ఆంధ్రప్రదేశ్‌లో మద్యం రవాణా కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (SIT) దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రెండు సంవత్సరాలుగా కేసు నడుస్తున్నా ఎలాంటి స్పష్టమైన పురోగతి కనిపించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, SIT ప్రవర్తన, దర్యాప్తు విధానంపై పలు ప్రశ్నలు లేవనెత్తింది.

రాజ్ కేసిరెడ్డి మద్యం రవాణా కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ SIT సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాజ్ కేసిరెడ్డి అరెస్టు చట్ట విరుద్ధమని ఏపీ హైకోర్టు తేల్చిన నేపథ్యంలో, ఆ తీర్పుపై stay విధించాలని SIT సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు, SIT దర్యాప్తు తీరు అనుమానాస్పదంగా ఉందని వ్యాఖ్యానించింది. రెండేళ్లుగా కేసు నడుస్తున్నా ఏం కనుగొనలేకపోయారని కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఒకవైపు SIT కస్టోడియల్ ఇంటరాగేషన్ అవసరమని చెబుతుండగా, మరోవైపు పోలీసులు పోలీస్ కస్టడీ కి సిద్ధంగా లేరని చెప్పడం పై కోర్టు ప్రశ్నలు లేవనెత్తింది.

ముందుగా SIT ప్రవర్తనను పరిశీలిస్తామని, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును పరిశీలిస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును SIT తప్పనిసరిగా అనుసరించాల్సిందేనని, లేదంటే SIT దాఖలు చేసిన కేసు డిస్మిస్ల్ కు గురయ్యే అవకాశం ఉందని కోర్టు హెచ్చరించింది.

రాజ్ కేసిరెడ్డి పోలీస్ కస్టడీ పై SIT నిజంగా ఎంత సీరియస్‌గా ఉందన్న అంశంపై కూడా సుప్రీంకోర్టు సందేహం వ్యక్తం చేసింది. యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే ప్రొడక్షన్ వారెంట్ కోరడం, అప్పటికే కస్టడీ లో ఉన్న వ్యక్తి పారిపోయే అవకాశం లేకపోయినా ఇలాంటి చర్యలు తీసుకోవడం SIT అతి కాదా అని కోర్టు ప్రశ్నించింది.

అలాగే, కస్టోడియల్ ఇంటరాగేషన్ కోరుతూ ప్రొడక్షన్ వారెంట్ పొందిన SIT, పోలీస్ కస్టడీ కి సిద్ధంగా కాక జ్యూడిష కస్టడీ ఇవ్వాలని కోరడం ఏ విధమైన ప్రవర్తన అని కోర్టు విమర్శించింది. ప్రొడక్షన్ వారెంట్ , అరెస్ట్ వారెంట్ తో సమానమని, ఇలాంటి పరిస్థితుల్లో SIT వైఖరి సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది.

కేసులో కౌంటర్ దాఖలు చేస్తామని ప్రతివాదులు కోర్టుకు తెలియజేశారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి, తదుపరి విచారణను వాయిదా వేసింది. SIT దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు చేసిన ఈ వ్యాఖ్యలు, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న మద్యం రవాణా కేసు విచారణపై కొత్త చర్చకు దారితీశాయి.