రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: ముంబయి క్రికెట్ అసోసియేషన్ (MCA) భారత మాజీ క్రికెటర్ అజింక్య రహానే గౌరవార్థం ప్రత్యేక స్కాలర్‌షిప్ ఫండ్‌ను ఏర్పాటు చేసింది. యువ క్రికెటర్లను క్షేత్ర స్థాయిలో ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అసోసియేషన్ వెల్లడించింది.
MCA అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. పురుష, మహిళా క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు ఇవ్వడం, అర్హులైన ఆటగాళ్లకు రహానే పేరిట స్కాలర్‌షిప్ మంజూరు చేయడం వంటి నిర్ణయాలకు ఆమోదం లభించింది.
ముంబయి క్రికెట్ అసోసియేషన్ తరఫున మొత్తం 22 మంది క్రికెటర్లకు వార్షిక కాంట్రాక్టులు ప్రకటించారు. వీరిలో 14 మంది పురుషులు, 8 మంది మహిళా క్రికెటర్లు ఉన్నారు. మూడు గ్రేడ్‌లుగా ఈ కాంట్రాక్టులను విభజించారు.
గ్రేడ్ Aలో ఎంపికైన ఆటగాళ్లకు సంవత్సరానికి రూ.12 లక్షలు, గ్రేడ్ Bలో ఉన్న వారికి రూ.8 లక్షలు, గ్రేడ్ Cలో ఉన్న క్రికెటర్లకు రూ.6 లక్షలు అందించనున్నారు. గ్రేడ్ Aలో సిద్దేశ్, షామ్స్ ములాని వంటి ఆటగాళ్లకు అవకాశం లభించింది.
యువ క్రికెటర్ల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ ఫండ్ ఏర్పాటు చేయాలని MCA అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అజింక్య రహానే పేరిట ఈ స్కాలర్‌షిప్ ఇవ్వనున్నారు. ముంబయి జట్టుకు రహానే సారథ్యంతో రంజీ ట్రోఫీలు అందించిన విజయాలను MCA గుర్తు చేసుకుంది.
ఈ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌లో MCA మాజీ అధ్యక్షుడు శరద్ పవార్ కూడా భాగస్వామ్యం కానున్నారు. ఆయన సహకారంతోనే ఈ ఫండ్ రూపుదిద్దుకుంటుందని అసోసియేషన్ వర్గాలు తెలిపాయి.
MCA అధ్యక్షుడు అజింక్య నాయక్ మాట్లాడుతూ, అపెక్స్ కౌన్సిల్ ఆమోదంతో యువ క్రికెటర్ల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని, దానికి అజింక్య రహానే పేరు పెట్టామని వివరించారు. రహానే ముంబయి క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.







