రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: సందీప్ కిషన్ కెరీర్‌లో తొలి తెలుగు వెబ్ సిరీస్‌గా వచ్చిన సూపర్ సుబ్బు గురువారం Netflixలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. DJ Tillu ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌లో మానస చౌదరి, మిథిలా పాల్కర్ కీలక పాత్రల్లో నటించారు. రాజీవ్ చిలుక , భారత్ లక్ష్మీపతి ఈ సిరీస్‌ను చిలుక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించారు. అనుదీప్ దేవ్ సంగీతం అందించిన ఈ అడల్ట్ కామెడీ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.
కథ
సుబ్బు అలియాస్ సుబ్రహ్మణ్యం (సందీప్ కిషన్) తండ్రి సిఫారసుతో కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్‌గా ఒక స్కూల్‌లో తాత్కాలిక ఉద్యోగం చేస్తుంటాడు. అతని తండ్రి కుక్కుటేశ్వరరావు (మురళీ శర్మ) అదే స్కూల్‌లో హెడ్‌మాస్టర్‌గా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. కొడుకుపై ఎప్పుడూ అసహనం, ద్వేషంతో ఉండే తండ్రి, సుబ్బు చేసే ప్రతి పనిలో తప్పులే చూస్తుంటాడు.
సుబ్బు పనిచేసే స్కూల్‌కు DEO ఇన్‌స్పెక్షన్‌కు వస్తాడు. తెలియక చేసిన ఒక తప్పు కారణంగా సుబ్బు ఉద్యోగం పోయే పరిస్థితి వస్తుంది. తండ్రి తిట్ల దండకానికి భయపడి, సెక్స్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ గా పనిచేయడానికి మాకీపూర్ అనే గ్రామానికి వెళ్లడానికి సుబ్బు ఒప్పుకుంటాడు. ఇదిలా ఉండగా, సుబ్బుకు దివ్య (మానస చౌదరి) అనే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అవుతుంది. జాబ్ పర్మినెంట్ అయితేనే పెళ్లి జరిపిస్తానని కుక్కుటేశ్వరరావు షరతు పెడతాడు.
జాబ్, పెళ్లి కోసం మాకీపూర్ వెళ్లిన సుబ్బుకు అక్కడ ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? సంతానోత్పత్తి రేటు అధికంగా ఉన్న ఆ ఊరి ప్రజల్లో మార్పు తీసుకురాగలిగాడా? శృంగారం పేరు వినగానే కోపంతో ఊగిపడే ఆ గ్రామస్తుల వల్ల సుబ్బు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? సెక్స్ ఎడ్యుకేషన్ గురించి కనీస అవగాహన లేని ఆ ఊరికి సుబ్బు ఏ విధంగా పాఠాలు చెప్పాడు? మాకీపూర్‌లో పరిచయమైన స్వాతి (మిథిలా పాల్కర్) కారణంగా సుబ్బు జీవితంలో వచ్చిన మార్పులు ఏమిటి? స్వాతి, దివ్యలలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడు? కొడుకు అసలు జాబ్ గురించి కుక్కుటేశ్వరరావుకు తెలిసిందా లేదా? అన్నదే ఈ వెబ్ సిరీస్ కథా గమనాన్ని ముందుకు తీసుకెళ్తుంది.
నటీనటుల ప్రదర్శన
సుబ్బు పాత్రలో సందీప్ కిషన్ సహజమైన నటనతో ఆకట్టుకున్నాడు. ఇష్టం లేని ఉద్యోగం చేయలేక, తన పని గురించి తండ్రికి చెప్పలేక నిజం, అబద్ధం మధ్య నలిగిపోయే యువకుడి అంతర్మథనాన్ని బాగా చూపించాడు. ఎక్కువగా ఎక్స్‌ప్రెషన్స్‌తోనే కామెడీని పండించాడు.
