నల్లమలలోని ‘నాగార్జునసాగర్‌–శ్రీశైలం పులుల అభయారణ్యం’ (ఎన్‌.ఎస్‌.టి.ఆర్‌) పరిధిలో సమగ్ర పురావస్తు సర్వే నిర్వహించేందుకు భారత పురావస్తుశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. మొత్తం 3,727.82 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఈ నెల 11 నుంచి 13 వరకు సర్వే చేపట్టాలని నిర్ణయించారు. ఇందుకోసం అటవీశాఖ ఆధ్వర్యంలో అవసరమైన అనుమతులు, భద్రతా ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

నల్లమల ప్రాంతంలో గతంలో లభ్యమైన శిలాశాసనాల ఆధారంగా మరిన్ని శాసనాలను గుర్తించి, వాటిని శాస్త్రీయంగా విశ్లేషించేందుకు భారత పురావస్తుశాఖ శాసనాల విభాగం అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. ఒకటో శతాబ్దానికి ముందే నల్లమలలో శ్రీశైల ఆలయం ఉన్నట్లు కొన్ని శాసనాలు వెల్లడిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు, శివాజీతో సహా అనేకమంది రాజులు శ్రీశైలాన్ని దర్శించుకున్నట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

పల్లవులు, కాకతీయులు తదితర రాజవంశాలు శ్రీశైలం అభివృద్ధికి పలు చర్యలు చేపట్టినట్టు శాసనాల ద్వారా తెలిసింది. వారు ఆలయ అభివృద్ధి, సేవల గుర్తుగా తామ్రపత్రాలు, శిలాశాసనాలు ప్రతిష్ఠించారు. వాటిలో కొన్నే ఇప్పటివరకు లభ్యమయ్యాయి. మరికొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. ముఖ్యంగా అటవీ మార్గాల గుండా శ్రీశైలం చేరుకునే మార్గంలో అనేక శిలాశాసనాలు ఏర్పాటు చేసినట్టు నిపుణులు భావిస్తున్నారు.

నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాల పరిధిలో విస్తరించిన నల్లమల నడకమార్గాల్లో ఇప్పటివరకు కొద్దిమాత్రమే శిలాశాసనాలు బయటపడ్డాయి. రాబోయే సర్వేలో మరిన్ని శాసనాలు, నిర్మాణాల వివరాలు లభిస్తే శ్రీశైలానికి సంబంధించిన చారిత్రక అంశాలు, ఆలయ ఆస్తులు, అప్పటి రాజుల సేవా కార్యక్రమాలపై కొత్త సమాచారం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పురావస్తు నిపుణులు అంచనా వేస్తున్నారు.

నల్లమల అడవుల మధ్యగా శ్రీశైలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం వందల ఏళ్ల క్రితమే పలువురు రాజులు అనేక కట్టడాలు నిర్మించారు. భక్తులు విశ్రాంతి తీసుకునేందుకు మండపాలు, గుహలు, స్నానాల కోసం కొలనులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మహాశివరాత్రి, ఉగాది రోజుల్లో మాత్రమే ఈ అటవీ మార్గాల్లో ప్రయాణానికి అటవీశాఖ అధికారులు అనుమతులు ఇస్తున్నారు. మిగతా రోజుల్లో ప్రవేశాన్ని నియంత్రిస్తున్నారు.

సాధారణ రోజుల్లో కూడా ఈ ప్రాంతాలను పర్యాటకులు సందర్శించేలా ఎకో టూరిజం అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనలు ప్రభుత్వ స్థాయిలో పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పురావస్తు సర్వే ద్వారా లభించే వివరాలు భవిష్యత్‌ ప్రణాళికలకు దోహదపడతాయని అధికారులు భావిస్తున్నారు.

అని భారత పురావస్తుశాఖ శాసనాల విభాగం సంచాలకులు మునిరత్నంరెడ్డి తెలిపారు.