రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: ఈ వారం ఓటీటీల్లోకి బ్లాస్ట్ , రాజా శివాజీ , అవతార్ 3 వంటి చిత్రాలతో పాటు హాలీవుడ్ డబ్బింగ్ మూవీ ‘ ది షీప్ డిటెక్టివ్స్ ’ కూడా తెలుగు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియో లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ కాన్సెప్ట్‌కు కామెడీని జోడిస్తూ రూపొందించారు. సరికొత్త కథా నేపథ్యంతో వచ్చిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి ఆసక్తికర స్పందన వస్తోంది.
కథ పరంగా చూస్తే జార్జ్ ( Hugh Jackman) అనే వ్యక్తి Denbrook అనే చిన్న పల్లెటూరిలో గొర్రెల కాపరిగా జీవిస్తుంటాడు. ప్రతి రాత్రి పడుకునే ముందు తన దగ్గర ఉన్న డిటెక్టివ్ నవలలను గొర్రెలకు చదివి వినిపించడం అతని అలవాటు. అయితే తాను చదివే కథలన్నీ గొర్రెలకు అర్థమవుతున్నాయనే విషయం జార్జ్ కు తెలియదు. ఇదిలా ఉండగా ఒక రోజు రాత్రి Georgeను ఎవరో హత్య చేస్తారు. ఈ కేసును స్థానిక పోలీస్ దర్యాప్తు చేస్తుండగా, మరోవైపు గొర్రెలన్నీ డిటెక్టివ్‌లుగా మారి తమ కాపరిని ఎవరు చంపారో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాయి. చివరకు హంతకుడు దొరికాడా లేదా, జార్జ్ ను ఎవరు ఎందుకు చంపారు అనేదే మిగతా కథ.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌లలో సాధారణంగా పోలీసులు లేదా ప్రైవేట్ డిటెక్టివ్‌లు, లేదా చుట్టూ పక్కన ఉండే మనుషులే కేసును ఛేదిస్తారు. కానీ ఈ చిత్రంలో మాత్రం గొర్రెలు హత్య కేసు పరిష్కారంలో కీలక పాత్ర పోషించడం ప్రత్యేకత. వినడానికి విచిత్రంగా అనిపించినా, పెద్దగా హడావుడి లేకుండా సరదాగా సినిమా నడుస్తుంది.
మర్డర్ మిస్టరీ అనగానే ప్రేక్షకులు ఎన్నో ట్విస్టులు ఊహిస్తారు. ఈ సినిమాలో కూడా హత్య చేసింది ఎవరు అనే ట్విస్ట్ ఉన్నప్పటికీ, దానికంటే గొర్రెలు మనుషుల్లా మాట్లాడుకోవడం, తమ కాపరి ఇప్పటివరకు చదివి వినిపించిన డిటెక్టివ్ పుస్తకాల కథల ఆధారంగా కేసును ఛేదించేందుకు ప్రయత్నించడం వంటి అంశాలు ఫన్నీగా కనిపిస్తాయి. గొర్రెల గ్రాఫిక్స్ సహజంగా, నమ్మదగిన విధంగా చూపించారు.
ఊరి చివర గడ్డి తిని బతికే గొర్రెలు అకస్మాత్తుగా మనుషుల ప్రపంచంలోకి వచ్చి గందరగోళానికి గురవడం, అక్కడి పరిస్థితులకు అలవాటు పడే ప్రయత్నం చేయడం వంటి సన్నివేశాలను కూడా వినోదాత్మకంగా మలిచారు. జార్జ్ తో పాటు అదే ఊరిలోని మరో గొర్రెల కాపరి, కసాయి వాడు, హోటల్ యజమాని, పోలీస్, న్యూస్ రిపోర్టర్, జార్జ్ కూతురు వంటి పలువురు పాత్రలపై అనుమానం వచ్చేలా దర్శకుడు కథను నడిపించాడు. అయితే క్లైమాక్స్‌లో హంతకుడు లేదా హంతకురాలు ఎవరో పెద్దగా డ్రామా లేకుండా చూపించి సినిమా ముగించారు.
ఈ చిత్రంలో నటించిన నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయమైన ముఖాలు కాకపోయినా, ఆయా పాత్రలకు బాగా సరిపోయారు. తెలుగు డబ్బింగ్, గొర్రెల గ్రాఫిక్స్, సినిమాటోగ్రఫీ, నిర్మాణ విలువలు రిచ్‌గా కనిపిస్తాయి. అసభ్యకర సన్నివేశాలు లేకపోవడం వల్ల కుటుంబంతో కలిసి చూడదగిన చిత్రంగా నిలుస్తుంది. దాదాపు 100 నిమిషాల నిడివి ఉన్న ఈ మూవీ వేగంగా, సులభంగా సాగిపోతూ ప్రేక్షకులను అలరిస్తుంది.
రేటింగ్: 3/5 (ఇది వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే)







