ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో భార్య ప్రణాళికబద్ధంగా భర్తను హత్య చేసి, గుండెపోటుతో మరణించినట్టు నాటకం ఆడిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మొబైల్ ఫోన్‌లో ఉన్న చాటింగ్ ఆధారంగా ఈ హత్య రహస్యం బయటపడింది. ముజఫర్‌నగర్‌కు చెందిన తాహిర్ (30) అనే రాతిపని మేస్త్రీ, తన భార్య ఇల్మా (27), ముగ్గురు సంవత్సరాల కుమార్తెతో కలిసి మీరట్‌లోని జాకిర్ కాలనీలో నివసిస్తున్నాడు.

నాలుగేళ్ల క్రితం వీరి వివాహం జరిగింది. ఇల్మా స్థానికంగా ఉన్న ఒక బ్యూటీ స్టూడియోలో బ్యూటీషియన్‌గా పనిచేస్తోంది. అదే స్టూడియో యజమాని అమన్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ వ్యవహారంపై భర్త తాహిర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ, తరచూ ఆమెతో వాగ్వాదాలు చేసేవాడు. తమ బంధానికి భర్త అడ్డుగా మారాడని భావించిన ఇల్మా, అతడిని శాశ్వతంగా తొలగించాలనే ఆలోచనకు వెళ్లింది.

పోలీసుల సమాచారం ప్రకారం, సెప్టెంబర్ 28 రాత్రి తాహిర్ పని ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత ఇల్మా తన ప్రియుడు అమన్, అతని స్నేహితుడిని ఇంటికి పిలిపించింది. తాహిర్‌పై దాడి చేసే సమయంలో ఇల్మా అతని కాళ్లు బిగిగా పట్టుకోగా, అమన్, అతని స్నేహితుడు కలిసి చున్నీతో తాహిర్ గొంతు నులిమి చంపేశారు. అనంతరం ఏమీ తెలియనట్టు నటించిన ఇల్మా, తాహిర్ మొబైల్ ఫోన్ నుంచే బంధువులకు కాల్ చేసి, అతడికి తీవ్రమైన గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా మరణించాడని చెప్పింది.

తాహిర్ కుటుంబ సభ్యులు కూడా దీనిని సహజ మరణంగానే భావించి, మరుసటి రోజు సెప్టెంబర్ 29న ముజఫర్‌నగర్‌లోని వారి సొంత గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేసి మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే అంత్యక్రియల తర్వాత కొద్దిరోజులకు తాహిర్ తమ్ముడు, అన్న మొబైల్ ఫోన్ కోసం ఇల్మాను అడిగాడు. ఫోన్ ఎక్కడుందో తెలియదని ఆమె చెప్పడంతో అతనికి అనుమానం వచ్చింది.

ఇల్లంతా వెతికిన తమ్ముడు, బట్టల కుప్పల మధ్య దాచిపెట్టిన తాహిర్ మొబైల్‌ను కనుగొన్నాడు. ఫోన్‌ను తెరిచి పరిశీలించగా, ఇల్మా, అమన్ మధ్య జరిగిన హత్య ప్రణాళికకు సంబంధించిన వాట్సాప్ చాటింగ్స్ బయటపడ్డాయి. ఈ విషయంపై బంధువులు ఇల్మాను గట్టిగా నిలదీయగా, ఆమె చివరకు నేరాన్ని ఒప్పుకుంది. భర్త రోజూ తనను కొడుతున్నాడని, అందుకే ప్రియుడితో కలిసి చంపేశానని అంగీకరించింది.

బాధిత కుటుంబ సభ్యులు ఇల్మా నేరసమ్మతి వీడియోను రికార్డ్ చేసి పోలీసులకు అందించారు. ఫిర్యాదు ఆధారంగా మీరట్ పోలీసులు కేసు నమోదు చేసి ఇల్మాను అదుపులోకి తీసుకున్నారు. హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెలికితీయడానికి ముజఫర్‌నగర్ జిల్లా మేజిస్ట్రేట్ అనుమతితో సమాధి నుండి తాహిర్ మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం చేయాలని నిర్ణయించారు.

పోలీసులు పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.