పాట్నా నుంచి లక్నో వెళ్తున్న ఇండిగో విమానానికి గాల్లోనే ప్రమాదం తృటిలో తప్పింది. 104 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ విమానం ఎగురుతున్న సమయంలో పిడుగు తాకింది. పిడుగుపాటు ధాటికి విమానం ముందు భాగం దెబ్బతిన్నప్పటికీ, పైలట్ అప్రమత్తంగా వ్యవహరించి విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదు.

ఇండిగోకు చెందిన 6E 625 విమానం బుధవారం పాట్నా నుంచి లక్నోకు బయల్దేరింది. విమానం సుమారు 17,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. పిడుగుపాటు కారణంగా విమానం ముందు భాగంలో ఉండే రాడోమ్ (నోస్ కోన్) దెబ్బతింది. రాడోమ్ అనేది విమానం ముక్కు భాగంలో ఉండే, రాడార్ వ్యవస్థను కాపాడే కీలక భాగం. ఇది దెబ్బతిన్నప్పటికీ, పైలట్ విమాన నియంత్రణను కోల్పోకుండా చాకచక్యంగా నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.

పిడుగుపాటు అనంతరం విమానాన్ని లక్నోలోని చౌధరి చరణ్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. షెడ్యూల్ సమయానికి 8 నిమిషాల ముందుగానే ల్యాండ్ కావడం విశేషం. ల్యాండింగ్ తర్వాత విమానాన్ని పరిశీలించిన అధికారులు, రాడోమ్ భాగం దెబ్బతిన్నట్టు గుర్తించారు. ప్రయాణికులను సురక్షితంగా టెర్మినల్‌కు తరలించారు.

ఈ ఘటనపై ఇండిగో సంస్థ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రతికూల వాతావరణ పరిస్థితులు, వడగళ్ల వాన కారణంగానే రాడోమ్ దెబ్బతిన్నట్లు సంస్థ స్పష్టం చేసింది. ప్రయాణికులందరూ తమ గమ్యస్థానంలో సురక్షితంగా దిగారని, ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని ఇండిగో పేర్కొంది. ఘటన జరిగిన వెంటనే సంబంధిత విమానయాన అధికారులకు సమాచారం అందించినట్లు కూడా సంస్థ తెలిపింది.

ఈ సంఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణ ప్రారంభించింది. పిడుగుపాటు సమయంలో విమానం ఎత్తు, వాతావరణ పరిస్థితులు, పైలట్ చర్యలు, విమానం సాంకేతిక స్థితి తదితర అంశాలపై డీజీసీఏ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. విమానం రాడోమ్ దెబ్బతినడానికి గల కారణాలు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.