రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: ఢిల్లీ: దేశవ్యాప్తంగా పనిచేస్తున్న జర్నలిస్టులకు సంబంధించి సుప్రీం కోర్ట్ ముఖ్యమైన వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. పెన్ను పట్టి వార్తలు రాసే వారు, వీడియో కెమెరా పట్టి న్యూస్ ప్రసారాలు చేసే వారు అందరూ జర్నలిస్టులేనని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. రోజువారీ వార్తా ప్రసారాలు, నివేదికలు తయారు చేసే వారిని జర్నలిస్టులుగా గుర్తించాల్సిందేనని సూచించినట్లు వివరాలు చెబుతున్నాయి.
రాజకీయ నాయకులు, అక్రమ సంపాదన దందాల్లో పాల్గొనే వారు, వివిధ ప్రభుత్వ శాఖల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడే వారి బాగోతాలను బయటపెట్టే వార్తలు, న్యూస్ ప్రసారాలు చేసినందుకు మాత్రమే జర్నలిస్టులపై కావాలనే కక్ష్యతో కేసులు పెట్టడం సమంజసం కాదని సుప్రీం కోర్ట్ స్పష్టం చేసినట్లు సమాచారం. నిజాలను నిర్భయంగా వెలుగులోకి తీసుకువచ్చే జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేయడం చెల్లుబాటు కాదనే భావనను కోర్టు వ్యక్తం చేసినట్లు న్యాయవర్గాలు చెబుతున్నాయి.
శాటిలైట్ ఛానెల్స్, YouTube న్యూస్ ఛానెల్స్, ప్రింట్ మీడియా సంస్థల్లో పని చేసే జర్నలిస్టులు ఆయా జర్నలిస్టు సంఘాల్లో సభ్యత్వం కలిగి ఉంటే, వారి పనికి సంబంధించి వచ్చే వివాదాలు, నిజ నిరూపణకు సంబంధించిన అంశాలు మొదట ఆ సంఘాల ద్వారా పరిష్కరించాల్సిన బాధ్యత ఉందని సుప్రీం కోర్ట్ సూచించినట్లు సమాచారం. అలాంటి కేసులపై 7 రోజుల్లో నిర్ణయం తీసుకునే హక్కు జర్నలిస్టు సంఘాలకే ఉంటుందని కోర్టు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది.
జర్నలిస్టు సంఘాలను పక్కన పెట్టి, నేరుగా జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసే వారిపై, అట్టి కేసులు నమోదు చేసే పోలీసులపై చర్యలు తప్పవని సుప్రీం కోర్ట్ హెచ్చరించినట్లు న్యాయ వర్గాలు పేర్కొంటున్నాయి. జర్నలిస్టుల పనికి సంబంధించిన అంశాల్లో చట్టపరమైన చర్యలు తీసుకునే ముందు, వారి వృత్తి స్వేచ్ఛ, వార్తా స్వాతంత్ర్యాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరాన్ని కోర్టు గుర్తుచేసినట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా మీడియా రంగంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు రక్షణ కల్పించే దిశగా ఉన్నాయని భావిస్తున్నారు. నిజాలను వెలుగులోకి తీసుకురావడంలో జర్నలిస్టులు భయపడకుండా తమ వృత్తి బాధ్యతలు నిర్వర్తించేందుకు ఈ సూచనలు తోడ్పడతాయని మీడియా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.






