నంద్యాల జిల్లావ్యాప్తంగా పోలీస్ స్టేషన్‌ల పరిధిలో నివసిస్తున్న రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు, చెడు నడత కలిగిన వారిపై ప్రత్యేక దృష్టి సారించిన జిల్లా పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమాన్ని నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షొరాణ్ IPS ఆదేశాల మేరకు చేపట్టారు.

జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న రౌడీషీటర్లు, గతంలో నేరాలకు పాల్పడిన వారు, అసాంఘిక కార్యకలాపాల్లో పాల్గొన్న వ్యక్తులను పోలీస్ అధికారులు స్టేషన్‌లకు పిలిపించి మాట్లాడారు. వారికి సత్ప్రవర్తనతో జీవించాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని సూచించారు.

కౌన్సిలింగ్ సందర్భంగా సంబంధిత వ్యక్తుల ప్రస్తుత జీవన విధానం, జీవనోపాధి కోసం చేస్తున్న వృత్తులపై పోలీస్ అధికారులు ఆరా తీశారు. కుటుంబ పరిస్థితులు, సామాజిక పరిసరాలు, ఆర్థిక స్థితిగతుల గురించి తెలుసుకుని, చట్టబద్ధమైన మార్గంలో జీవనం సాగించాలని వారికి సూచనలు ఇచ్చారు.

అసాంఘిక, చట్ట వ్యతిరేక కార్యకలాపాల్లో ఇకపై పాల్గొనరాదని, సమాజంలో మంచి పౌరులుగా మారాలని పోలీస్ అధికారులు వారికి స్పష్టం చేశారు. వారి కదలికలపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, పోలీసుల సూచనలను పట్టించుకోకుండా మళ్లీ నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

రౌడీషీటర్లు, నేరచరిత్ర కలిగిన వ్యక్తులు మళ్లీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే PD Act, బైండోవర్ కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. నేరప్రవృత్తి నుంచి బయటపడేందుకు, సాధారణ జీవితంలో తిరిగి స్థిరపడేందుకు పోలీసుల సూచనలను పాటించాలని వారికి అవగాహన కల్పించారు.

జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ఈ కౌన్సిలింగ్ కార్యక్రమం ద్వారా నేరప్రవృత్తి తగ్గింపుతో పాటు శాంతిభద్రతల పరిరక్షణకు తోడ్పడేలా చర్యలు కొనసాగుతాయని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.