రాయలసీమ న్యూస్, నంద్యాల: శ్రీశైలం: లోకక్షేమం, లోకకల్యాణం కోసం శ్రీశైల దేవస్థానం మంగళవారం ఆలయ ప్రాంగణంలోని నందీశ్వర స్వామికి (శనగల బసవన్న స్వామివారికి) విశేషార్చనలను నిర్వహించింది. ప్రతి మంగళవారం, త్రయోదశి రోజున దేవస్థాన సేవగా (సర్కారీ సేవగా) ఈ కైంకర్యం జరిపించబడుతోంది.
ప్రదోషకాలంలో, అనగా సాయంసంధ్యా సమయంలో ఈ విశేషపూజలు నిర్వహించారు. ఈ విశేషార్చనలో ముందుగా లోకక్షేమాన్ని కాంక్షిస్తూ దేశం శాంతి, సౌభాగ్యాలతో విలసిల్లాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించకుండా సకాలంలో తగినంత వర్షాలు కురిసి పంటలు బాగా పండాలని, పాడి సమృద్ధిగా ఉండాలని, జనులకు ఆయురారోగ్యాలు కలిగి వారికి అకాలమరణాలు రాకుండా ఉండాలని, దేశంలో అగ్నిప్రమాదాలు, వాహన ప్రమాదాలు మొదలైనవి జరగకుండా ఉండాలని, జనులందరూ సుఖశాంతులతో ఉండాలన్న సంకల్పాన్ని అర్చక స్వాములు, వేదపండితులు తెలిపారు.
అనంతరం కార్యక్రమం నిర్విఘ్నంగా సాగేందుకు మహాగణపతి పూజను జరిపించారు. ఆ తరువాత నందీశ్వర స్వామికి శాస్త్రోక్తంగా పంచామృతాలతో పాటు ఫలోదకాలతో, హరిద్రోదకం, కుంకుమోదకం, గంధోదకం, భస్మోదకం, రుద్రాక్షోదకం, బిల్వోదకం, పుష్పోదకం, సువర్ణోదకం మరియు మల్లికా గుండులోని శుద్ధజలంతో అభిషేకం నిర్వహించారు.
తరువాత నందీశ్వర స్వామికి అన్నాభిషేకం చేశారు. వృషభ సూక్తం మొదలైన వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా ఈ విశేషాభిషేకం చేయడం జరిగింది. అనంతరం నందీశ్వర స్వామివారికి నూతన వస్త్ర సమర్పణ, విశేష పుష్పార్చనలు నిర్వహించారు.
తరువాత నానబెట్టిన శనగలను నందీశ్వర స్వామికి సమర్పించారు. చివరగా స్వామికి నివేదన సమర్పించి కార్యక్రమాన్ని ముగించారు.













