ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి జారీ చేసిన ఈ-చలాన్లు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. కేవలం ఈ-చలాన్లు జారీ చేయడం సరిపోదని, వాటిని వసూలు చేసే దిశగా క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

దేశవ్యాప్తంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కలిపి సుమారు రూ.49,194.05 కోట్ల విలువైన ఈ-చలాన్ల బకాయిలు ఉన్నట్లు కోర్టుకు సమర్పించిన వివరాల్లో వెల్లడైంది. ఇందులో సుమారు రూ.26,175.05 కోట్లు ఇప్పటికే వసూలైనట్లు సమాచారం అందింది. దాదాపు 47 శాతం ఈ-చలాన్లు ఇంకా చెల్లించాల్సి ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

పెండింగ్‌లో ఉన్న చలాన్ల వసూళ్ల కోసం వాహనాలను యాదృచ్ఛికంగా తనిఖీ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. ఇటువంటి తనిఖీల్లో బకాయి ఈ-చలాన్లు ఉన్న వాహనాలు గుర్తించినప్పుడు, చట్టం ప్రకారం అవసరమైన చర్యలు తీసుకోవడంతో పాటు, అవసరమైతే వాహనాన్ని స్వాధీనం చేసుకునే అవకాశం కూడా ఉందని కోర్టు స్పష్టం చేసింది.

చలాన్లు పూర్తిగా చెల్లించే వరకు వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఆర్‌సీ పునరుద్ధరణను నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అలాగే డూప్లికేట్ ఆర్‌సీ జారీ చేయకపోవడం, వాహన యజమాని చిరునామా మార్పు దరఖాస్తులను స్వీకరించకపోవడం వంటి పరిపాలనా చర్యలు తీసుకోవాలని సూచించింది. వాహనానికి ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వకుండా, సంబంధిత వాహనాన్ని పరివాహన్ పోర్టల్‌లో బ్లాక్‌లిస్ట్ చేయాలని కూడా కోర్టు పేర్కొంది.

అదేవిధంగా, పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలకు కాలుష్య నియంత్రణ ధ్రువీకరణ పత్రం పీయూసీ జారీ చేయకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వాహనాల యాజమాన్య బదిలీని అడ్డుకునే చర్యలు తీసుకోవాలని కూడా సూచించింది. దీంతో బకాయి చలాన్లు ఉన్న వాహనాలను విక్రయించడం, లేదా యాజమాన్యాన్ని మార్చడం కష్టసాధ్యమయ్యే అవకాశం ఉందని కోర్టు గమనించింది.

పదేపదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్‌పై కూడా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది. బహుళ ఉల్లంఘనలున్న సందర్భాల్లో లైసెన్స్ పునరుద్ధరణను నిలిపివేయడంతో పాటు, అమల్లో ఉన్న లైసెన్స్‌ను సస్పెండ్ చేసే చర్యలు కూడా తీసుకోవచ్చని కోర్టు స్పష్టం చేసింది.

ఈ చర్యల ఉద్దేశ్యం వాహనదారులను ఇబ్బంది పెట్టడం కాదని, ట్రాఫిక్ నిబంధనల అమలును మరింత కట్టుదిట్టం చేసి, పెండింగ్ జరిమానాలను సమర్థవంతంగా వసూలు చేయడమేనని సుప్రీంకోర్టు ఆదేశాల ద్వారా స్పష్టమవుతోంది. ఈ-చలాన్ జారీ చేసిన తర్వాత దాని వసూళ్లపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని కోర్టు సూచించింది.