రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఎప్పటినుంచో ప్రత్యేక ఆదరణ ఉంది. ముఖ్యంగా మలయాళంలో వచ్చే థ్రిల్లర్ చిత్రాలకు ఇక్కడ గట్టి ఫ్యాన్ బేస్ ఏర్పడింది. అలాంటి ఆసక్తిని రేపుతున్న తాజా మలయాళ చిత్రం ‘ఉన్మాదం’ ఇప్పుడు సోనీలివ్ వేదికగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుంచకో బోబన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి కిరణ్ దాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఎంతవరకు ఉత్కంఠను పంచగలిగింది? ప్రేక్షకుల అంచనాలను నెరవేర్చిందా? అనే కోణంలో ఈ సమీక్ష.
‘ఉన్మాదం’ కథానాయకుడు షెల్లీ (కుంచకో బోబన్)కి చిన్నప్పటి నుంచే సినిమాలంటే మక్కువ. రచయిత కావాలని కలలు కంటాడు. అయితే కుటుంబ పరిస్థితుల దృష్ట్యా పోలీస్ శాఖలో కానిస్టేబుల్ ఉద్యోగం చేపడతాడు. భార్య సౌమ్య (లిజోమోల్ జోస్) ప్రైవేట్ సంస్థలో పనిచేస్తూ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఇద్దరు పిల్లలతో సాధారణ మధ్యతరగతి జీవితం. ఉద్యోగంతో పాటు షెల్లీ కథలు రాయడాన్ని మాత్రం ఆపడు. ఎన్నో కథలు రాసినా, ఒక్కటి కూడా సినిమా రూపం దాల్చదు.
ఇలాంటి సమయంలో అతనికి మరో పోలీస్ స్టేషన్‌కు బదిలీ వస్తుంది. అక్కడ ఆరేళ్ల క్రితం జరిగిన ఓ యువతి మరణ కేసు గురించి తెలుసుకుంటాడు. కేసు నంబర్ 174గా నమోదైన ఆ ఫైల్‌ను ఎవరు తెరిచినా, అదే రోజు వారికి రక్తపాతం తప్పదని అక్కడి పోలీసులు నమ్ముతుంటారు. అందుకే దాన్ని శాపగ్రస్త కేసుగా భావించి ఎవరూ పట్టించుకోరు. ఈ కేసును ఛేదించి, దానిపైనే కథ రాయాలని షెల్లీ నిర్ణయించుకుంటాడు. ఆ కేసు విచారణలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి? ఆ యువతి మరణం వెనక నిజం ఏమిటి? షెల్లీ ఆ మిస్టరీని విప్పగలిగాడా లేదా? అనేదే సినిమా మిగతా భాగం.
మలయాళ కథలు అద్భుతంగా ఉంటాయని, అలాంటి సినిమాలు తీయడం మనవాళ్లకు కష్టమని సోషల్ మీడియాలో తరచూ చర్చలు జరుగుతుంటాయి. అక్కడి చిన్న బడ్జెట్, తక్కువమంది నటీనటులతో కొత్త దర్శకులు చేసే ప్రయోగాలు చాలా సార్లు హిట్ అవుతాయి. అయితే ప్రతి సారి ఆ మేజిక్ పునరావృతం అవుతుందా అంటే కాదు. తాజాగా వచ్చిన ‘ఉన్మాదం’ కూడా అలాంటి మిశ్రమ అనుభూతినే ఇస్తుంది.
ప్రచార చిత్రాలు చూస్తే ఇది మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా ఆసక్తి రేపుతుంది. కథ పాయింట్ పరంగా కూడా కొత్తదనమే ఉంది. కానిస్టేబుల్‌గా షెల్లీ ప్రపంచం, రచయిత కావాలన్న అతని తపన, కుటుంబ జీవితం వంటి అంశాలతో దర్శకుడు కిరణ్ దాస్ సినిమాను నెమ్మదిగా మొదలుపెట్టారు. శాపగ్రస్తంగా భావించే కేసు నంబర్ 174 ఫైల్‌ను షెల్లీ ఓపెన్ చేసి విచారణ మొదలుపెట్టిన దగ్గర నుంచి అసలు కథ మొదలవుతుంది.