పల్లెటూరి అమ్మాయిగా మిథిలా పాల్కర్, సుబ్బుకు కాబోయే భార్యగా మానస చౌదరి నటన బాగుంది. కొడుకును తిట్టడమే పనిగా పెట్టుకునే తండ్రిగా మురళీ శర్మకు ఇలాంటి పాత్రలు కొత్తకాదు కానీ, కొన్ని సన్నివేశాల్లో అతని డైలాగులు, మాడ్యులేషన్ Ala వైకుంఠపుర్రములూ చిత్రాన్ని గుర్తు చేశాయి. వేశ్య పాత్రలో దివ్య పిళ్లై నటన ఆకట్టుకుంది. సంపూర్ణేష్ బాబు పాత్ర బాగా వర్కౌట్ అయింది. Getup శ్రీను , జీవం తో పాటు మాకీపూర్ ప్రజలుగా కనిపించిన ఇతరులు తమ కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
సెన్సిబుల్ పాయింట్‌ను కామెడీతో కలిపి అర్థవంతంగా చెప్పడంలో దర్శకుడు మల్లిక్ రామ్ సక్సెస్ అయ్యాడు. రమేష్ ఎలిగేటి , శివాని తో కలిసి మల్లిక్ రామ్ ఈ సిరీస్‌కు కథను సిద్ధం చేశారు. అనుదీప్ దేవ్‌తో పాటు Acche, యశ్వంత్ Nag, మనోజ్ శర్మ కలిసి సంగీతం అందించారు. “సుబ్బుగాడు బైలెల్లిండే” పాట బాగా నచ్చేలా ఉంది.
నేచురల్ లొకేషన్లలో షూట్ చేయడం వల్ల నిజంగానే పల్లె జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది. సినిమా స్థాయిలోనే బడ్జెట్ కేటాయించిన రాజీవ్ చిలుక , భారత్ లక్ష్మీపతి నిర్మాణ విలువలు తెరపై స్పష్టంగా కనిపిస్తాయి.
విశ్లేషణ
సెక్స్ ఎడ్యుకేషన్ అనే అంశాన్ని ఇప్పటికీ చాలా మంది బూతుగా భావించే పరిస్థితి ఉంది. ఫిమేల్ రేప్రొడ్యూక్టీవ్ Classes ను పిల్లలకు బోధించడానికి సంకోచించే స్కూల్స్, టీచర్లు ఉన్నారు. లైంగిక అంశాలపై మాట్లాడటానికి చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. కనీస అవగాహన లేకుండానే తల్లిదండ్రులుగా మారే వారు కూడా కనిపిస్తారు. అలాంటి వారికి సందేశం చేరేలా Super Subbu సిరీస్‌ను మేకర్స్ రూపొందించారు.
సెక్స్ అంటే బూతు కాదని, మిగిలిన విషయాల్లాగే లైంగిక విజ్ఞానం పట్ల అవగాహన ఉండటం అవసరమనే భావనను ఈ సిరీస్ ద్వారా చూపించారు. ఇలాంటి కథను చెప్పడంలో కొంచెం గీత దాటినా బూతు కామెడీగా మారే ప్రమాదం ఉండే సమయంలో, ఆ లిమిట్స్‌లోనే ఉండి చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. సానిటరీ పాడ్స్ వినియోగం, ప్రెగ్నన్సీ గురించి వివరించే సీన్‌తో పాటు దివ్య పిళ్లై, సందీప్ కిషన్ మధ్య వచ్చే సన్నివేశాల్లో దర్శకుడు మెప్పించాడు.
మాకీపూర్ గ్రామ ప్రజలు చేసే హడావిడి నవ్వులు పంచుతుంది. కామెడీకి ఎక్కడా లోటు లేకుండా చూసుకున్నారు. నవ్విస్తూనే ఆలోచింపజేసే మంచి సిరీస్‌గా సూపర్ సుబ్బు నిలిచింది.
రేటింగ్: 3/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)







