రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: అగ్ర నటీనటుల్లో చాలామంది ఇప్పటికే ఓటీటీ వేదికలపై తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ జాబితాలోకి తాజాగా బాలీవుడ్ నటుడు సన్నీ దేవోల్ కూడా చేరారు. ఆయన ప్రధాన పాత్రలో సిద్ధార్థ మల్హోత్రా దర్శకత్వంలో రూపొందిన కోర్ట్‌రూమ్ డ్రామా ‘ఇక్కా’ జూలై 10 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. 33 ఏళ్ల క్రితం వచ్చిన ‘దామిని’ చిత్రంలో లాయర్‌గా నటించి గుర్తింపు తెచ్చుకున్న సన్నీ దేవోల్ మళ్లీ నల్లకోటు ధరించి న్యాయవాదిగా కనిపించడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా మారింది. అక్షయ్ ఖన్నా, తిలోత్తమా షోమె, దియా మీర్జా తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
బాధితుల పక్షాన నిలబడి పోరాడే సీనియర్ లాయర్ అర్జున్ మెహ్రా (సన్నీ దేవోల్) కెరీర్‌లో ఓటమి అనే మాట ఉండదు. ఓడిపోవడం ఖాయమనిపించే కేసుల్లోనూ చివరి క్షణంలో ‘ఇక్కా’లా పనిచేసే కీలక సాక్ష్యాన్ని సమర్పించి కేసును తనవైపు తిప్పుకుంటాడు. అలాంటి అర్జున్ జీవితంలో ఊహించని మలుపు తిరుగుతుంది. క్యాన్సర్‌తో పోరాడుతున్న తన కుమార్తె ప్రాణాలను కాపాడుకోవడానికి, తన బద్ధశత్రువు శౌర్యమాన్ గౌర్ (అక్షయ్ ఖన్నా) సాయం కోరాల్సిన పరిస్థితి వస్తుంది.
ఆ సాయానికి ప్రతిఫలంగా ఓ యువతి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శౌర్యమాన్ తరఫున డిఫెన్స్ లాయర్‌గా అర్జున్ వాదించాల్సి వస్తుంది. అతడిని నిర్దోషిగా నిరూపించేందుకు అర్జున్ చేసే ప్రయత్నాలు, వాటిని అడ్డుకునేందుకు ప్రాసిక్యూషన్ లాయర్ మధుర బెనర్జీ (తిలోత్తమా షోమె) తీసుకునే వ్యూహాలు కథను ముందుకు నడిపిస్తాయి. ఈ కేసులో శౌర్యమాన్ నిజంగా నేరానికి పాల్పడ్డాడా? లేక కేవలం నిందితుడేనా? అర్జున్‌తో అతనికి ఉన్న పాత శత్రుత్వం ఏమిటి? అర్జున్ భార్య అవంతికా మెహ్రా (దియా మీర్జా)తో శౌర్యమాన్‌కు గతంలో ఏం జరిగింది? క్లైమాక్స్‌లో అర్జున్ ప్రయోగించే అసలు ‘ఇక్కా’ ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానాలు సినిమాతో తెలుస్తాయి.
కోర్ట్‌రూమ్ డ్రామాలకు ప్రత్యేకమైన ఉత్కంఠ, చివరి వరకు ఆసక్తిని నిలబెట్టే మలుపులు, న్యాయవ్యవస్థలోని లోపాలను చూపించే ప్రయత్నం ఈ చిత్రంలో కనిపిస్తాయి. ‘న్యాయాన్ని గెలిపించడానికి చట్టం ఓ సాధనం మాత్రమే, అది ఒక్కటే న్యాయాన్ని కాపాడలదు’ అనే భావన చుట్టూ కథ నడుస్తుంది. సమాజం మొత్తం ధిక్కరిస్తున్న నిందితుల తరఫున వాదించే డిఫెన్స్ లాయర్లు ఎదుర్కొనే మానసిక సంఘర్షణను దర్శకుడు ప్రధానాంశంగా తీసుకున్నారు.
మొదటి సన్నివేశం నుంచే ముంబయి నేపథ్యంలోని ఓ నేర ఘటనతో కథను ప్రారంభించి, దానికి సంబంధించిన కోర్ట్‌రూమ్ వాదోపవాదాల ద్వారా ఉత్కంఠను పెంచుతూ సాగించారు. ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు, డిఫెన్స్ లాయర్ వేసే చిక్కు ప్రశ్నలు, సాక్ష్యాల సేకరణలో న్యాయవాదులు అనుసరించే మార్గాలు వంటి అంశాలను ఆసక్తికరంగా చూపించారు. నిందితుడు నిజంగా నేరానికి పాల్పడ్డాడా లేదా అన్నదానికంటే, క్లయింట్‌ను గెలిపించడానికి న్యాయవాదులు తమ విలువలను తాకట్టు పెట్టాల్సి వస్తే అది నిజమైన విజయం కాదా అనే ప్రశ్నను సినిమా ముందుకు తెస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే, డిఫెన్స్ లాయర్‌గా సన్నీ దేవోల్ తన ఇమేజ్‌కు భిన్నంగా చాలా అదుపులో, నిగ్రహంతో నటించారు. ముఖ్యంగా క్యాన్సర్ బాధపడుతున్న కుమార్తె కోసం శత్రువు తరఫున వాదించాల్సి వచ్చినప్పుడు, బాధితురాలి తల్లి ఆవేదనను చూసినప్పుడు ఆయన చూపిన భావోద్వేగం బాగా పనిచేసింది. అక్షయ్ ఖన్నా తక్కువ సంభాషణలతోనే వ్యతిరేక ఛాయలున్న పాత్రలో బలమైన ముద్రవేశారు. ప్రాసిక్యూషన్ లాయర్‌గా తిలోత్తమా షోమె సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. సాంకేతికంగా కూడా సినిమా బాగానే నిలబడింది.
కుటుంబంతో కలిసి చూడడానికి అనువైన చిత్రంగా ‘ఇక్కా’ నిలిచింది. Netflix వేదికగా తెలుగు ఆడియోలో కూడా అందుబాటులో ఉండటం స్థానిక ప్రేక్షకులకు అదనపు సౌలభ్యం. సన్నీ దేవోల్, అక్షయ్ ఖన్నాల నటన, కథలోని మలుపులు, ముగింపు సన్నివేశాలు చిత్రానికి బలాలుగా మారాయి. తండ్రీకుమార్తెల మధ్య సన్నివేశాల సాగదీత, ద్వితీయార్థం ఆరంభంలో నెమ్మదిగా సాగే కొన్ని సన్నివేశాలు మాత్రం బలహీనతలుగా కనిపిస్తాయి. మొత్తానికి, సన్నీ దేవోల్ ఓటీటీ ఎంట్రీ ప్రేక్షకులకు థ్రిల్‌ను అందించే ప్రయత్నంగా చెప్పుకోవచ్చు.
రేటింగ్:- 3/5







