలుసుకున్న విజయ్, వారి మిషన్ అసలు ఏమిటో కనుగొనే ప్రయత్నం చేస్తాడు. ఈ ప్రయాణంలో తన తండ్రి సర్దార్ గురించి కూడా మరికొన్ని సంచలన విషయాలు బయటపడతాయి. ‘బ్లాక్ డాగర్’ ఎవరు? ఎందుకు ‘రా’ ఏజెంట్స్‌ను టార్గెట్ చేశాడు? విజయ్ ఈ మిషన్‌ను ఎలా ఎదుర్కొన్నాడు? ఇందులో ‘మిషన్ డోకు’ అంటే ఏమిటి? వంటి ప్రశ్నలకు సమాధానాలు పెద్ద తెరపై తెలుస్తాయి.

విశ్లేషణ పరంగా… ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. వాటికి తగ్గట్టుగానే ప్రమోషన్ కూడా జరిగింది. సినిమా మొదలైన కొద్దిసేపటికి ప్రేక్షకులకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఫీలింగ్ కలగొచ్చు. ఇది మొదటి భాగానికి కంటిన్యూషన్ అయినప్పటికీ, ‘సర్దార్’ చూసి చాలా కాలం అయినవారికి ఈ భావన సహజం. అయితే స్పై యాక్షన్ డ్రామాకి అవసరమైన అన్ని హంగులను దర్శకుడు మిత్రన్ సమర్థంగా ప్లాన్ చేశాడు.

ఫస్ట్ హాఫ్‌లో ఒక మిషన్ చుట్టూ కథ తిరుగుతూ, ఆ మిషన్ స్వరూపం, అందులో భాగమైన వ్యక్తులు వంటి అంశాలను ఒక్కొక్కటిగా ఎస్టాబ్లిష్ చేస్తూ ఆసక్తికరంగా నడిపించారు. ఇంటర్వెల్ పాయింట్ సెకండ్ హాఫ్‌పై అంచనాలు పెంచేలా ఉంటుంది. అయితే ఇంటర్వెల్ తర్వాత కథ కొంచెం నెమ్మదించిన భావన, కొన్ని చోట్ల రొటీన్ ఫీలింగ్ కలుగుతుంది. అయినప్పటికీ బాడీకి యాంటీబయాటిక్స్‌ను నెమ్మదిగా అలవాటు చేసే ప్రక్రియను సినిమాలో ఎస్టాబ్లిష్ చేసిన తీరు ఆకట్టుకుంటుంది.

ఈ సినిమా కోర్ పాయింట్ చాలా బలంగా ఉంది. మొదటి భాగంలో ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ప్రమాదాలను చూపించినట్లే, ఈసారి కృత్రిమ మాంసాహార ఉత్పత్తులు, శరీరానికి మందులను విపరీతంగా అలవాటు చేసే విధానం వంటి అంశాలను ఎత్తిచూపారు. అయితే సెకండ్ హాఫ్, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ భాగాలు రొటీన్‌గా అనిపించే అవకాశం ఉంది. ఫస్ట్ హాఫ్‌లో ఎమోషన్స్ బాగా వర్కౌట్ అయినప్పటికీ, వాటిని సెకండ్ హాఫ్ వరకు కొనసాగించడంలో దర్శకుడు పూర్తిగా సఫలం కాలేకపోయినట్లు కనిపిస్తుంది. దీంతో మొత్తం నిడివి అంతా ప్రేక్షకులు ఎంగేజింగ్‌గా ఫీల్ అవ్వడం కొంత కష్టమే.

నటీనటుల విషయానికి వస్తే… కార్తీ రెండు పాత్రల్లో సులభంగా ఇమిడిపోయాడు. అయితే పెద్ద కార్తీ పాత్రకు మేకప్ పరంగా మరింత జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేదనే భావన కలుగుతుంది. ఆషికా రంగనాథ్‌కు యాక్షన్‌తో కూడిన నటన చూపించే అవకాశం దక్కింది. మాళవికా మోహనన్ తన గ్లామర్ రోల్స్‌కి భిన్నంగా నటించింది. ఎస్. జె. సూర్య నటన కొద్దిగా లౌడ్‌గా ఉండడంతో ఓవర్ ది టాప్ ఫీలింగ్ కలిగించే అవకాశం ఉంది. ఆశిష్ విద్యార్థి, నాజర్, అచ్యుత్ వంటి సీనియర్‌లు తమ అనుభవాన్ని తెరపై ప్రతిబింబించారు.

టెక్నికల్ పరంగా ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కీలక బలం. పాటలు పెద్దగా గుర్తుండేలా కాకపోయినా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎఫెక్టివ్‌గా ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. యాక్షన్ సీన్స్ కొద్దిగా ఓవర్ ది టాప్‌గా, లాజిక్‌కి మించి ఏదో జరుగుతున్నట్లుగా అనిపించే చోట్లు ఉన్నాయి. ఎడిటింగ్ టేబుల్‌పై ఇంకాస్త కత్తిరించి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కలుగుతుంది. రెండు గంటల 59 నిమిషాల నిడివి ఈ సినిమాకి కొంత ఇబ్బందికరంగా మారింది. అయితే నిర్మాణ విలువలు మాత్రం బలంగా కనిపించాయి; నిర్మాతలు పెట్టిన ఖర్చు స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది.

మొత్తం మీద ‘సర్దార్ 2’… బలమైన కోర్ పాయింట్‌తో, మంచి టెక్నికల్ విలువలతో కూడిన ఎంగేజింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా నిలిచింది.

రేటింగ్:- 2.5/5

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.