రాయలసీమ న్యూస్, నేషనల్ డెస్క్: పెట్రోల్ బంకులకు వెళ్లే వినియోగదారులకు ముందస్తు హెచ్చరిక వెలువడింది. దేశవ్యాప్తంగా పలు పెట్రోల్ బంకుల్లో యూపీఐ చెల్లింపులను పరిమితంగా మాత్రమే అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూర్తి స్థాయిలో యూపీఐ ద్వారా చెల్లింపులు చేయడం సాధ్యంకాకపోవచ్చని పెట్రోల్ పంప్ నిర్వాహకులు సూచిస్తున్నారు. దీంతో ఇప్పటి వరకు యూపీఐ చెల్లింపులకు అలవాటు పడిన వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తోంది.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అక్టోబర్ 15 నుంచి అమలు చేయనున్న నూతన మర్చంట్ డిస్కౌంట్ రేట్ నిబంధనలపై పెట్రోల్ పంప్ డీలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫ్రేమ్‌వర్క్ ప్రకారం రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ఇంధన యూపీఐ లావాదేవీలపై వ్యాపారుల నుంచి 0.4 శాతం ఎమ్‌డీఆర్ చార్జీ వసూలు చేయనున్నారు. ఈ నిర్ణయం తమపై అదనపు భారమని డీలర్లు పేర్కొంటున్నారు.
ప్రత్యేకంగా కార్లు, భారీ లారీలు, ట్రక్కులకు ఇంధనం నింపేటప్పుడు సాధారణంగా రూ.3,000 నుంచి రూ.10,000 వరకు యూపీఐ చెల్లింపులు జరుగుతాయని, అలాంటి ప్రతి లావాదేవీపై ఎమ్‌డీఆర్ చార్జీ చెల్లించడం తమకు సాధ్యంకాదని వారు స్పష్టం చేస్తున్నారు. ఇంధనం అత్యవసర సరుకు కాబట్టి పెట్రోల్ బంకులకు ఎమ్‌డీఆర్ నుంచి పూర్తి మినహాయింపు ఇవ్వాలని డీలర్లు డిమాండ్ చేస్తున్నారు.
లేకపోతే అక్టోబర్ 15 నుంచి రూ.2,000 పైబడిన ఇంధన కొనుగోళ్లకు యూపీఐ డిజిటల్ చెల్లింపులను నిలిపివేసి, కేవలం నగదు రూపంలో మాత్రమే చెల్లింపులను స్వీకరించాల్సి వస్తుందని వారు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే మధ్యప్రదేశ్ సహా పలు రాష్ట్రాల్లో పెట్రోల్ పంప్ డీలర్లు వాహనదారులకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్టు సమాచారం.
రూ.2,000 కంటే ఎక్కువ విలువైన ఇంధనాన్ని కొనుగోలు చేసే వినియోగదారులు తప్పనిసరిగా నగదు ద్వారా మాత్రమే చెల్లించాల్సి ఉంటుందని, అలాంటి సందర్భాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ యూపీఐ చెల్లింపులను అంగీకరించబోమని డీలర్లు స్పష్టం చేస్తున్నారు. ఒకవైపు నిర్వహణ ఖర్చులు పెరుగుతుండటం, మరోవైపు ముడి చమురు ధరలు తగ్గకపోవడం మధ్య ఎమ్‌డీఆర్ పేరిట విధించే ఈ అదనపు ఛార్జీలను భరించే స్థోమత తమకు లేదని వారు వాపోతున్నారు.
ఈ పరిస్థితుల్లో తాము నగదు చెల్లింపులకే పరిమితం కావడానికి సిద్ధమవుతున్నట్టు డీలర్లు తెలియజేస్తున్నారు. దీంతో యూపీఐ చెల్లింపులపై ఏర్పడిన ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం, సంబంధిత సంస్థలు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాయన్న దానిపై వినియోగదారులు, పెట్రోల్ పంప్ నిర్వాహకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.







