రాయలసీమ న్యూస్, నంద్యాల: నందికొట్కూరు పట్టణంలో భూ వివాదం ఘర్షణకు దారితీసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాజీ మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి, కృష్ణా రెడ్డి, బొట్టు రవిపై నందికొట్కూరు పోలీస్ స్టేషన్‌లో క్రైమ్ నెంబర్ 80/2026 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అయిన నేపథ్యంలో గురువారం రాత్రి 11.20 గంటలకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఫిర్యాదుదారు జి. సూర్య వెంకటేశ్వర రెడ్డి ఇచ్చిన వివరాల ప్రకారం, తన తాత గాంతి నారాయణ రెడ్డి పేరుమీద నందికొట్కూరు మిడుతూరు రోడ్డులోని సర్వే నంబర్లు 827/బి1, 827/బి2లో 2.73 ఎకరాల భూమి ఉందని పేర్కొన్నారు.
ఈ నెల 24వ తేదీ సాయంత్రం 4.30 గంటల సమయంలో ఆ స్థలాన్ని JCBతో శుభ్రం చేయిస్తున్న సమయంలో, అక్కడి ఫోటోలు తీసుకుని తిరిగి వస్తుండగా దాసి సుధాకర్ రెడ్డి, కృష్ణా రెడ్డి తనను అడ్డుకున్నారని ఫిర్యాదులో తెలిపారు. తన వద్ద ఉన్న iPhoneను లాక్కుని, కృష్ణా రెడ్డి, బొట్టు రవి కాళ్లతో, చేతులతో దాడి చేశారని ఆయన ఆరోపించారు.
మళ్లీ ఆ స్థలం జోలికివస్తే చంపేస్తామని బెదిరించారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనతో నందికొట్కూరు పట్టణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బాధ్యత గల మున్సిపల్ చైర్మన్ పదవి నిర్వహించిన వ్యక్తి స్థలాల కోసం ఇలాంటి ఘర్షణలకు దిగడం సరికాదని పట్టణ వాసులు అభిప్రాయపడుతున్నారు.
పట్టణ అభివృద్ధిని పూర్తిగా పక్కన పెట్టి కొందరు స్థానిక నేతలు భూ కబ్జాలు, దందాలు, రేషన్ బియ్యం వ్యవహారాలకే పరిమితమైపోయారని, ప్రజా సమస్యలను గాలికొదిలేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నందికొట్కూరులో మౌలిక వసతులు, అభివృద్ధి పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నవారు, అధికారంలో ఉన్నవారిగా ఉన్న కాలంలో కూడా స్వలాభం కోసమే పాకులాడుతున్నారనే ఆరోపణలు స్థానిక స్థాయిలో వ్యక్తమవుతున్నాయి.
ఈ వివాదం పూర్తిగా సివిల్ వివాదమని, ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని నందికొట్కూరు పోలీసులు స్పష్టం చేశారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని, చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన పూర్తి వాస్తవాలు దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది.













