ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని న్యూ దిల్లీలో ఇండియా కూటమి నేతలు మంగళవారం ఉదయం భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్లమెంట్ మకర ద్వారం నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం ‘నిర్వాచన్ సదన్’ వైపు ఇండియా కూటమి (INDIA bloc) నేతలు ర్యాలీగా పయనమయ్యారు.

జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుతూ ‘సేవ్ డెమోక్రసీ’ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ ఆందోళనల నేపథ్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం పరిసరాల్లో భారీగా భద్రతా సిబ్బందిని మోహరించారు. ర్యాలీ మార్గంలో ఆకాశవాణి భవన్ వద్ద పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి ఎంపీలను ముందుకు సాగనీయలేదు.

దాంతో కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ , మల్లికార్జున్ ఖర్గే , ప్రియాంక గాంధీ వాద్రా రోడ్డుపైనే బైఠాయించి ధర్నా చేపట్టారు. అనంతరం రాహుల్ గాంధీ బారికేడ్లపైకి ఎక్కి, చేతిలో జాతీయ జెండా పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. అక్కడ ఉన్న ఇతర నేతలు కూడా ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.

ఈ పరిస్థితుల్లో రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ సహా పలు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌పై ఇండియా కూటమి నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన పదవిలో కొనసాగడం ప్రజాస్వామ్యానికి హానికరమని ఆరోపిస్తున్నారు.

‘‘జ్ఞానేశ్ ఇక చాలు.. రాజీనామా చేయాల్సిన సమయం వచ్చింది’’

అని పేర్కొంటూ నిర్వహించిన ర్యాలీ వీడియోను రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి ఇండియా కూటమిలో భాగమైన DMK, ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం హాజరుకాలేదు. వారి గైర్హాజరు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఎన్నికల సంఘం పనితీరు, ప్రధాన కమిషనర్ పాత్రపై ఇండియా కూటమి ఇప్పటికే పలు మార్లు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వస్తోంది. తాజా నిరసనతో ఈ వివాదం మరింత ముదురే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.