పని ప్రదేశాల్లో మహిళల భద్రతకు చర్యలు వేగం

నంద్యాల : సమాజంలోని అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్న మహిళలు పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల బారిన పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. వారి ఆత్మగౌరవం, వృత్తి ఎదుగుదలకు ఇది పెద్ద అడ్డంకిగా మారుతుండటంతో ప్రభుత్వం చట్టపరమైన చర్యలను బలోపేతం చేసింది. పని ప్రదేశాల్లో మహిళల రక్షణ కోసం 2013లో అమల్లోకి వచ్చిన లైంగిక వేధింపుల నిరోధక చట్టం (పోష్ యాక్ట్) అమలుపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది.

ఈ చట్టం ప్రకారం ప్రతి కార్యాలయంలో ప్రత్యేక కమిటీల ఏర్పాటు తప్పనిసరి. జిల్లాస్థాయిలో స్థానిక ఫిర్యాదుల కమిటీకి కలెక్టర్ ఛైర్‌పర్సన్‌గా వ్యవహరించాలి. ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలన్నింటిలోనూ చట్టంపై అవగాహన కల్పించడం, గోడపత్రికలు అంటించడం వంటి చర్యలు తీసుకోవాలని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడైనా పది మంది లేదా అంతకంటే ఎక్కువ మహిళా ఉద్యోగినులు ఉన్న కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు (ICC) ఏర్పాటు చేయాలి. పది మందికంటే తక్కువ మహిళా సిబ్బంది ఉన్న చోట ప్రభుత్వమే లోకల్ కంప్లైంట్స్ కమిటీ ని ఏర్పాటు చేస్తుంది.

నంద్యాల సఖి వన్ స్టాప్ సెంటర్ లో ఐసీడీఎస్ అధికారులు మహిళలకు పోష్ యాక్ట్‌పై అవగాహన కల్పిస్తున్నారు. పని ప్రదేశాల్లో ఈ చట్టం అమలు, కమిటీల ఏర్పాటు, ఫిర్యాదు విధానాలపై వివరాలు తెలియజేస్తున్నారు. త్వరలో మరిన్ని కార్యాలయాల్లో కమిటీల ఏర్పాటు, అవగాహన కార్యక్రమాలను విస్తరించనున్నట్లు జిల్లా ఐసీడీఎస్ PD లీలావతి దేవీ వెల్లడించినట్లు అధికారులు తెలిపారు.

పని ప్రదేశాల్లో సూటిపోటి మాటలు, అసభ్య సైగలు, అనవసరంగా శారీరకంగా తాకడం, ద్వంద్వార్థ సంభాషణలు, అశ్లీల చిత్రాలు చూపించడం, లైంగిక సంబంధాల కోసం ఒత్తిడి చేయడం వంటి చర్యలన్నీ చట్టం ప్రకారం లైంగిక వేధింపుల కిందకే వస్తాయి. ఇలాంటి వేధింపులకు గురైన మహిళలు తమ కార్యాలయంలోని అంతర్గత ఫిర్యాదుల కమిటీకి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయవచ్చు. సంఘటన జరిగిన మూడు నెలల్లోపు ఫిర్యాదు చేయాలని నిబంధనలు పేర్కొంటున్నాయి.

ఫిర్యాదు చేయడానికి She Box పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో కూడా అవకాశం ఉంది. అక్కడ నమోదు చేసిన ఫిర్యాదు నేరుగా సంబంధిత కమిటీకి చేరుతుంది. అదనంగా 181, 112 హెల్ప్‌లైన్ నంబర్లకు కాల్ చేసి సహాయం కోరవచ్చు. ఫిర్యాదు చేసేందుకు బాధితురాలు ఇతరుల సహాయం తీసుకోవచ్చు. ఫిర్యాదు అందిన తర్వాత కమిటీ విచారణ ప్రారంభించి, నేరం నిర్ధారణ అయితే హెచ్చరిక, సస్పెన్షన్, ఉద్యోగం నుంచి తొలగింపు, పదోన్నతి నిలిపివేత, వేతనం నిలుపుదల వంటి శిక్షలు విధించవచ్చు. బాధితురాలికి నష్టపరిహారం చెల్లించే బాధ్యతను కూడా దోషిపై మోపే అవకాశం ఉంది.

జిల్లాలో ప్రస్తుతం 137 ప్రభుత్వ కార్యాలయాల్లో 20 వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 7 వేల మంది మహిళా ఉద్యోగినులు ఉన్నారు. మొత్తం 549 సచివాలయాల్లో 5 వేల మందికి పైగా సిబ్బంది పనిచేస్తుండగా, ఇప్పటివరకు 47 ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇప్పటివరకు నాలుగు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. పని ప్రదేశాల్లో నిశ్శబ్దంగా భరించకుండా, చట్టం అందించే రక్షణను వినియోగించుకోవాలని మహిళా సంఘాలు పిలుపునిస్తున్నాయి.