రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: దేశంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణ బాధ్యతలు చేపట్టే భారత ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు తలెత్తుతున్న వేళ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ భవిష్యత్తుపై చర్చలు ముమ్మరమయ్యాయి. ఆయన పదవికి సంబంధించిన పరిణామాలపై రాజకీయ, న్యాయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. రాజీనామా, పదవి నుంచి తొలగింపు, కేసు నమోదు, అప్రూవర్‌గా మారే అవకాశం.. ఈ నాలుగు అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్నికల సంఘం స్వతంత్రత, దాని నిర్ణయాలపై ప్రజల విశ్వాసం, అధికారులకు కల్పిస్తున్న చట్టపరమైన రక్షణ వంటి అంశాలు మరోసారి తెరపైకి వచ్చాయి. సీఈసీ రాజీనామా చేస్తే ఏమవుతుంది? ఆయనను పదవి నుంచి తొలగించే ప్రక్రియ ఎలా ఉంటుంది? ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం ఎంతవరకు ఉంది? అప్రూవర్‌గా మారితే దాని చట్టపరమైన ప్రభావం ఏమిటి? అనే ప్రశ్నలు న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేసే పరిస్థితి వస్తే.. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలు, గతంలో అనుసరించిన విధానం ప్రకారం తదుపరి ఎన్నికల కమిషనర్‌గా ఉన్న డాక్టర్ సుఖ్‌బీర్ సింగ్ సంధును సీఈసీగా నియమించే అవకాశం ఉందని న్యాయవర్గాలు భావిస్తున్నాయి. అదే సమయంలో ఖాళీ అయ్యే ఎన్నికల కమిషనర్ స్థానాన్ని కూడా భర్తీ చేయాల్సి ఉంటుంది. జ్ఞానేశ్ కుమార్ పదవీకాలం 2029 జనవరి 26తో ముగియాల్సి ఉంది. అంటే ఆయన రాజీనామా చేస్తే నిర్ణీత పదవీకాలం పూర్తికాకముందే పదవి నుంచి తప్పుకున్నట్టవుతుంది.
ప్రస్తుత చట్టం ప్రకారం సీఈసీగా నియమితులయ్యే వ్యక్తి కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి స్థాయి లేదా దానికి సమానమైన హోదాలో పనిచేసిన లేదా పనిచేస్తున్న అధికారి అయి ఉండాలి. గతంలోనూ ఎన్నికల కమిషనర్లు ఆకస్మికంగా పదవి నుంచి నిష్క్రమించిన సందర్భాలు చర్చకు దారితీశాయి. ఎన్నికల కమిషనర్ అశోక్ లవాసా తన సహచరులతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో రాజీనామా చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొద్ది రోజుల ముందు అరుణ్ గోయల్ ఎన్నికల కమిషనర్ పదవికి రాజీనామా చేయడం కూడా అప్పట్లో రాజకీయంగా చర్చనీయాంశమైంది.






