రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: యువ కథానాయకుడు హర్ష్ రోషన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘తెల్లకాగితం’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘కోర్ట్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న హర్ష్ రోషన్, యుక్త వయసు కథలకు కేరాఫ్‌గా మారిన తర్వాత వచ్చిన ఈ చిత్రంపై విడుదలకు ముందే ప్రచారం బలంగా సాగింది. అయితే సినిమా ఆ అంచనాలను ఎంతవరకు నెరవేర్చిందన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
భీమవరం సమీపంలోని వీరవాసరం అనే గ్రామం నేపథ్యంలో 2006 కాలానికి చెందిన కథ ఇది. రాము (హర్ష్ రోషన్), ఆశ (నక్షత్ర) పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే ఒకరినొకరు ఇష్టపడతారు. ఇంటర్‌కు చేరేసరికి ఆ ఇష్టం ప్రేమగా మారుతుంది. ఆ వయసుకు సహజమైన అమాయకత్వంతో రాము తన మనసులోని ప్రేమను వ్యక్తం చేయడానికి నానా ప్రయత్నాలు చేస్తాడు. చివరికి బెజవాడ మావయ్య (రాజ్‌కుమార్ కసిరెడ్డి) సలహాతో ఒక తప్పు చేసి తన ప్రేమను తెలియజేస్తాడు. చిన్న ఎడబాటు తర్వాత ఆశ కూడా రాము ప్రేమను అంగీకరిస్తుంది.
ఇంతలో ఈ జంట మధ్యకి అనుకోకుండా ఓ క్లాస్మేట్ రావడంతో రాము మనసులో అనుమానాలు మొదలవుతాయి. ఆశ మరొకరితో మాట్లాడటం చూసి తట్టుకోలేకపోతాడు. ఆమె మనసులో తానే ఒక్కరే ఉండాలనుకునే రాము మళ్లీ మావయ్య సలహా కోరుతాడు. ఈసారి కూడా అతని ప్రభావంతో మరో పెద్ద తప్పు చేస్తాడు. అయితే ఈసారి చేసిన పొరపాటు సరిదిద్దుకోలేనంత పెద్దదిగా మారుతుంది. దాంతో రాము, ఆశల జీవితాల్లో ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే మిగతా కథ.
తెల్లకాగితం కథలో యుక్త వయసులో ప్రేమ పేరుతో యువత తీసుకునే తొందరపాటు నిర్ణయాలు, అపరిపక్వ ఆలోచనలు, అమాయకత్వంతో ఇతరుల మాటలు నమ్మి ఎంతగా ప్రభావితం అవుతారన్న అంశాలను చర్చించే ప్రయత్నం కనిపిస్తుంది. ఏ సమస్య వచ్చినా తల్లిదండ్రులకే చెప్పాలి, ఇతరుల వద్దకు పరుగులు పెట్టకూడదన్న బలమైన సామాజిక సందేశాన్ని ఈ సినిమా అందించాలనుకుంది. సెల్‌ఫోన్ వినియోగం అంతగా లేని కాలానికి ప్రేక్షకులను తీసుకెళ్లి, అప్పటి వాతావరణం, అమాయకపు ప్రేమను తెరపై మళ్లీ చూపించడమే దర్శకుడి ఉద్దేశ్యంగా కనిపిస్తుంది.
అయితే 2006–2007 కాలం నేపథ్యాన్ని ఎంచుకున్నప్పటికీ, పాత కాలంనాటి రచన ఈ సినిమాకి పెద్ద బలహీనతగా మారింది. కథనం అంతగా ఆకట్టుకోదు. పీరియడ్స్, క్లాస్రూమ్ పీరియడ్, డాక్టర్, కండక్టర్లను కలిపి సంభాషణల ద్వారా హాస్యం పండించాలన్న ప్రయత్నాలు చేసినా అవి ఆశించిన స్థాయిలో నవ్వులు రేపలేకపోయాయి. యుక్త వయసు ఆకర్షణలు, ప్రేమలు, తప్పులు, భయాలపై ఇప్పటికే అనేక సినిమాలు వచ్చిన నేపథ్యంలో ఈ కథ కొత్తదనాన్ని అందించలేకపోయింది.
