ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు నేడు వ్యాపార రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు ఆర్థిక బలంగా నిలుస్తున్నారు. నంద్యాల జిల్లాలో స్వయం సహాయక సంఘాల మహిళలు స్త్రీనిధి ద్వారా రుణాలు పొంది పలు రంగాల్లో వ్యాపారాలు ప్రారంభించి ఆదాయం పొందుతున్నారు. తక్కువ వడ్డీతో, సులభమైన విధానంలో రుణాలు లభించడం మహిళలకు పెద్ద తోడ్పాటుగా మారింది.

స్త్రీనిధి రుణాలు పొందిన పలువురు మహిళలు కిరాణా, ఫ్యాన్సీ దుకాణాలు, టైలరింగ్, పాడి పరిశ్రమ, నర్సరీలు, పండ్ల వ్యాపారాలు నిర్వహిస్తూ నెలకు సుమారు రూ.30 వేల వరకు సంపాదిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కుటుంబ అవసరాలు తీర్చుకోవడంతో పాటు కొంత మొత్తాన్ని పొదుపు చేస్తూ ఆర్థికంగా స్థిరపడుతున్నారు. ప్రభుత్వం స్త్రీనిధి రుణాలను మరింతగా పెంచితే తమ వ్యాపారాలను విస్తరించుకునే అవకాశం ఉంటుందని మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నంద్యాల జిల్లాలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి స్త్రీనిధి లక్ష్యంగా రూ.376.72 కోట్లు నిర్ణయించారు. ఈ మొత్తాన్ని 36,324 మందికి రుణాల రూపంలో అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు 9,081 మందికి రూ.94 కోట్ల రుణాలు మంజూరు చేసినట్లు సంబంధిత శాఖ అధికారులు వెల్లడించారు.

నంద్యాల జిల్లా డోన్‌కు చెందిన రేణుక, సుజాత మహిళా సంఘంలో సభ్యురాలు. గత ఏడాది స్త్రీనిధి ద్వారా రూ.లక్ష రుణం పొందింది. అందులో రూ.30 వేలతో టైలరింగ్ మిషన్ కొనుగోలు చేసి, మిగిలిన మొత్తంతో చీరల వ్యాపారం ప్రారంభించింది. నెలనెలా వాయిదాలు క్రమం తప్పకుండా చెల్లిస్తూ, అన్ని ఖర్చులు తీర్చుకున్న తర్వాత సుమారు రూ.25 వేల ఆదాయం వస్తోందని ఆమె తెలిపింది. వచ్చిన డబ్బుతో కుటుంబ అవసరాలు చూసుకోవడంతో పాటు కొంత మొత్తాన్ని పొదుపు చేస్తోందని, జీవనోపాధి కోసం రుణం తీసుకొని ఉపాధి పొందవచ్చని ఆమె పేర్కొంది.

పాణ్యం గ్రామానికి చెందిన మద్దమ్మ, గీత పొదుపు సంఘంలో సభ్యురాలు. జీవనోపాధి కోసం కర్నూలులోని ఎమ్మిగనూరు రోడ్డులో నర్సరీ నిర్వహిస్తోంది. మూడు నెలల క్రితం స్త్రీనిధి ద్వారా రూ.లక్ష రుణం తీసుకుని నర్సరీలో పెట్టుబడి పెట్టింది. కుటుంబ సభ్యులంతా కలిసి నర్సరీలో పనిచేస్తున్నారు. బెంగళూరు నుంచి మొక్కలు తెచ్చుకుని విక్రయిస్తూ నెలకు సుమారు రూ.20 వేల వరకు ఆదాయం పొందుతున్నట్లు తెలిపింది.

స్త్రీనిధి వంటి పథకాలు గ్రామీణ మహిళల జీవితాల్లో మార్పు తీసుకొస్తున్నాయని, స్వయం ఉపాధి ద్వారా వారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారని స్థానిక అధికారులు అభిప్రాయపడుతున్నారు.