ఆసియాలోనే అతిపెద్ద బై డైరెక్షనల్‌ జోజిలా టన్నెల్‌ ఫైనల్‌ బ్రేక్‌ త్రూ పూర్తి

శ్రీనగర్‌ నుంచి లద్దాఖ్‌ వరకూ దాదాపు 441 కిలోమీటర్ల మేర విస్తరించిన జాతీయ రహదారి ఎన్‌హెచ్‌–1లో కీలక భాగమైన జోజిలా టన్నెల్‌ నిర్మాణంలో ప్రధాన మైలురాయి చేరుకుంది. ఈ టన్నెల్‌కు సంబంధించి అత్యంత కీలకమైన ‘ఫైనల్‌ బ్రేక్‌ త్రూ’ దశ మంగళవారం విజయవంతంగా పూర్తయింది. ఇరువైపుల నుంచి తవ్విన సొరంగాన్ని అనుసంధానించే ఈ చివరి ఘట్టం పూర్తి కావడంతో ప్రాజెక్టు అమలులో కీలక ముందడుగు పడింది.

మన తెలుగువారికి చెందిన మేఘా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ టన్నెల్‌ పూర్తిగా వినియోగంలోకి వస్తే, మంచు కారణంగా ఏడాదిలో ఆరు నెలలపాటు మూసివేసే సోనామార్గ్‌–లద్దాఖ్‌ మార్గం 365 రోజులు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం సోనామార్గ్‌ సమీపంలోని బాల్తాల్‌ నుంచి లద్దాఖ్‌లోని కార్గిల్‌ జిల్లా మీనామార్గ్‌ వరకు 40 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి నాలుగు గంటలకు పైగా సమయం పడుతోంది. టన్నెల్‌ పూర్తయ్యాక దూరం 27 కిలోమీటర్లు తగ్గి, ప్రయాణ సమయం 20 నిమిషాలకు కుదరనుంది.

శ్రీనగర్‌లోని సోనామార్గ్‌ దగ్గరున్న బాల్తాల్‌ నుంచి ద్రాస్‌ జిల్లా పరిధిలోని జోజిలా పాస్‌ వరకు సుమారు 13.15 కిలోమీటర్ల పొడవుతో ఈ సొరంగ మార్గాన్ని నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూ.6,808 కోట్ల వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులను మేఘా సంస్థ 2020 అక్టోబరు 1న ప్రారంభించింది. ప్రధాన సొరంగ తవ్వకం పూర్తయి, ఇప్పుడు అంతర్గత రహదారులు, సైడ్‌ డ్రైనేజీలు, సీసీ కెమెరాలు తదితర పనులు మరో ఏడాదిలో పూర్తయ్యేలా ప్రణాళిక రూపొందించారు.

సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో నిర్మిస్తున్న జోజిలా టన్నెల్‌ ఆసియా ఖండంలోనే అతిపెద్ద బై డైరెక్షనల్‌ టన్నెల్‌గా నిలుస్తోంది. ఈ టన్నెల్‌ ద్వారా శ్రీనగర్‌–లద్దాఖ్‌ మధ్య రవాణా సౌకర్యం ఏడాది పొడవునా నిరంతరాయంగా లభించనుంది. వ్యూహాత్మకంగా కీలకమైన కార్గిల్‌–జోజిలా–ద్రాస్‌ ప్రాంతాలకు సైనిక రవాణా కూడా సులభతరం కానుంది.

టన్నెల్‌ నిర్మాణంలో భౌగోళిక పరిస్థితులు పెద్ద సవాలుగా నిలిచాయి. ఆ ప్రాంతంలో ఎప్పటికప్పుడు మంచు కురుస్తుండడం, తీవ్రమైన చలిగాలులు, వానల కారణంగా భూమి స్వభావం తరచూ మారుతూ ఉండేది. 13 కిలోమీటర్ల టన్నెల్‌ తవ్వే క్రమంలో భూమి స్వభావం దాదాపు 67 సార్లు మారిందని సంస్థ ఇంజినీర్లు వివరించారు. ఒకచోట గట్టి రాతి నిర్మాణం, మరోచోట బలహీన భూభాగం ఉండడంతో తవ్వకాల్లో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ సమస్యలను అధిగమించేందుకు స్పెయిన్‌ దేశానికి చెందిన ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను వినియోగించి, అవసరమైన మేరకు బ్లాస్టింగ్‌ పద్ధతులను అనుసరించారు.

