రాయలసీమ న్యూస్, నంద్యాల:
సంగమేశ్వరం క్షేత్రానికి భక్తుల రద్దీ
నందికొట్కూరు నంద్యాల జిల్లా కొత్తపల్లి మండలంలోని ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం సంగమేశ్వరం ఆలయానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. సప్తనదుల్లో స్నానం ఆచరించి సంగమేశ్వరుడి దర్శనం చేసుకుంటే పాప విమోచనం కలిగి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఏడాదిలో కొన్ని నెలలపాటు మాత్రమే ఈ ఆలయంలో స్వామి దర్శనం భాగ్యం కలగటంతో, దర్శనార్థం భక్తులు పోటెత్తుతున్నారు.
గత ఏడాది ముందస్తు వర్షాల కారణంగా జూన్ రెండో వారంలోనే కృష్ణమ్మ పరువళ్లతో ఉప్పొంగి, ఆలయం పూర్తిగా నది ఒడిలోకి చేరింది. శ్రీశైలం జలాశయ నీటిమట్టం క్రమంగా తగ్గడంతో ఎనిమిది నెలల 20 రోజుల తర్వాత ఆలయం మళ్లీ బయటపడింది. మార్చి 23న ఆలయం పూర్తిగా వెలుగులోకి రావడంతో వేపదార శివలింగం భక్తులకు దర్శనమిచ్చింది. దీంతో వేపదార శివలింగం దర్శనం కోసం భక్తులు మరింతగా తరలివస్తున్నారు.
సంగమేశ్వరం వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆధ్యాత్మిక ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. ఎందరో మునులు తపస్సు చేసిన స్థలంగా పురాణాల్లో ప్రస్తావించబడింది. తుంగ, భద్ర, క్రిష్ణ, వేణి, భీమ, మలాపహరిణి, భనవాసి అనే ఏడు నదులు కలిసే ఏకైక ప్రదేశంగా సంగమేశ్వరం ప్రత్యేకత సంతరించుకుంది.
పురాణాల ప్రకారం ప్రజల పాపాలను ప్రక్షాళన చేస్తూ పునీతులుగా మార్చే గంగా నదికి ఒక దశలో కాకి రూపం వచ్చిందని, ఆ రూపం పోగొట్టుకోవటానికి సమస్త తీర్థాలతో జలకళశం చేసి సంగమంలో స్నానం చేయడంతో హంస రూపం పొందిందని కథనం. పాప నివృత్తి జరిగిన ప్రదేశంగా భావించబడుతున్నందున ఈ ప్రాంతానికి ‘నివృత్తి సంగమేశ్వరం’ అనే పేరు ఏర్పడింది.
ఇక భక్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఎగువన ఉన్న ఉమామహేశ్వరాలయం నుంచి గర్భాలయానికి వెళ్లే దారి ఏటవాలుగా, గట్టు ఎక్కువగా ఉండటంతో వాహనాలు ఆలయం వద్దకు చేరుకోవడం కష్టసాధ్యమవుతోంది. స్నానాలు చేసే ప్రాంతంలో భారీగా గుర్రపు డెక్క పేరుకుపోవడంతో భక్తులు సౌకర్యంగా స్నానం చేయలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఒకప్పుడు వెలుగు వెలిగిన ఆలయ సముదాయం క్రమంగా శిథిలావస్థకు చేరింది. ప్రస్తుతం కనిపిస్తున్న ఆలయం సుమారు 200 సంవత్సరాల క్రితం స్థానికులు నిర్మించినదిగా శిథిలాలను పరిశీలిస్తే అర్థమవుతోంది. సుమారు ఇరవై వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయం, చుట్టూ ప్రకారం నిర్మాణాలు ఉన్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం దర్శనమిస్తున్న ప్రధాన ఆలయం అత్యంత సాదాసీదాగా ఉంది. ముఖ మండపం పూర్తిగా శిథిలమైపోగా, అంతరాలయం, గర్భాలయం మాత్రమే నిలిచి ఉన్నాయి. గర్భాలయంలో సంగమేశ్వరుడు పూజలందుకుంటున్నారు. శివలింగం వెనుక భాగంలో ఎడమవైపు శ్రీలలితాదేవి, కుడివైపు వినాయకుడు దర్శనమిస్తున్నారు.
శ్రీశైలం ప్రాజెక్ట్ నీటిలో ఈ ఆలయం మునిగిపోవడం వల్ల నిత్యపూజలు నిర్వహించే అవకాశం లేదు. ఏడాదిలో మూడు, నాలుగు నెలలపాటు మాత్రమే పూజలు జరుగుతాయి. వర్షాలు కురిసి నదిలో నీరు పెరిగితే క్రమంగా ఆలయం మళ్లీ కృష్ణమ్మ ఒడిలో కలిసిపోతుంది. మరికొద్ది రోజులే స్వామి దర్శనానికి అవకాశం ఉండటంతో, ఈ మధ్యకాలంలో భక్తులు భారీగా సంగమేశ్వరం చేరుకుంటున్నారు.













