పంజాబ్‌లోని ఐదు ప్రముఖ దేవాలయాలకు గురువారం బాంబు బెదిరింపు ఈమెయిల్‌ రావడంతో రాష్ట్రవ్యాప్తంగా భద్రతా వ్యవస్థలు అప్రమత్తమయ్యాయి. కొన్ని ప్రభుత్వ సంస్థల్లో కూడా పేలుళ్లు జరిపే యత్నం చేస్తామని ఆ ఈమెయిల్‌లో పేర్కొన్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో సంబంధిత ప్రాంతాల్లో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.

మరో రెండు రోజుల్లో ఆపరేషన్‌ బ్లూ స్టార్‌కు 42 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో ఈ బెదిరింపులు వెలుగులోకి రావడం ఆందోళనకు కారణమైంది. ఇప్పటికే ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ వార్షికోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని పంజాబ్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన పోలీసులు, తాజా ఈమెయిల్‌ బెదిరింపులతో మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. అమృత్‌సర్‌లోని దుర్గియానా ఆలయం, పఠాన్‌కోట్‌లోని ముక్తేశ్వర్‌ ధామ్‌ ఆలయం, జలంధర్‌లోని దేవీ తలాబ్‌ మందిర్‌, భటిండాలోని మైసర్‌ ఖానా ఆలయం, పటియాలాలోని మాతా కాళీ ఆలయాలకు ఈ బెదిరింపు ఈమెయిళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ ఆలయాల పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించి, భద్రతా వలయాన్ని బిగించారు.

జలంధర్‌లోని దేవీ తలాబ్‌ ఆలయం వద్ద ఇప్పటికే పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. అక్కడ నిర్వహించిన తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు. ప్రజలను భయపెట్టే ఉద్దేశంతో చేసిన నకిలీ బెదిరింపులుగా ఈమెయిల్‌ కనిపిస్తున్నప్పటికీ, ఎలాంటి ప్రమాదాన్ని లెక్కచేయకుండా వదిలేయలేమన్న దృష్టితో భద్రతా చర్యలను కొనసాగిస్తున్నట్లు పోలీసు వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 1984 జూన్‌లో ఆపరేషన్‌ బ్లూ స్టార్‌ అమలులోకి వచ్చింది. అమృత్‌సర్‌లోని ప్రార్థనాలయంలో దాక్కున్న తీవ్రవాదులను బయటకు తీసేందుకు ఇండియన్ ఆర్మీ సైనిక చర్య చేపట్టింది. మేజర్‌ జనరల్‌ బ్రార్‌ ఆధ్వర్యంలో సాగిన ఈ ఆపరేషన్‌ బ్లూ స్టార్‌, భారత సైన్యం చేపట్టిన అతిపెద్ద సైనిక చర్యల్లో ఒకటిగా చరిత్రలో నిలిచింది. అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో 83 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వేర్పాటువాద నేత భింద్రన్‌వాలే సహా పలువురు వేర్పాటువాద నేతలు ఈ సైనిక చర్యలో హతమయ్యారు. ఆ సంఘటనల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి సంవత్సరం ఈ కాలంలో పంజాబ్‌లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది. తాజా బాంబు బెదిరింపు ఈమెయిళ్లతో ఈసారి భద్రతా చర్యలు మరింతగా పెంచినట్లు అధికారులు సూచిస్తున్నారు.