వేసవి కాలంలో కూడా అక్కడ తీవ్రమైన చలి నెలకొని ఉంటుంది. టన్నెల్‌ తవ్వే సమయంలో రెండుసార్లు భారీ మంచు తుఫానులు రావడంతో కొంతమంది కార్మికులు చిక్కుకుపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చి, తుఫాను తగ్గిన తర్వాత మళ్లీ పనులు కొనసాగించారు. దాదాపు 1,200 మంది కార్మికులు ఈ తీవ్రమైన వాతావరణాన్ని ఎదుర్కొంటూ టన్నెల్‌ నిర్మాణాన్ని ముందుకు తీసుకెళ్లారు.

జోజిలా టన్నెల్‌ ఫైనల్‌ బ్రేక్‌ త్రూను కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్‌ గడ్కరీ, జమ్ము కశ్మీర్‌ ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా, కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా, మేఘా సంస్థ అధినేత కృష్ణారెడ్డి కలిసి ప్రారంభించారు. అనంతరం నితిన్‌ గడ్కరీ విలేఖరులతో మాట్లాడారు.

దేశ మౌలిక వసతుల చరిత్రలో జోజిలా టన్నెల్‌ బ్రేక్‌ త్రూ ఓ సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. ఇది కేవలం రహదారి మాత్రమే కాదు, లద్దాఖ్‌–జమ్ము కశ్మీర్‌ ప్రాంతాలకు జీవనరేఖలాంటిది.

2014లోనే ఈ ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, పలుమార్లు టెండర్ల దశలోనే ప్రయత్నాలు విఫలమయ్యాయని ఆయన గుర్తుచేశారు. చివరికి మేఘా సంస్థ చొరవ, కార్మికుల కృషితో అంచనా వ్యయంకన్నా తక్కువ ఖర్చుతో ప్రాజెక్టు ముందుకు సాగడం ఆనందంగా ఉందని తెలిపారు. జోజిలా టన్నెల్‌ నిర్మాణంతో పర్యాటక, వాణిజ్య, రక్షణ రంగాలు బలపడతాయని, కశ్మీర్‌–లద్దాఖ్‌ మధ్య నిరంతరాయ ప్రయాణాలకు అవకాశం కలుగుతుందని చెప్పారు.

అదే సందర్భంగా నితిన్‌ గడ్కరీ రూ.1,000 కోట్లతో 48 కిలోమీటర్ల లేహ్‌ దక్షిణ బైపాస్‌, రూ.200 కోట్లతో 7.6 కిలోమీటర్ల ఉత్తర బైపాస్‌ పనులను చేపడతామని ప్రకటించారు.

జోజిలా ప్రాజెక్టు మొత్తం పొడవు రహదారులు, వంతెనలతో కలిపి 30.894 కిలోమీటర్లు. ఇందులో ప్రధాన టన్నెల్‌ పొడవు 13.153 కిలోమీటర్లు. నిల్‌గ్రార్‌ టన్నెల్‌లోని టీ1 పొడవు 457.35 మీటర్లు, టీ2 పొడవు 1,953.63 మీటర్లు. ప్రాజెక్టులో మూడు వంతెనల పొడవు కలిపి 460 మీటర్లు. భారతదేశంలోనే అత్యంత పొడవైన వెర్టికల్‌ షాఫ్ట్‌ను ఇక్కడ నిర్మించారు. వెర్టికల్‌ షాఫ్ట్‌–1 (పశ్చిమ) పొడవు 474.30 మీటర్లు, ఎత్తు 3,481 మీటర్లు. మధ్యలోని వెర్టికల్‌ షాఫ్ట్‌–2 పొడవు 367.38 మీటర్లు, తూర్పు వైపున వెర్టికల్‌ షాఫ్ట్‌–3 పొడవు 213.50 మీటర్లు.

మొత్తం 2,350 మీటర్ల కట్‌–అండ్‌–కవర్‌ నిర్మాణాలు ఏడు చోట్ల ఏర్పాటు చేశారు. 450 మీటర్ల స్నో గ్యాలరీ, దాదాపు 17 ఎమర్జెన్సీ లే బైస్‌, ఆటోమాటిక్‌ ఫైర్‌ డిటెక్షన్‌ సిస్టమ్‌, అత్యాధునిక సీసీ కెమెరాలు, అత్యవసర టెలిఫోన్‌ వ్యవస్థ ఈ టన్నెల్‌లో ఉండనున్నాయి. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వాహనాలు ప్రయాణించేలా టన్నెల్‌ను రూపకల్పన చేశారు.