‘కొత్త మలుపు’..

గాయని సునీత తనయుడి రెండో సినిమా ఎలా ఉంది?

‘సర్కారు నౌకరి’ చిత్రంతో హీరోగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన గాయని సునీత కుమారుడు ఆకాశ్‌ తాజా చిత్రం ‘కొత్త మలుపు’తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. శివ కేసనకుర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్‌ 12న విడుదలైంది. కోనసీమ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ యువతరాన్ని ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

హైదరాబాద్‌కు చెందిన కమల్‌ (ఆకాశ్‌) అనే నిర్లక్ష్య స్వభావం కలిగిన యువకుడు స్నేహితులతో సరదాగా జీవితం గడిపేస్తుంటాడు. కుటుంబంలో జరిగే వివాహ వేడుక కోసం కోనసీమ జిల్లాలోని ఓ పల్లెటూరికి వస్తాడు. అక్కడ వరలక్ష్మి (భైరవి ఆర్థ్యా)ను చూసిన కమల్‌ తొలి చూపులోనే ఆమెపై మనసు పారేసుకుంటాడు. ఇదిలా ఉండగా ఓ రాత్రి అవమానకర పరిస్థితుల్లో చిక్కుకున్న కమల్‌ను గుర్తు తెలియని యువతి కాపాడుతుంది. ఆమె ఎవరు అన్న ఆసక్తితో కమల్‌.. వరలక్ష్మితో కలిసి ఆ యువతిని వెతికే ప్రయత్నం ప్రారంభిస్తాడు.

ఈ అన్వేషణలో కమల్‌, వరలక్ష్మిల ప్రయాణం ఎన్నో మలుపులు తిరుగుతుంది. ఈ క్రమంలో కమల్‌ చేతికి చిక్కిన ఓ ఫొటో కారణంగా వీరి మధ్య అనుమానాలు, అపార్థాలు మొదలవుతాయి. కమల్‌ వెతుకుతున్న ఆ యువతికి, అతడు ప్రేమలో పడిన వరలక్ష్మికీ ఏమైనా సంబంధం ఉందా లేదా? ఈ ప్రేమకథ చివరికి ఏ దిశగా సాగింది? అన్నది తెరపై తెలుసుకోవాల్సిందే.

ఇద్దరి మధ్య ప్రేమలో అనుమానం చొరబడితే అది ఎంతటి సమస్యలకు దారితీస్తుందో చూపించడమే ఈ చిత్ర ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తుంది. కోనసీమ సోయగాలను నేపథ్యంగా తీసుకుని దర్శకుడు ప్రేమకథను ఆవిష్కరించే ప్రయత్నం చేశారు. పల్లెటూరి దృశ్యాలు కనులకు ఇంపుగా కనిపించినా, ప్రథమార్ధంలో కథనం నెమ్మదిగా సాగడం కొంత బరువుగా అనిపిస్తుంది.

ఏ లక్ష్యం లేకుండా తిరిగే కుర్రాడిగా కమల్‌ పరిచయ సన్నివేశాలు సరదాగా సాగుతాయి. పెళ్లి వేడుక కోసం కోనసీమకు వచ్చిన తర్వాతే అసలు కథ మొదలవుతుంది. కమల్‌–వరలక్ష్మిల పరిచయం, పెళ్లి హంగామా, గోదావరి ఒడ్డున జరిగే అల్లరి సన్నివేశాలు కాలక్షేపాన్నిస్తాయి. ప్రథమార్ధం చివర్లో వచ్చే చిన్న ట్విస్ట్‌ ఆసక్తి రేకెత్తించేలా ఉంటుంది.

ద్వితీయార్ధంలో కథ మొత్తం భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ సాగుతుంది. ఫొటో కారణంగా కమల్‌, వరలక్ష్మిల మధ్య అనుమానాలు, అపార్థాలు పెరగడం, వాటి వల్ల ఇద్దరూ ఎదుర్కొనే మానసిక వేదనను దర్శకుడు చూపించారు. గతాన్ని బట్టి ఒకరి వర్తమానాన్ని తీర్పు చేయకూడదనే సందేశంతో క్లైమాక్స్‌ రూపుదిద్దుకుంది. ఈ అంశం యువతరానికి దగ్గరగా అనిపించే అవకాశం ఉంది.

కమల్‌ పాత్రలో ఆకాశ్‌ సహజంగా నటించాడు. ప్రథమార్ధంలో అల్లరి, ద్వితీయార్ధంలో భావోద్వేగాల్ని సమతూకంగా ప్రదర్శించాడు. వరలక్ష్మిగా భైరవి ఆర్థ్యా నటన, ఆమె తెరపై కనిపించే తీరు, ఆకాశ్‌తో కెమిస్ట్రీ బాగున్నాయి. రఘుబాబు, పృథ్వీ ఎక్కడక్కడా నవ్వులు పంచారు. ప్రభావతి, మహేందర్‌, ఐశ్వర్య, సిద్ధు తదితరుల పాత్రలు పరిమితిగానే ఉన్నా అవసరాన్ని నెరవేర్చాయి.

కథలో కొత్తదనం పెద్దగా లేకపోయినా, దాన్ని కోనసీమ నేపథ్యంలో ప్రజెంట్‌ చేసిన తీరు ఆకట్టుకుంటుంది. సుమంత్‌ కచర్ల, జవహర్‌ రెడ్డి కెమెరా పనితనం పల్లెటూరి అందాలను అందంగా బంధించింది. యశ్వంత్‌ నాగ్‌ సంగీతం, నేపథ్య సంగీతం సగటు స్థాయిలోనే ఉన్నా కొన్ని సన్నివేశాల్లో బాగా కలిసొచ్చాయి. నిర్మాత తాటి బాలకృష్ణ పెట్టిన నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగానే కనిపిస్తాయి.

బలాల విషయానికి వస్తే ఆకాశ్‌, భైరవి నటన, కథలోని భావోద్వేగాలు, విరామం, పతాక ఘట్టాలు ప్లస్‌ పాయింట్లుగా నిలుస్తాయి. మరోవైపు నెమ్మదిగా సాగే కథనం, ఊహించదగ్గ సన్నివేశాలు బలహీనతలుగా భావించవచ్చు. మొత్తానికి ‘కొత్త మలుపు’ భావోద్వేగాలతో కూడిన పల్లె ప్రేమకథగా యువతరాన్ని మితంగా మెప్పించే చిత్రంగా నిలిచింది.

రేటింగ్:- 2.25/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)