రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ ప్రక్రియ దేశ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ ప్రక్రియలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఏకపక్షంగా, రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలతో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ముమ్మర నిరసనలు ప్రారంభించింది. ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడాలనే పేరుతో జ్ఞానేశ్ కుమార్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించి, అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
దేశ రాజధాని దిల్లీలోని రౌజ్ అవెన్యూ వద్ద ఉన్న పార్టీ కార్యాలయం సమీపంలో వేలాదిగా గుమికూడిన కాంగ్రెస్ కార్యకర్తలు, దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లోని BJP కార్యాలయం మీదుగా నిర్వాచన్ సదన్ వైపు భారీ పాదయాత్ర నిర్వహించారు. ఈ నిరసనలో పాల్గొన్న కార్యకర్తలు జ్ఞానేశ్ కుమార్ మాస్క్‌లు ధరించి, చేతులకు సంకెళ్లు వేసుకొని వినూత్నంగా ఆందోళన వ్యక్తం చేశారు. సీఈసీ తీరుపై కాంగ్రెస్ ప్రారంభించిన ఈ పోరాటం దేశవ్యాప్తంగా ఉద్రిక్త రాజకీయ వాతావరణాన్ని సృష్టించింది.

ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజాస్వామ్యాన్ని, ప్రతిపక్షాల ఓటు హక్కును దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నిరసనలు కేవలం దిల్లీకే పరిమితం కాలేదు. అస్సాం రాజధాని గుహవాటిలో అస్సాం ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు గౌరవ్ గొగోయ్‌తో పాటు పలువురు సీనియర్ నాయకులు నిరసన చేపట్టగా, పోలీసులు వారిని బలవంతంగా నిర్భంధించారు. ఉత్తరప్రదేశ్‌లో కూడా కాంగ్రెస్ పాదయాత్రలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. జోరువానలో కూడా వెనక్కి తగ్గకుండా ప్రదర్శనకు బయలుదేరిన UP కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ రాయ్ సహా పలువురు ముఖ్య నేతలను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా అజయ్ రాయ్ సంచలన ఆరోపణలు చేశారు. వారణాసి లోకసభ స్థానంలో నరేంద్ర మోదీ విజయంలో జ్ఞానేశ్ కుమార్ అక్రమ సహకారం అందించారని ఆయన ఆరోపించారు. బీహార్ రాజధాని పాట్నాలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఎన్నికల సంఘం కార్యాలయాన్ని ముట్టడించేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీగా దూసుకెళ్లగా, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి జలఫిరంగులు ప్రయోగించి నిరసనకారులను చెదరగొట్టారు.

జమ్మూలో వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కూడా నిరసనలు చెలరేగాయి. సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని, ఎన్నికల వ్యవస్థను కాపాడాలని కాంగ్రెస్ నాయకులు బహిరంగంగా డిమాండ్ చేస్తున్నారు.
ఎలక్షన్ కమిషన్ చరిత్రలోనే ఒక రాజ్యాంగ సంస్థపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ఇంత భారీ స్థాయిలో రాజకీయ సమరం సృష్టించడం ఇదే మొదటిసారి అని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సర్ ప్రక్రియ వెనుక అసలు సూత్రధారి జ్ఞానేశ్ కుమారేనని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. ఆయన నిర్ణయాలు ఏకపక్షమే కాకుండా ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయని, వెంటనే పదవి నుంచి తొలగించడంతో పాటు నేరపూరిత కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.
ఈ పోరాటం ఒక్కసారిగా ఇంత తీవ్రరూపం దాల్చడానికి కారణం కేంద్ర ఎన్నికల సంఘం అంతర్గత నివేదిక లీక్ కావడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సింధూ, వివేక్ జోషి కూడా గత 10 నెలల్లో దాదాపు 14 సార్లు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలు, డేటాబేస్ మార్పులు, ఓటర్ల తొలగింపు విధానాలపై అంతర్గతంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు కథనాలు వెలుగులోకి వచ్చాయి. రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలోనే అసమ్మతి వ్యక్తమవుతుండటాన్ని కాంగ్రెస్ ప్రధాన ఆయుధంగా మలుచుకుంది.
కేవలం రాతపూర్వక అభ్యంతరాలకే పరిమితం కాకుండా, సాంకేతిక అంశాలపై కూడా కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. బూత్ లెవెల్ ఆఫీసర్ల కోసం ఉపయోగించే డిజిటల్ అప్లికేషన్‌లో రహస్యంగా MARK VIP అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టారని, దీని ద్వారా ఓటర్ల తొలగింపుకు కుట్ర జరుగుతోందని పార్టీ ఆరోపించింది.
జ్ఞానేశ్ కుమార్ గారు ఇక చాలు. రాహుల్ గాంధీ ఇచ్చిన సలహా విని తక్షణం రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారి నిజాలు చెప్పండి
అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేడా బహిరంగ వ్యాఖ్యానించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజాస్వామ్య సూత్రాలను కాలరాస్తున్నారని ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ, జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు ఈ పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. రాబోయే రోజుల్లో పార్లమెంట్ వేదికగా కూడా ఈ అంశంపై తీవ్రస్థాయిలో నిరసనలు తెలపడానికి ప్రతిపక్షాల INDIA కూటమి సిద్ధమవుతోంది. అలాగే ఓటర్ల జాబితా అక్రమాలపై సుప్రీంకోర్టును ఆశ్రయించే దిశగా కూడా ప్రతిపక్షాలు ఆలోచిస్తున్నాయి. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ నిరసన కీలక మలుపుగా మారబోతోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.







