వ్యక్తిగత వివరాలు, ఆర్థిక లావాదేవీలకు కీలకమైన ఆధార్‌ నంబర్‌ వినియోగంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆధార్‌ వివరాలు దుర్వినియోగం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యతగా భావిస్తున్నారు.

ఆధార్‌ ద్వారా జరిగే Authentication వివరాలను తరచూ పరిశీలించడం అవసరమని సూచిస్తున్నారు. ఇందుకోసం యూనిక్యూ ఐడెంటిఫికేషన్ అథారిటీ అఫ్ ఇండియా (UIDAI) వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా అంథేన్తికేషన్ హిస్టరీ చెక్‌ చేసుకోవచ్చు. ఆధార్‌ ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా వన్ టైం పాస్వర్డ్ (OTP) లేదా బయోమెట్రిక్ ద్వారా ఉపయోగించబడిందో అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అనుమానాస్పదమైన వినియోగం కనిపించిన వెంటనే అప్రమత్తం కావాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

బయోమెట్రిక్‌ వినియోగం అవసరం లేని సమయంలో బయోమెట్రిక్ లాక్ సదుపాయాన్ని ఉపయోగించడం మంచిదని సూచిస్తున్నారు. బయోమెట్రిక్ లాక్ ద్వారా ఆధార్‌కు సంబంధించిన ఫింగెర్ప్రింట్ , ఐరిస్ వంటి బయోమెట్రిక్‌ వివరాలు తాత్కాలికంగా లాక్‌ అవుతాయి. అవసరం వచ్చినప్పుడు తిరిగి ఉంలోక్ చేసుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా అనధికారికంగా బయోమెట్రిక్‌ వినియోగం జరిగే అవకాశాలు తగ్గుతాయని అధికారులు చెబుతున్నారు.

ఆధార్‌ నంబర్‌ను నేరుగా పంచుకోవడం కంటే వర్చ్యువల్ ID (VID) వినియోగం మరింత సురక్షితమని UIDAI సూచిస్తోంది. ఆధార్ లాక్ లేదా VID సదుపాయాల ద్వారా ఆధార్‌ నంబర్‌ బదులుగా వర్చ్యువల్ ID ఉపయోగించవచ్చు. ఈ వర్చ్యువల్ ID ద్వారా అంథేన్తికేషన్ , e-KYC వంటి సేవలను పొందవచ్చు. దీంతో అసలు ఆధార్‌ నంబర్‌ బయటకు వెళ్లకుండా అదనపు భద్రత లభిస్తుంది.

ఆధార్‌ సంబంధిత మోసాలకు గురైనప్పుడు వెంటనే స్పందించడం అత్యంత కీలకం. అనుమానాస్పద లావాదేవీలు, మోసపూరిత కాల్స్‌, మెసేజ్‌లు, లింకులు ద్వారా ఆధార్‌ లేదా బ్యాంక్‌ వివరాలు దుర్వినియోగం జరిగిందని భావిస్తే వెంటనే 1930 నంబర్‌కు కాల్‌ చేసి Cyber క్రైమ్ విభాగానికి ఫిర్యాదు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అలాగే బ్యాంక్‌, UPI వివరాలను సురక్షితంగా ఉంచుకోవడం, అనుమానాస్పద లింకులు, యాప్‌లు, వెబ్‌సైట్లలో నమోదు చేయకుండా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

ఆధార్‌ కాపీల విషయంలో కూడా ప్రజలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అవసరం లేని చోట ఆధార్‌ ఫోటోకాపీ ఇవ్వడం, OTP పంచుకోవడం, ఇతర వ్యక్తిగత వివరాలను తెలియని వ్యక్తులకు లేదా అనుమానాస్పద సంస్థలకు అందించడం ప్రమాదకరమని చెబుతున్నారు. ఆధార్‌ కాపీ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కారణం, వినియోగం, భద్రతా ఏర్పాట్ల గురించి స్పష్టంగా తెలుసుకోవాలని సూచిస్తున్నారు.

వ్యక్తిగత గుర్తింపు, ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వ సేవలందుబాటులో ఆధార్‌ కీలక పాత్ర పోషిస్తున్న నేపథ్యంలో, “మీ ఆధార్‌… మీ బాధ్యత” అన్న భావనతో ప్రతి ఒక్కరూ తమ ఆధార్‌ వివరాలను సురక్షితంగా ఉంచుకోవాలని నిపుణులు పిలుపునిస్తున్నారు.