హైస్కూల్ రోజుల నుంచే ప్రారంభమైన కథలో లంచ్ బాక్స్‌లు మార్చుకోవడం, చేతి రుమాలు సహాయంతో హీరో తనకు బాక్స్ ఇస్తున్నది ఎవరో కనుగొనడం, తర్వాత ఇద్దరూ మనసులు కలుపుకోవడం, కాలేజీకి చేరడం, ప్రేమ పేరుతో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వంటి సన్నివేశాలతో మొదటి భాగం సాగుతుంది. అసలు సంఘర్షణ విరామానికి ముందే మొదలైనా, రెండో భాగంలో ఆ సంఘర్షణను నడిపించిన తీరు ఆకట్టుకోదు. కొత్తదనం లేని కథనం కారణంగా సన్నివేశాలన్నీ మెడికల్ షాప్, కాలేజీ చుట్టూనే తిరుగుతాయి.
కథానాయకుడి స్నేహితుడి పాత్రలో దీపక్ ద్వారా అమాయక సంభాషణలతో హాస్యం పండించాలన్న ప్రయత్నం పెద్దగా ఫలించలేదు. క్లైమాక్స్ సన్నివేశాలు, వాటికి ముందు కథలో వచ్చే కొన్ని మలుపులే ఈ సినిమాకి కొంత బలం. చాలావరకు సన్నివేశాలు ఊహించదగ్గలా సాగడంతో భావోద్వేగాలు కూడా గట్టిగా తాకవు.
నటీనటుల విషయానికి వస్తే, యుక్త వయసు కుర్రాడిగా హర్ష్ రోషన్ తన పాత్రలో ఒదిగిపోయాడు. ఆ వయసుకు తగిన అమాయకత్వం, గందరగోళాన్ని హావభావాలతో బాగా చూపించాడు. నక్షత్ర నటనలో సహజత్వం కనిపిస్తుంది. స్నేహితుడి పాత్రలో దీపక్ కొన్ని చోట్ల నవ్వించాడు. కథానాయిక స్నేహితురాలిగా శ్రావ్య, తండ్రి పాత్రలో అజయ్ తమ పాత్రలకు న్యాయం చేశారు. రాజ్‌కుమార్ కసిరెడ్డి, శరణ్య ప్రదీప్ ప్రాధాన్యమైన పాత్రల్లో కనిపించారు.
సాంకేతికంగా గుహన్ కెమెరా పల్లెటూరి నేపథ్యాన్ని అందంగా చూపించింది. విజయ్ బుల్గానిన్ సంగీతం ఆకట్టుకునేలా ఉంది. రచయిత నందు సవిరిగాన, దర్శకుడు రమేష్ బండ్రెడ్డి కథను తెరపైకి తీసుకురావడంలో కొద్దిమేర ప్రభావం చూపించినప్పటికీ, మొత్తం కథనాన్ని బలంగా నిలబెట్టలేకపోయారు. నిర్మాణ విలువలు మాత్రం సంతృప్తికరంగా ఉన్నాయి.
మొత్తానికి, తెల్లకాగితం చిత్రం ఆలోచనాత్మక సందేశంతో ముందుకు వచ్చినప్పటికీ, బలహీన కథనం, కొరవడిన భావోద్వేగాల కారణంగా పూర్తిగా మెప్పించలేకపోయింది. యువతకు, తల్లిదండ్రులకు చెప్పాలనుకున్న సందేశం ఉన్నప్పటికీ, అది గట్టిగా మిగిలేలా చెప్పడంలో సినిమా కొంత వెనుకబడి పోయింది.
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
రేటింగ్:- 2.5 / 5







