ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ EPFO కీలక మార్పులు చేపట్టింది. కోట్లాది మంది EPF ఖాతాదారులకు ఉపయోగపడేలా యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్ విధానంలో పెద్ద మార్పు చేసింది. ఇప్పటివరకు ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న UAN యాక్టివేషన్, కొత్త UAN జనరేషన్ సేవలను సంస్థ నిలిపివేసింది. ఇకపై ఈ సేవలు పూర్తిగా ఉమాంగ్‌ యాప్ ద్వారా మాత్రమే అందుబాటులో ఉండనున్నాయి.

ఈపీఎఫ్ఓ పోర్టల్ నుంచి UAN యాక్టివేషన్, కొత్త UAN కేటాయింపు సేవలను తొలగించినట్లు సంస్థ స్పష్టం చేసింది. ఖాతాదారులు ఇకపై UAN సంబంధిత సేవలను పొందాలంటే తప్పనిసరిగా ఉమాంగ్‌ యాప్‌ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మేరకు సేవలను యాప్‌కు మాత్రమే పరిమితం చేశారు.

UAN భద్రతను మరింత బలోపేతం చేయడానికి ఆధార్ ఆధారిత ముఖ ధృవీకరణను తప్పనిసరి చేశారు. అంటే UAN యాక్టివేషన్, కేటాయింపు వంటి సేవలను పొందే సమయంలో ఆధార్‌తో లింక్ అయిన ముఖ గుర్తింపు ధృవీకరణ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇటీవల EPFO డేటాబేస్ ఏకీకరణ, సాఫ్ట్‌వేర్ అప్‌గ్రేడ్‌ల అనంతరం ఆన్‌లైన్ సేవలను వేగవంతంగా, సురక్షితంగా చేయడమే ఈ మార్పుల లక్ష్యంగా పేర్కొంటున్నారు.

UAN యాక్టివేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలనుకునే ఖాతాదారులు ఉమాంగ్‌ యాప్‌లోని ‘UAN సర్వీసెస్ త్రు పేస్ఆ త్ ’ విభాగంలో ఉన్న ‘UAN కేటాయింపు, యాక్టివేషన్’ ఎంపికను ఎంచుకోవాలి. అక్కడ తమ UAN, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, సమ్మతి బాక్స్‌ను టిక్ చేసి ముందుకు వెళ్లాలి. అనంతరం ‘OTP పంపండి’పై క్లిక్ చేయాలి. OTP ధృవీకరణ విజయవంతమైతే, సంబంధిత UAN ఇప్పటికే యాక్టివేట్ అయి ఉందో లేదో స్క్రీన్‌పై సందేశం రూపంలో కనిపిస్తుంది.

ఇక వడ్డీ రేట్ల విషయంలో కూడా EPFO కీలక నిర్ణయం తీసుకుంది. గత ఆర్థిక సంవత్సరం 2025-26కు EPF వడ్డీ రేటును 8.25 శాతంగా నిర్ణయించింది. ఇదే రేటును వరుసగా మూడోసారి కొనసాగించడం ఇదే మొదటిసారి. వడ్డీతో పాటు PF విత్‌డ్రాలకు సంబంధించి కూడా కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి.

కొత్త నియమాల ప్రకారం EPF ఖాతాదారులు తమ ఖాతాల్లో ఎల్లప్పుడూ కనీసం 25 శాతం నిల్వను ఉంచాల్సి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్న సమయంలో పాక్షిక విత్‌డ్రా చేసుకోవాలనుకుంటే, మొత్తం నిధులలో గరిష్టంగా 75 శాతం వరకు మాత్రమే తీసుకునే అవకాశం ఉంటుంది. ఉద్యోగం విడిచిపెట్టిన తర్వాత మాత్రం ఖాతాలో ఉన్న మొత్తం బ్యాలెన్స్‌ను ఒకేసారి విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఉదాహరణకు ఒక చందాదారుని EPF ఖాతాలో మొత్తం రూ.2 లక్షలు ఉంటే, ఉద్యోగంలో ఉన్నప్పుడే పాక్షిక విత్‌డ్రా ద్వారా గరిష్టంగా రూ.1,50,000 వరకు తీసుకోవచ్చు. ఈ సందర్భంలో కనీసం రూ.50,000 ఖాతాలో నిల్వగా ఉండాలి. ఉద్యోగం నుంచి వైదొలిగిన తర్వాత మాత్రం మొత్తం రూ.2 లక్షల బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది.