అనౌన్స్ చేసినప్పటి నుంచి ‘శ్రీనివాస మంగాపురం’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి కారణం ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వం వహించడమే కాక, మహేష్ బాబు సహా ఎంతో మంది టాలీవుడ్ హీరోలను పరిచయం చేసిన వైజయంతి మూవీస్ ఈ ప్రాజెక్టులో భాగమై ఉండటమే. అలాగే ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అనిల్ తడాని, రవీనా టాండన్ కుమార్తె రాశా తడాని ఈ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం కావడం కూడా ఆసక్తి రేపింది. ప్రమోషనల్ కంటెంట్ కొంతవరకు వర్కౌట్ కావడంతో సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. ఆ అంచనాలకు సినిమా ఎంతవరకు న్యాయం చేసింది? అనేది ఈ రివ్యూలో.

కథ తిరుపతి నేపథ్యంలో సాగుతుంది. పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) అక్కడ ఓ పెద్దమనిషి. తన వారి కోసం ఎంతదూరమైనా వెళ్లే అతని కుమార్తె మంగ (రాశా) వెంట, తిరుపతికి కొత్తగా వచ్చిన శ్రీను (జై కృష్ణ) పడతాడు. ఎలా అయినా మంగను ప్రేమలో పడేయాలని శ్రీను ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలో అనుకోకుండా పెద్దిరెడ్డి తమ్ముడు సుబ్బారెడ్డి (శ్రీ తేజ్) చేతికి చిక్కుతాడు. అతనికి బుద్ధి చెప్పే ప్రయత్నంలో ఉన్న సమయంలో ఓ గ్యాంగ్ వారి మీద దాడి చేస్తుంది. ఆ ఎటాక్‌లో సుబ్బారెడ్డిని కాపాడే శ్రీను, పెద్దిరెడ్డి దృష్టిలో పడతాడు. దీంతో శ్రీనును ఇంటికి పిలిపించుకుంటాడు పెద్దిరెడ్డి. అసలు శ్రీను ఎవరు? ఎందుకు మంగను ప్రేమించమని వెంటపడుతున్నాడు? ఈ కథలో బళ్లారి వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా థియేటర్‌లో చూడాల్సిందే.

కథ పరంగా చూస్తే ఇది కొత్త కథ కాదు. తెలుగు సినిమాల్లో ఎన్నో ఏళ్లుగా కనిపిస్తూ వస్తున్న లవ్ స్టోరీకి కొంత రివెంజ్ డ్రామా జోడించి అజయ్ భూపతి ఈ కథను రాసుకున్నాడు. ఒక స్టార్ హీరో ఫ్యామిలీ నుంచి వారసుడిని పరిచయం చేస్తున్న నేపథ్యంలో, పూర్తిస్థాయి కమర్షియల్ హంగులతో సినిమాను నింపే ప్రయత్నం చేశాడు. కమర్షియల్ ఫార్మాట్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో కొంతవరకు సక్సెస్ అయినట్లు అనిపిస్తుంది.

ఫస్ట్ హాఫ్ ప్రారంభమైన వెంటనే హీరో గాయపడటం, ఆ తరువాత హీరో హీరోయిన్ వెంటపడుతూ ఆమె ప్రేమ కోసం పరితపించడం ఆసక్తికరంగా చూపించారు. హీరోయిన్ తండ్రిగా పెద్దిరెడ్డి పాత్రను పరిచయం చేసి, ఫస్ట్ హాఫ్ అంతా సస్పెన్స్ క్రియేట్ చేస్తూ కథను నడిపించారు. సెకండ్ హాఫ్ వచ్చే వరకు అసలు కథ ఎటు వెళుతుందో పూర్తిగా అర్థం కాకుండా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయాలన్న ప్రయత్నం కనిపిస్తుంది.

హీరో హీరోయిన్ వెంటపడే ట్రాక్ వల్ల మొదట ఇది రొటీన్ స్టోరీ అనిపించినా, సెకండ్ హాఫ్‌లో కూడా చూసిన కథే అన్న భావన కలుగుతుంది. అయితే కొంతవరకు ఊహకు అందకుండా ట్విస్టులు రాసుకోవడంలో దర్శకుడు ప్రయత్నం చేశాడు. అయినా మొత్తం సినిమా చూసినప్పుడు కథ ఎక్కడో చూసినట్లే అనిపించడం తప్పించుకోలేని అంశం. సినిమా కోసం ఎంచుకున్న లైన్ ప్రేక్షకులకు బాగా అలవాటైనది కావడం ఇందుకు కారణం. సెకండ్ హాఫ్ ప్రారంభమైన తర్వాత దాదాపు కథ ఏమిటనేది ఈజీగా అర్థమైపోతుంది. క్లైమాక్స్‌ను ఇంకొంత పవర్‌ఫుల్‌గా, ఊహకు అందకుండా రాసి ఉంటే బాగుండేది. కానీ దర్శకుడు అనవసరమైన ప్రయోగాల జోలికి వెళ్లకుండా సేఫ్‌గా ఆడుకున్నట్లు కనిపిస్తుంది. దీంతో సినిమా చూస్తున్నప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమానే చూస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే, సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా రంగప్రవేశం చేస్తున్న ఘట్టమనేని జై కృష్ణకు ఇది మంచి లాంచింగ్ ప్యాడ్ అని చెప్పాలి. కమర్షియల్ హీరోకి కావాల్సిన డాన్స్, యాక్షన్, ఎమోషన్స్‌ను సమతూకంగా పండిస్తూ తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు. డాన్సులు బాగా చేసి ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. హీరోయిన్ రాశా కూడా తన పాత్రకు న్యాయం చేసింది. అందంతో పాటు అభినయంతోనూ తనదైన శైలిలో నటించింది.

మోహన్ బాబు స్క్రీన్‌పై కనిపించినంతసేపు తన ప్రెజెన్స్‌తో మ్యాజిక్ చేశారు. కిక్ శ్యామ్, వాసుకి, శ్రీ తేజ్, అజయ్, కిల్లి క్రాంతి, వడ్లమాని శ్రీనివాస్, బ్రహ్మాజీ వంటి నటులు తమ పాత్రల పరిధిలో ఆకట్టుకున్నారు. నరేష్ కనిపించిన ప్రతిసారి నవ్వులు పంచాడు.

టెక్నికల్‌గా అజయ్ భూపతి దర్శకత్వం కొంతవరకు పర్వాలేదనిపించినా, డైలాగ్స్‌లో కొత్తదనం పెద్దగా కనిపించదు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, ఫైట్స్ డిజైన్ చేసిన తీరు ఆకట్టుకునేలా ఉంది. జీవి ప్రకాష్ సంగీతంలో పాటల కంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మెరుగ్గా అనిపించింది. ఎడిటింగ్ మరింత క్రిస్పీగా ఉంటే బాగుండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రియల్ లొకేషన్స్‌లో ఖర్చుకు వెనకాడకుండా షూట్ చేసినట్లు ఫ్రేముల్లో కనిపిస్తుంది.

మొత్తం మీద, ‘శ్రీనివాస మంగాపురం’ రొటీన్ కమర్షియల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా నిలిచింది.

రేటింగ్:- 2.5/5