న్యూఢిల్లీ : సిఇసి జ్ఞానేష్‌ కుమార్‌కి వ్యతిరేకంగా అక్టోబర్‌ 10, 11 తేదీల్లో యువత చేపట్టిన నిరసనలను రిపోర్ట్‌ చేస్తున్న జర్నలిస్టులపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ నిరసనల సమయంలో వార్తా సేకరణలో ఉన్న సుమారు 43 మంది జర్నలిస్టులను నిర్బంధించినట్లు జర్నలిస్టుల రక్ష‍ణ కమిటీ కమిటీ to ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (CPJ) వెల్లడించింది.

సిపిజె శుక్రవారం విడుదల చేసిన నివేదికలో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు అహ్మదాబాద్‌, పూణెలలో జర్నలిస్టుల అరెస్టులు, నిర్బంధాలు జరిగినట్లు పేర్కొంది. వార్తా కథనాలు, ప్రత్యక్ష ఇంటర్వ్యూలు, ఎడిటర్లు, జర్నలిస్టులు, వారి వార్తా సంస్థలు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ధృవీకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలను సేకరించినట్లు తెలిపింది.

న్యూఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో కనీసం 39 మంది పాత్రికేయులను అదుపులోకి తీసుకున్నారని సిపిజె నివేదికలో స్పష్టం చేసింది. అహ్మదాబాద్‌లో Alt న్యూస్ కరస్పాండెంట్‌ కింజాల్‌, స్క్రోల్ కి చెందిన దివ్య ఆశ్లేషాతో పాటు ఇతర నగరాల్లో ఆందోళనకు సంఘీభావం ప్రకటించిన మరో నలుగురు జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించినట్లు పేర్కొంది.

అక్టోబర్‌ 11న ముంబయిలోని శివాజీ పార్క్‌ నుండి Quint కి చెందిన స్వాతి చోప్రా, మోహిత్‌ మన్వానిలను పోలీసులు అరెస్టు చేసినట్లు సిపిజె నివేదికలో వెల్లడించింది. న్యాయవాదులు, జర్నలిస్టులు, ఇతర నిపుణులను వారి విధుల నిర్వహణలో అడ్డుకోమని సొలిసిటర్ జనరల్ తుషార్‌ మెహతా అక్టోబర్‌ 11న సుప్రీమ్ కోర్ట్ లో హామీ ఇచ్చిన తర్వాత కూడా జర్నలిస్టుల నిర్బంధం కొనసాగిందని సిపిజె పేర్కొంది.

అధికారులు కనీసం ఐదు ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారని, ఒక జర్నలిస్టుపై ఫుటేజీ తొలగించాలని ఒత్తిడి తీసుకువచ్చారని నివేదికలో చెప్పింది. మరికొందరిని న్యూఢిల్లీ నుండి సుమారు 65 కి.మీ దూరంలో ఉన్న నిర్బంధ కేంద్రాలకు తరలించినట్లు వెల్లడించింది. ఐదుగురు జర్నలిస్టులపై పోలీసులు దాడి చేసిన ఘటనలను కూడా సిపిజె నమోదు చేసింది.

స్క్రోల్ , బిజినెస్ స్టాండర్డ్ , న్యూస్ లాండ్రీ , ఇండియా టుడే వంటి సంస్థలకు చెందిన జర్నలిస్టులతో పాటు పలువురు స్వతంత్ర పాత్రికేయులను కూడా పోలీసులు తాత్కాలికంగా నిర్బంధించినట్లు నివేదికలో పేర్కొన్నారు.

ఢిల్లీ పోలీసుల చర్యలను ప్రముఖ పాత్రికేయుడు, ది హిందూ పబ్లిషింగ్ గ్రూప్ డైరెక్టర్‌ ఎన్‌.రామ్‌ తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టులపై జరిగిన నిర్బంధాలు, దాడులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌ పోస్ట్‌ ద్వారా స్పందించారు.

జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల క్రూరమైన చర్యలను ఖండించాలి. నిర్బంధానికి, దాడులకు గురైన జర్నలిస్టులకు సంఘీభావం ప్రకటించాలి. చట్టాన్ని ఉల్లంఘించి, జర్నలిస్టులపై దాడులకు దిగిన యూనిఫాంలో ఉన్న నిందితులను కోర్టు ఎదుట నిలబెట్టాలి.