రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్:
సోనిభద్రలో డ్రగ్ స్మగ్లర్ల ఛేజింగ్.. నోట్ల వర్షం, కాల్పులతో ఉద్రిక్తత
ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని సోనిభద్ర జిల్లాలో డ్రగ్ స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో పోలీసుల ఛేజింగ్, నోట్ల వర్షం, కాల్పులతో రాత్రి వేళ ఉద్రిక్తత నెలకొంది. మెరుపు వేగంతో దూసుకెళ్తున్న కారు, దాని వెనక పోలీసుల వెంబడింపు, మధ్యలో గాల్లోకి ఎగురుతున్న రూ.100 నోట్లు, అనంతరం కాల్పులు జరగడం వంటి దృశ్యాలు సినిమా సన్నివేశాన్ని తలపించాయి.
ఇటీవల అర్ధరాత్రి సోనిభద్రలోని హైవేపై పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో అక్కడికి వచ్చిన ఓ కారు, పోలీసులు ఇచ్చిన సిగ్నల్స్‌ను పట్టించుకోకుండా వేగంగా వెళ్లిపోయింది. దీంతో పోలీసులు వెంటనే ఆ కారును వెంబడించేందుకు ఛేజింగ్ ప్రారంభించారు.
ఛేజింగ్ సమయంలో నిందితులు తమ వాహనంతో పోలీసుల కారును పదేపదే ఢీకొట్టారు. దీంతో పోలీసుల వాహనం ఆగిపోయింది. అదే సమయంలో అక్కడ ఉన్న ప్రదీప్ కుమార్ అనే వ్యక్తి తన కారును పోలీసులకు అందించడంతో, వారు మళ్లీ నిందితుల కారును వెంబడించడం కొనసాగించారు.
పోలీసుల దృష్టిని మళ్లించేందుకు నిందితులు తెలివిగా ప్రయత్నించారు. కారులో నుంచి రోడ్డుపైకి రూ.100 నోట్లను విసిరేశారు. నోట్ల వర్షం మధ్య కూడా పోలీసులు ఛేజింగ్‌ను ఆపలేదు. చివరికి స్మగ్లర్ల వాహనాన్ని చుట్టుముట్టడంలో వారికి సఫలం అయ్యింది.
ఈ క్రమంలో నిందితులు పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా ఎదురుకాల్పులు జరపాల్సి వచ్చింది. కాల్పుల్లో లుథియానాకు చెందిన ప్రిన్స్ గాయపడ్డాడు. అతడిని పోలీసులు అరెస్టు చేశారు. మరో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.
తరువాత నిందితుల కారును పోలీసులు తనిఖీ చేశారు. అందులో 3 కిలోల నల్ల మందు, 225 కిలోల గసగసాల పొట్టు, రూ.50,000 నగదు లభ్యమయ్యాయి. వీటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన సరకు విలువ దాదాపు రూ.49 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. అనంతరం ఆ కారును సీజ్ చేశారు.
అరెస్టైన ప్రిన్స్‌ను పోలీసులు విచారించారు. ఝార్ఖండ్ నుంచి పంజాబ్‌కు డ్రగ్స్ రవాణా చేస్తున్నట్లు అతడు అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. గతంలో కూడా పలుమార్లు డ్రగ్స్ రవాణా చేసినట్టు విచారణలో బయటపడినట్లు పేర్కొన్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడిని పట్టుకునేందుకు సోనిభద్ర పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.







