రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: చిన్న పత్రికలకు న్యాయం ఎప్పుడు జరుగుతుందనే ప్రశ్నను నేషనల్ యాక్టివ్ రిపోర్టర్స్ అసోసియేషన్ (NARA) ప్రభుత్వం ముందుంచింది. ఇన్ఫ్లుయెన్సర్లకు ప్రత్యేక విధానాలు రూపొందిస్తున్న ప్రభుత్వం, ప్రజలకు చేరువగా పనిచేస్తున్న చిన్న, మధ్య తరహా పత్రికలను పట్టించుకోవడం లేదని అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేసింది.
ప్రజాస్వామ్య వ్యవస్థలో బలమైన మీడియాగా నిలుస్తూ, గ్రామీణ, పట్టణ స్థాయిలో ప్రజల సమస్యలను వెలుగులోకి తెస్తున్న చిన్న, మధ్య తరహా పత్రికలపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించడం సమంజసం కాదని NARA అభిప్రాయపడింది. పత్రికలకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్నప్పటికీ, అధికార యంత్రాంగం నుంచి తగిన స్పందన రాకపోవడాన్ని అసోసియేషన్ ప్రస్తావించింది.
NARA ప్రతినిధులు పత్రికల సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ, ముఖ్యంగా క్రింది డిమాండ్లు, ప్రశ్నలను ముందుకు తెచ్చారు.
ఎంప్లాయ్మెంట్కు ‘నో’ ఎందుకు?
అన్ని అర్హతలు, ప్రమాణాలు నెరవేర్చినప్పటికీ చిన్న పత్రికల ఎంప్లాయ్మెంట్కు ప్రభుత్వం ‘నో’ ఎందుకు చెబుతోందని NARA ప్రశ్నించింది. చిన్న పత్రికల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు కూడా ఇతర మీడియా సంస్థలలో పనిచేస్తున్నవారిలాగే సేవలు అందిస్తున్నప్పటికీ, ప్రభుత్వ గుర్తింపు, అవకాశాల విషయంలో వివక్ష ఎదుర్కొంటున్నారని అసోసియేషన్ పేర్కొంది.
నిర్లక్ష్యం వీడాలి
కేవలం పత్రికను నమోదు చేయడం, పేరు పెట్టి ముద్రించడం వరకే ప్రభుత్వ బాధ్యత ముగిసిపోదని NARA స్పష్టం చేసింది. నిరంతరం ప్రజల కోసం శ్రమిస్తూ, స్థానిక సమస్యలను వెలుగులోకి తెస్తున్న చిన్న పత్రికల పట్ల నిర్లక్ష్య ధోరణి వీడాలని అసోసియేషన్ కోరింది.
ప్రభుత్వ ప్రకటనల్లో సమాన అవకాశాలు
ప్రతి సంవత్సరం ప్రభుత్వ ప్రకటనల కేటాయింపును తప్పనిసరి చేయాలని, ప్రకటనల పంపిణీలో పారదర్శకత ఉండాలని NARA డిమాండ్ చేసింది. పత్రికల ప్రసార సంఖ్య, వ్యాప్తిపై సమగ్ర పరిశీలన జరిపి, చిన్న పత్రికలకు కూడా ప్రభుత్వ ప్రకటనల్లో సమాన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని అసోసియేషన్ అభిప్రాయపడింది.
స్పష్టమైన విధానం అవసరం
చిన్న పత్రికల వర్గీకరణ జరిగినప్పటికీ, వాటి అమలుపై ఇంకా అనేక ప్రశ్నలు మిగిలే ఉన్నాయని NARA పేర్కొంది. ఇన్ఫ్లుయెన్సర్లకు అవకాశాలు కల్పిస్తున్న ప్రభుత్వం, పత్రికలకు మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. సమాచార శాఖ చిన్న పత్రికలపై స్పష్టమైన విధానాన్ని ప్రకటించాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది.
జర్నలిస్టులకు గుర్తింపు
ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ, అనుభవంతో పనిచేస్తున్న జర్నలిస్టులకు సముచిత గౌరవం, అధికారిక గుర్తింపు దక్కేలా చర్యలు తీసుకోవాలని NARA కోరింది. ఈ లక్ష్యాల సాధన కోసం మరోసారి ఉద్యమానికి సిద్ధమవ్వాల్సిన పరిస్థితి వస్తోందని అసోసియేషన్ ప్రతినిధులు పేర్కొన్నారు.







