రాయలసీమ న్యూస్, నంద్యాల: రైతుల సమస్యలపై రాజకీయ వాదోపవాదాలు మళ్లీ చెలరేగాయి. నీటి విడుదల, సాగు పంటల ఎంపిక, రైతుల ఇబ్బందుల అంశాలపై వైసీపీ నాయకులు, కూటమి ప్రభుత్వ ప్రతినిధుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో గంగుల కమలాకర్ వైసీపీ నేతలపై తీవ్ర విమర్శలు చేశారు.
రైతుల కన్నీళ్లు తుడుస్తామని చెప్పిన వైసీపీ నాయకులు ఇప్పుడు నీళ్ల పేరుతో మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ఆయన ఆరోపించారు. శిల్పా రవి అడిగిన ప్రతి ప్రశ్నకు తాను వాస్తవాలతోనే సమాధానం ఇచ్చానని స్పష్టం చేశారు. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం ముందే మాటిచ్చిందని, ఆ మాటకు కట్టుబడి కేసీ కెనాల్ 16వ బ్లాక్ నుంచి దిగువ ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం నీళ్లను విడుదల చేయించామని తెలిపారు.

తాగునీటి కోసం గానీ, సాగు కోసం గానీ నీరు అందించడం ప్రభుత్వ బాధ్యతేనని, దాన్ని రాజకీయంగా కాకుండా బాధ్యతగా నెరవేర్చుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని, తన ప్రాంతంలో నీళ్ల కొరత రాకూడదనే ఉద్దేశంతో ముందుగానే రైతులకు వరి వేయొద్దని, ప్రత్యామ్నాయ పంటలు చూసుకోవాలని సూచించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇది రైతుల పట్ల తన బాధ్యతలో భాగమని ఆయన అభిప్రాయపడ్డారు.
వైసీపీ నాయకులు ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందని ముందే తెలుసుకుని, నీళ్లు వదిలే సమయానికి ధర్నాల డ్రామా మొదలుపెట్టారని ఆయన విమర్శించారు. ఆ క్రెడిట్ తాము పోరాడితేనే వచ్చినట్టు చెప్పుకోవడానికి ఇంత దిగజారాల్సి వచ్చిందా అని ప్రశ్నించారు. రైతుల కష్టాలను అడ్డం పెట్టుకుని తమపై బురద జల్లి, పబ్లిసిటీ కోసమే చేసే చిల్లర రాజకీయాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని వ్యాఖ్యానించారు.

శిల్పా రవి చొక్కా చినిగిపోయిందని కెమెరాల ముందు చూపిస్తూ ఫోజులు కొడితే సరిపోదని, వారి డ్రామాలకు వచ్చే రోజుల్లో ప్రజలే సరైన సమాధానం చెబుతారని గంగుల కమలాకర్ హెచ్చరించారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు గంగుల కుటుంబం సాగునీటి సలహాదారులుగా ఉండి, ఆ సమయంలో జగన్‌మోహన్ రెడ్డి కి ఏం సలహాలు ఇచ్చారో ప్రజలకు తెలుసునని ఆయన సూచించారు.
రైతులు నీళ్ల కోసం వేడుకుంటే ఆకాశం వైపు చూపిస్తూ చేతులెత్తేసిన చరిత్ర వైసీపీదేనని, ఏనాడూ రైతులకు రూపాయి మేలు చేయని వారు ఇప్పుడు ప్రభుత్వం బాధ్యతగా నీళ్లు విడుదల చేస్తుంటే మధ్యలో వచ్చి చొక్కాలు చింపుకుని హీరోయిజం చూపించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. వారి కపట నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని గంగుల కమలాకర్ వ్యాఖ్యానించారు.
“శిల్పా రవి అడిగిన ప్రతి ప్రశ్నకు నేను వాస్తవాలతోనే సమాధానం చెప్పాను. ప్రజలు ఇబ్బంది పడకుండా అన్ని విధాలుగా ఆదుకుంటామని మా కూటమి ప్రభుత్వం ముందే మాటిచ్చింది. ఆ మాటకు కట్టుబడే కేసీ కెనాల్ 16వ బ్లాక్ నుంచి దిగువ ప్రాంతాల తాగునీటి అవసరాల కోసం నీళ్లను విడుదల చేయించాం. తాగడానికి గానీ, సాగుకు గానీ నీరిచ్చే బాధ్యత మా ప్రభుత్వానిది. మేము దాన్ని రాజకీయంగా చూడట్లేదు, బాధ్యతగా నెరవేరుస్తున్నాం.”
“ఈ ఏడాది వర్షాలు తక్కువగా పడతాయని, నా ప్రాంతంలో నీళ్ల కొరత రాకూడదనే ఉద్దేశంతో ‘వరి వేసుకోవద్దు, ప్రత్యామ్నాయ పంటలు చూసుకోండి’ అని ముందే రైతులకు చెప్పాను. ఇది నాకు రైతుల పట్ల ఉన్న బాధ్యత.”
“ప్రభుత్వం నీళ్లు విడుదల చేస్తుందని ముందే తెలుసుకుని, తీరా నీళ్లు వదిలే సమయానికి ధర్నాల డ్రామా మొదలుపెట్టారు. ఆ క్రెడిట్ ఏదో తాము పోరాడితేనే వచ్చినట్టు చెప్పుకోవడానికి ఇంత దిగజారాలా? రైతుల కష్టాలను అడ్డం పెట్టుకుని మాపై బురద జల్లి, పబ్లిసిటీ పిచ్చితో చేసే ఇలాంటి చిల్లర రాజకీయాలను ప్రజలెవరూ నమ్మరు.”
“వారి కపట నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు.”