విరామానికి ముందు వరకు ఇన్వెస్టిగేషన్, పోలీస్ ప్రొసీడరల్ అంశాలు, సూపర్ నేచురల్ మైండ్ గేమ్‌ల మేళవింపుతో కథనం ఆసక్తిగా సాగుతుంది. ఇంటర్వెల్ సమయానికి కథ పతాక స్థాయికి చేరుకోవడంతో, రెండో భాగంపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి కలుగుతుంది. అయితే అక్కడినుంచి సినిమా ఊహించినంతగా లిఫ్ట్ తీసుకోలేకపోయింది. మొదటి భాగంలో స్లో అండ్ స్టడీగా నడిచిన ఇన్వెస్టిగేషన్, రెండో భాగంలో ఒక్కసారిగా చకచకా ముగిసిన భావన కలుగుతుంది. ఒక్కో చిక్కుముడి విప్పబడే కొద్దీ కథ ఇంతేనా అన్న అనుభూతి కలిగిస్తుంది. క్లైమాక్స్ మరీ సాదాసీదాగా ముగిసినట్టు అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే, మొత్తం కథ షెల్లీ పాత్ర చుట్టూనే తిరుగుతుంది. ఆ పాత్రలో కుంచకో బోబన్ పూర్తిగా ఒదిగిపోయారు. ముఖ్యంగా మానసిక సంఘర్షణకు గురయ్యే సన్నివేశాల్లో ఆయన నటన బాగా పనిచేసింది. భార్య సౌమ్య పాత్రలో లిజోమోల్ కూడా సహజంగా నటించింది. తన కల కోసం కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడనే అసంతృప్తితో ఉండే భార్య పాత్రను ఆమె హావభావాలతో బాగా మలిచింది. మిగతా పాత్రధారులు తమ పరిధిలో సరైన నటన కనబరిచారు.
సాంకేతికంగా సినిమా బాగానే ఉంది. దర్శకుడు కిరణ్ దాస్ ఈ చిత్రానికి ఎడిటర్ కూడా. కథాగమనం, ముఖ్యంగా ద్వితీయార్ధం నెమ్మదించినా, తాను చిత్రీకరించిన సన్నివేశాలపై మమకారంతో కొన్ని భాగాలను కట్ చేయకుండా వదిలేసినట్టు అనిపిస్తుంది. మరో ఇరవై నిమిషాలు ట్రిమ్ చేసి ఉంటే సినిమా ఇంకా కట్టుదిట్టంగా, షార్ప్‌గా అనిపించేదనే భావన కలుగుతుంది.
కుటుంబంతో చూడొచ్చా అనే ప్రశ్నకు వస్తే, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడదగ్గ చిత్రమే. సోనీలివ్ వేదికగా తెలుగు ఆడియో కూడా అందుబాటులో ఉండటం ప్లస్ పాయింట్. ఈ చిత్ర బలాలు – నటీనటుల నటన, దర్శకుడు ఎంచుకున్న పాయింట్, ప్రథమార్ధం ఉత్కంఠ. బలహీనతలు – ద్వితీయార్ధం నెమ్మదితనం, నిడివి, చివరికి రొటీన్ రివెంజ్ డ్రామాగా మారిపోవడం.
మొత్తానికి ‘ఉన్మాదం’ ఆరంభంలో ఉత్కంఠను రేపినా, చివరికి ఆ మోతాదును నిలబెట్టుకోలేకపోయిన థ్రిల్లర్. క్రైమ్ థ్రిల్లర్‌లంటే ఇష్టమున్న ప్రేక్షకులు, నిడివిని పెద్దగా పట్టించుకోకుండా ఓసారి ప్రయత్నించవచ్చు.
రేటింగ్: 2.5/5
గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.







