కర్నూలు జిల్లాలో విషాదం.. కన్న కొడుకును గొడ్డలితో నరికి చంపిన తండ్రి

బనగానపల్లె: కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలు, ఆస్తి వివాదాల నేపథ్యంలో ఓ తండ్రి తన కన్న కొడుకును అత్యంత కిరాతకంగా గొడ్డలితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. బాల మద్దిలేటి (56) తన కుమారుడు మధు (30)పై నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. మధు తరచూ మద్యం సేవిస్తూ ఇంట్లో గొడవలకు కారణమవుతున్నాడని, తండ్రి-కొడుకుల మధ్య గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు, కుటుంబ విభేదాలు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ విభేదాలే చివరకు ఘోరానికి దారితీసినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.

హత్య అనంతరం బాల మద్దిలేటి తన భార్య సుబ్బమ్మ (50)పై కూడా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సుబ్బమ్మకు చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని హత్యకు గల పూర్తి కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.