రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: తిరువనంతపురం: 2027 వన్డే ప్రపంచకప్‌తో తన అంతర్జాతీయ క్రికెట్ ప్రయాణాన్ని ముగించనున్నట్లు టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి స్పష్టం చేశాడు. ఆ మెగా టోర్నీ వరకు విరాట్, రోహిత్ శర్మలు కొనసాగుతారా లేదా అన్న సందిగ్ధతకు శనివారం తెరపడింది.
వెస్టిండీస్‌తో వన్డే సిరీస్ ఆరంభం కానున్న నేపథ్యంలో ఒక టీవీ ఛానెల్‌తో మాట్లాడిన కోహ్లి, 2027 ప్రపంచకప్‌లో తాను ఆడే విషయంపై స్పష్టత ఇచ్చాడు. అదే సమయంలో రోహిత్ కూడా ఆ టోర్నీలో పాల్గొనే సంకేతాలు ఇచ్చాడు.
“నేను భారత్ తరఫున ఆడబోయే చివరి ప్రపంచకప్ ఇదే. నాకు ప్రేరణనిచ్చే విషయం అదే. ఇక అంతా దాని కోసమే. ప్రపంచకప్ గెలవడమే లక్ష్యం. ఇందుకోసం ఏం చేయడానికైనా సిద్ధం. వన్డే క్రికెట్లో ఉండే తీవ్రత వేరు. ఒక్క రోజులో రెండున్నర టీ20లు ఆడతాం. ఒకేసారి పది టీ20 మ్యాచ్‌ల తీవ్రతను చూపించాల్సి ఉంటుంది. ఇలాంటి ఫార్మాట్లో ప్రపంచకప్ అంటే, అందులోనూ ఆ టోర్నీ జరిగేది వేరే దేశంలో అయితే అంత తేలికగా ఉండదు” అని విరాట్ కోహ్లి చెప్పాడు.
కోహ్లి,రోహిత్ శర్మ లా 2027 ప్రపంచకప్ గురించి స్పష్టమైన రిటైర్మెంట్ ప్రకటన చేయకపోయినా, ఆ టోర్నీలో ఆడబోతున్నట్లు వెల్లడించాడు. ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలకు తాను ఎలా సిద్ధమవుతాడో, తన దృష్టి ఎలా ఉంటుందో వివరించాడు.
“నా మనసులో ఒకటి అనుకుంటే.. ఆ పని అయ్యే వరకు అది పక్కకు వెళ్లదు. ఆడుతున్నంత కాలం దాని మీదే దృష్టి ఉంటుంది. ప్రపంచకప్ కోసం నేను వేచి చూస్తున్నా. నా కోసం ఏం రాసిపెట్టి ఉందో చూడాలి. భిన్న వేదికల్లో, భిన్న ప్రత్యర్థులతో తలపడే ప్రపంచకప్ లాంటి టోర్నీలు ఎప్పుడూ సవాలుతో కూడుకున్నవే. వాటికి సన్నద్ధత కూడా భిన్నంగానే ఉండాలి” అని రోహిత్ శర్మ అన్నాడు.
వెస్టిండీస్‌తో మూడు వన్డేల సిరీస్ ప్రారంభానికి ముందు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు నెట్స్‌లో ముమ్మరంగా సాధన చేస్తున్నారు. 2027 ప్రపంచకప్‌ను లక్ష్యంగా పెట్టుకున్న ఈ ఇద్దరు సీనియర్ బ్యాటర్లు, వన్డే ఫార్మాట్ తీవ్రత, సవాళ్లను దృష్టిలో పెట్టుకుని తమ ఆటను మరింత పదును పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
కోహ్లి నిర్ణయం, రోహిత్ సంకేతాలు టీమ్ ఇండియా భవిష్యత్ రూపకల్పనలో కీలకంగా మారనున్నాయి. 2027 తర్వాత వన్డే జట్టులో నాయకత్వం, అనుభవజ్ఞుల స్థానాలు ఎలా భర్తీ అవుతాయన్న దానిపై ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి.







