దినేష్ తేజ్, ధశ్విక కింతల్లి జంటగా నటించిన ‘తత్వం’ సినిమా అక్టోబర్ 2న విడుదలైంది. ఎస్ కె ప్రొడక్షన్స్, త్రయతి ఈశాని క్రియెషన్స్ బ్యానర్లపై వంశీ సీమకుర్తి నిర్మించిన ఈ చిత్రానికి అర్జున్ కోలా దర్శకత్వం వహించారు. చేతన్ భరద్వాజ్ సంగీతం, భరత్ పట్టి ఛాయాగ్రహణం, విప్లవ్ నైషాదం ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. భోగిరెడ్డి శ్రీనివాస్, ప్రమోదిని, కృష్ణ సుక్కు, భరత్ రొంగలి తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

గతంలో ‘హుషారు’, ‘ప్లే బ్యాక్’ వంటి ప్రామిసింగ్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న దినేష్ తేజ్ ఈ చిత్రంలో హీరో. పెద్దగా ప్రచారం లేకుండా, చాలా నిశ్శబ్దంగా ఈ వారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘తత్వం’లో థ్రిల్లర్ జానర్‌కు కావాల్సిన ఆకర్షణీయ అంశాలు ఎంతవరకు ఉన్నాయనే ప్రశ్న ప్రేక్షకుల్లో తలెత్తుతోంది.

కథ విషయానికి వస్తే… రామాపురం అనే గ్రామం నేపథ్యంలో కథ నడుస్తుంది. ఆ ఊరికి కొంచెం దూరంగా నివసించే మూర్తి, నాగమణి దంపతులు హత్యకు గురవుతారు. ఈ హత్యను వారి కొడుకే చేశాడని ఊరి జనాలు భావించి, అతడిని పోలీసులకు అప్పగించేందుకు సిద్ధమవుతారు. ఇదే సమయంలో పెళ్లిచూపుల కోసం ఆ గ్రామానికి వచ్చిన ఏలూరు కానిస్టేబుల్ కళ్యాణ్ తేజ్ (దినేష్ తేజ్)ను, ఈ హత్యకు సంబంధించిన రిపోర్ట్ సేకరించి ఇవ్వాలని పై అధికారి ఆదేశిస్తాడు.

మొదట గ్రామస్తులు చెప్పినట్లుగానే రిపోర్ట్ ఇవ్వాలని భావించిన కళ్యాణ్, సౌమ్య (ధశ్విక కింతల్లి) సూచన మేరకు పూర్తి స్థాయి దర్యాప్తు చేసి నిజానిజాలు తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో అతడికి అనేక సమస్యలు ఎదురవుతాయి. మూర్తి, నాగమణి దంపతులను నిజంగా చంపింది ఎవరు? వారి కొడుకు ఈ కేసు నుంచి ఎలా బయటపడతాడు? ఈ కేసును ఛేదించి కళ్యాణ్ ఎస్ఐగా ప్రమోషన్ పొందగలుగుతాడా? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథనం.

నటీనటుల పనితీరులో దినేష్ తేజ్ ఎప్పటిలాగే సెటిల్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. పోలీస్ పాత్రకు తగ్గట్టుగా అతని మేకోవర్ బాగుంది. అతని స్క్రిప్ట్ సెలక్షన్ ఇప్పటివరకు ఎక్కువగా నిరాశపరచలేదు. ‘తత్వం’ కథ కూడా బాగానే ఉన్నప్పటికీ, అతని సిన్సియర్ ప్రయత్నానికి తగ్గ సన్నివేశాలు మాత్రం రాలేదు. హీరోయిన్ ధశ్విక చూడటానికి బాగున్నా, నటన పరంగా ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. లిప్ సింక్ విషయంలో కూడా ఆమెకు సమస్యలు కనిపించాయి. కిట్టయ్య తనదైన శైలిలో డైలాగ్ డెలివరీతో అలరించాడు. ప్రమోదిని సహజంగా నటించింది. మిగతా నటీనటుల నటన సరాసరి స్థాయిలోనే ఉంది.

సాంకేతికంగా చూస్తే థ్రిల్లర్ సినిమాల విషయంలో మేకర్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇప్పటికే అనేక చిత్రాలు చూపించాయి. అయితే అప్‌కమింగ్ ఫిల్మ్ మేకర్స్ ఈ విషయాన్ని అంతగా పట్టించుకోవడం లేదనే భావన కలుగుతోంది. ఆర్టిస్టుల డేట్స్ సమస్యలవల్లనో, బడ్జెట్ పరిమితులవల్లనో, కొన్ని అనవసర సన్నివేశాలు బలవంతంగా చేర్చినట్టు అనిపిస్తుంది.

‘తత్వం’లో మర్డర్ ఎపిసోడ్ ఆసక్తిని పెంచినా, తర్వాత ఇన్వెస్టిగేషన్ ఎపిసోడ్స్ మాత్రం బలహీనంగా సాగాయి. కథనం ఎక్కడా గట్టిగా ముందుకు సాగదు. మధ్యలో అనవసర పాటలు రావడం ప్రేక్షకుల మూడ్‌ను దెబ్బతీసింది. మొదటి 15 నిమిషాలు తీసేస్తే, ఫస్ట్ హాఫ్ మొత్తం సాగదీతగా అనిపిస్తుంది. సెకండ్ హాఫ్‌లోనైనా నెరేషన్ గ్రిప్పింగ్‌గా ఉందా అంటే, అది కూడా కనిపించదు.

విలన్‌ను రివీల్ చేసే ఎపిసోడ్ మాత్రం కన్విన్సింగ్‌గా ఉంది. విలన్ ఎవరో గెస్ చేయడం అంత ఈజీ కాదు. ఆ ట్రాక్‌ను దర్శకుడు బాగా డిజైన్ చేశాడు. మూఢనమ్మకాల అంశాన్ని కథతో లింక్ చేసిన విధానం కూడా బాగుంది. అయితే ఓ థ్రిల్లర్ సినిమాకు ఈ రెండు భాగాలే సరిపోవు. నెరేషన్‌లో గ్రిప్ లేకపోతే, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లోపిస్తే, థ్రిల్లర్ సినిమాలు వర్కౌట్ కావు. ‘తత్వం’ ఆ విషయాన్ని మరోసారి గుర్తు చేసింది.

టెక్నికల్‌గా కూడా ‘తత్వం’ చాలా పూర్‌గా కనిపిస్తుంది. కనీస నిర్మాణ విలువలు కనిపించవు. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, డబ్బింగ్, ఎడిటింగ్ వంటి విభాగాలన్నీ పేలవంగా ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మొత్తం మీద ‘తత్వం’ మంచి ఐడియా ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్‌లో మొదటి పావుగంట, సెకండ్ హాఫ్‌లో ట్విస్ట్ రివీలింగ్ ఎపిసోడ్ మినహా మిగతా భాగాల్లో డైరెక్షన్ చాలా లేజీగా సాగింది. థ్రిల్లర్ సినిమాలకు అవసరమైన ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లే లేకపోవడం వల్ల, ఈ చిత్రం వృథా ప్రయత్నంగా మిగిలిపోయినట్టే కనిపిస్తోంది.

ఫోకస్ పాయింట్: ట్విస్ట్ బాగుంది… ట్రీట్మెంట్ బాలేదు

రేటింగ్: 1.5/5