రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: యుఎస్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారీ సంచలనం నమోదైంది. పురుషుల సింగిల్స్‌లో రెండో సీడ్, స్పెయిన్ స్టార్ కార్లోస్ అల్కరాస్ క్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించాడు. అమెరికా యువ క్రీడాకారుడు బెన్ షెల్టన్ ఐదు సెట్ల హోరాహోరీ పోరులో అల్కరాస్‌ను మట్టికరిపించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. మరో అమెరికన్ ఆటగాడు తియోఫో కూడా సెమీస్ చేరగా, మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ జెస్సికా పెగులా, కజకిస్థాన్‌కి చెందిన రిబకినా తుది నాలుగులో స్థానం దక్కించుకున్నారు.
ప్రపంచ నంబర్ వన్ సినర్ గాయంతో వైదొలగడంతో పురుషుల సింగిల్స్‌లో అల్కరాస్‌నే తిరుగులేని ఫేవరెట్‌గా భావించారు. అయితే ఎనిమిదో సీడ్ బెన్ షెల్టన్ అంచనాలను తలకిందులు చేశాడు. నాలుగున్నర గంటల పాటు సాగిన మారథాన్ మ్యాచ్‌లో షెల్టన్ 6-7 (5-7), 6-1, 6-3, 1-6, 7-6 (10-7)తో అల్కరాస్‌పై గెలుపొందాడు.
“నేను అలసిపోయా. ఇది యుద్ధం. కార్లోస్ ఈ ఆటలో గొప్ప ఛాంపియన్. కెరీర్‌లో నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన మ్యాచ్ ఇది అనడంలో సందేహం లేదు”
అని మ్యాచ్ అనంతరం షెల్టన్ వ్యాఖ్యానించాడు. ఈ పరాజయంతో గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో అల్కరాస్ 18 మ్యాచ్‌ల విజయపరంపరకు తెరపడింది.
“మ్యాచ్ చాలా హోరాహోరీగా సాగింది. చివరికి విజయం సాధించలేకపోయినందుకు నిరాశగా ఉంది. కానీ నేను పోరాడిన తీరు పట్ల గర్వంగా ఉన్నా. బాగా అలసిపోయినా కష్టపడ్డా”
అని అల్కరాస్ పేర్కొన్నాడు.
ఈ మ్యాచ్‌లో షెల్టన్ 7 ఏస్‌లు, 34 విన్నర్లు కొట్టాడు. అల్కరాస్ సర్వీసును 5 సార్లు బ్రేక్ చేశాడు. మరోవైపు అల్కరాస్ 3 ఏస్‌లు, 38 విన్నర్లు సాధించినప్పటికీ 7 డబుల్ ఫాల్ట్‌లు, 53 అనవసర తప్పిదాలతో భారీగా దెబ్బతిన్నాడు. షెల్టన్ అనవసర తప్పిదాలు 35 మాత్రమే చేశారు.
అల్కరాస్, షెల్టన్ మధ్య క్వార్టర్ ఫైనల్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. తొలి సెట్లో కీలకమైన 11వ గేమ్‌లో షెల్టన్ సర్వీసు కోల్పోయినా వెంటనే బ్రేక్ సాధించి సెట్‌ను టైబ్రేక్‌కు తీసుకెళ్లాడు. టైబ్రేక్‌లో అల్కరాస్ పైచేయి సాధించాడు. అయితే రెండో, మూడో సెట్లలో షెల్టన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. రెండో సెట్లో 3, 5, 7 గేమ్‌లలో బ్రేక్‌లు సాధించి సెట్‌ను సొంతం చేసుకున్నాడు. మూడో సెట్లో రెండో గేమ్‌లోనే బ్రేక్ సాధించి ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాడు.
నాలుగో సెట్లో అల్కరాస్ తిరిగి జోరందుకున్నాడు. 2, 6 గేమ్‌లలో బ్రేక్‌లు సాధించి సెట్‌ను అలవోకగా గెలిచి స్కోరు సమం చేశాడు. నిర్ణయాత్మక అయిదో సెట్లో ఇద్దరూ తమ సర్వీసులను కాపాడుకోవడంతో టైబ్రేక్‌కి చేరింది. అక్కడ కూడా హోరాహోరీ పోరు కొనసాగగా, చివరికి షెల్టన్ 146 మైళ్ల వేగంతో ఏస్ సంధించి మ్యాచ్‌ను ముగించాడు. మ్యాచ్ మొత్తం షెల్టన్ పదునైన సర్వీసులతో అల్కరాస్‌పై ఒత్తిడి కొనసాగించాడు.
సెమీఫైనల్లో షెల్టన్ అమెరికాకే చెందిన తియోఫోను ఎదుర్కొంటాడు. మరో క్వార్టర్ ఫైనల్లో తియోఫో 5-7, 3-6, 7-5, 6-3, 7-6 (10-6)తో అలెక్స్ మిచెల్సన్ (అమెరికా)పై విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో తియోఫో 10 ఏస్‌లు, 50 విన్నర్లు కొట్టి, ప్రత్యర్థి సర్వీసును 8 సార్లు బ్రేక్ చేశాడు. మిచెల్సన్ 21 ఏస్‌లు కొట్టినా, 9 డబుల్ ఫాల్ట్‌లు, 61 అనవసర తప్పిదాలతో వెనుకబడ్డాడు.
మహిళల సింగిల్స్‌లో మూడో సీడ్ జెస్సికా పెగులా (అమెరికా) సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్లో ఆమె 3-6, 6-4, 6-3తో నవారో (అమెరికా)పై గెలుపొందింది. తొలి సెట్ కోల్పోయిన తర్వాత పెగులా బలంగా పుంజుకుని మ్యాచ్‌లో 6 ఏస్‌లు, 31 విన్నర్లు కొట్టింది. ప్రత్యర్థి సర్వీసును అయిదుసార్లు బ్రేక్ చేసింది.
కజకిస్థాన్‌కి చెందిన రిబకినా కూడా తుది నాలుగులోకి అడుగుపెట్టింది. క్వార్టర్స్‌లో ఆమె 3-6, 6-1, 6-4తో జెంగ్ (చైనా)ను ఓడించింది. యుఎస్ ఓపెన్‌లో పురుషుల, మహిళల విభాగాల్లో సెమీఫైనల్ పోరులు ఆసక్తికరంగా మారాయి.







