రాయలసీమ న్యూస్, నంద్యాల: ఎగువ పరీవాహక ప్రాంతాల్లో వరద ఉదృతి పెరగడంతో శ్రీశైలం జలాశయానికి వరదనీరు భారీగా వచ్చి చేరుతోంది. దీంతో జలాశయం నీటిమట్టం గంటగంటకూ పెరుగుతున్నట్లు డ్యామ్ అధికారులు తెలిపారు.
ఆల్మట్టి, నారాయణ్ పూర్, జూరాల వంటి ఎగువ జలాశయాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు అధిక మొత్తంలో వరదనీరు చేరడంతో శ్రీశైలం డ్యామ్ వరదనీటితో నిండిపోతోంది. జలాశయం పరిసరాల్లో జలకళలు వెల్లివిరుస్తున్నాయి.
శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 869.20 అడుగులుగా నమోదైంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు. ప్రస్తుతం 138.2730 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వివరించారు.
జూరాల నుంచి శ్రీశైలం జలాశయానికి ఇన్ ఫ్లోగా 2,20,948 క్యూసెక్కుల వరదనీరు చేరుతోంది. వరద ప్రవాహం ఇదే స్థాయిలో కొనసాగితే మరో వారం రోజుల్లో శ్రీశైలం జలాశయం పూర్తిస్థాయికి చేరుకునే అవకాశం ఉందని డ్యామ్ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదిలా ఉండగా, వరదనీటి లభ్యత పెరగడంతో శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ కేంద్రంలో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించింది. గడిచిన 24 గంటల్లో ఈ కేంద్రంలో 3.435 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు సంబంధిత విభాగం సమాచారం.
శ్రీశైలం జలాశయం నుంచి అవుట్ ఫ్లోగా 7,493 క్యూసెక్కుల వరదనీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువ ప్రాంతాల అవసరాలు, భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకుని నీటి విడుదల కొనసాగుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
అయితే శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో ఇంకా విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం కాలేదు. వరదనీటి స్థితిగతులు, సాంకేతిక అంశాలను పరిశీలించిన అనంతరం అక్కడ విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించే అవకాశమున్నట్లు అధికార వర్గాలు సూచిస్తున్నాయి.













