రాయలసీమ న్యూస్, డిస్ట్రిక్ట్ న్యూస్ డెస్క్: నంద్యాల : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి, అమ్మవార్లకు భక్తులు భారీ విరాళాన్ని సమర్పించారు. సుమారు కోటి రూపాయల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు, పూజా సామగ్రిని దాతలు దేవస్థానానికి అందజేశారు.
కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన శ్రీ లలితా ఎంటర్ ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్ మట్టే శ్రీనివాస్ దంపతులు ఈ విరాళాన్ని సమర్పించినట్లు దేవస్థానం ఈఓ శ్రీనివాసరావు తెలిపారు. మల్లన్న స్వామి, అమ్మవార్ల సేవలో భాగంగా ఈ ఆభరణాలు, వెండి వస్తువులను సమర్పించినట్లు ఆయన వివరించారు.
దాతలు సమర్పించిన వస్తువుల్లో బంగారు నామాలు, చంద్రవంక కలిగిన వెండి జటాజూటం, పలు వెండి పూజావస్తువులు, బంగారు రుద్రాక్షమాల, మంగళసూత్రాలు ఉన్నాయని ఈఓ వివరించారు. వీటిలో వెండి వస్తువుల బరువు 42 కిలోల 516 గ్రాములు, బంగారు ఆభరణాల బరువు 73 గ్రాముల 500 మిల్లీగ్రాములుగా నమోదైందని చెప్పారు.
ప్రస్తుతం మార్కెట్ ధరల ప్రకారం ఈ బంగారు, వెండి వస్తువుల మొత్తం విలువ సుమారు కోటి రూపాయల వరకు ఉంటుందని ఈఓ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ విరాళం దేవస్థానం ఆస్తుల్లో విలువైన భాగంగా చేరనున్నట్లు ఆయన తెలిపారు.
బంగారు ఆభరణాలు, వెండి వస్తువులను దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు ఆలా అనిల్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులకు దాతలు అందజేశారు. ఈ సందర్భంగా దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. భక్తుల నుంచి ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగడం ఆలయ అభివృద్ధికి దోహదం చేస్తుందని దేవస్థానం వర్గాలు అభిప్రాయపడ్డాయి.













