రాయలసీమ న్యూస్, స్పోర్ట్స్ డెస్క్: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మరోసారి మెరుపులు ప్రదర్శించింది. పురుషుల డబుల్స్ విభాగంలో ఈ జంట సెమీఫైనల్ దశకు చేరుకుంది. క్వార్టర్‌ఫైనల్లో డెన్మార్క్‌కు చెందిన కిమ్ ఆస్ట్రప్, అండర్స్ స్కారప్ రాస్ముసెన్ జోడీని 21-13, 16-21, 21-18తో మట్టికరిపించింది.
ఈ టోర్నీలో సెమీఫైనల్ దశకు చేరుకోవడం సాత్విక్, చిరాగ్ ద్వయానికి వరుసగా నాలుగోసారి కావడం విశేషం. క్వార్టర్‌ఫైనల్ తొలి గేమ్ నుంచే భారత జంట పూర్తి ఆధిపత్యాన్ని చాటింది. ప్రారంభం నుంచే దూకుడుగా ఆడి, విరామానికి 11-4తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లింది. ద్వితీయార్ధంలో డెన్మార్క్ జంట కొంత ప్రతిఘటన చూపించినా, సాత్విక్–చిరాగ్ జంట తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ తొలి గేమ్‌ను 21-13తో సొంతం చేసుకుంది.
రెండో గేమ్‌లో మాత్రం డెన్మార్క్ జంట పుంజుకుంది. ఈ గేమ్ హోరాహోరీగా సాగింది. విరామానికి భారత జంట 11-10తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. విరామం తర్వాత స్కోరు 15-15 వద్ద సమమైంది. కీలక సమయంలో వరుసగా మూడు పాయింట్లు సాధించిన కిమ్ ఆస్ట్రప్, అండర్స్ స్కారప్ రాస్ముసెన్ జంట ఆధిక్యాన్ని పెంచుకుని, రెండో గేమ్‌ను 16-21తో గెలుచుకుంది.
నిర్ణయాత్మక మూడో గేమ్‌లో కూడా డెన్మార్క్ జంట అదే ఉత్సాహంతో ఆడి, 9-6తో ముందంజలోకి దూసుకెళ్లింది. అయితే ఆ తర్వాత సాత్విక్, చిరాగ్ పుంజుకుని స్కోరును క్రమంగా సమం చేస్తూ 17-17 వద్ద నిలిపారు. అక్కడి నుంచి జోరు పెంచిన భారత జంట వరుస పాయింట్లు సాధిస్తూ మూడు మ్యాచ్ పాయింట్లను అందుకుంది. రెండో మ్యాచ్ పాయింట్‌ను సద్వినియోగం చేసుకున్న సాత్విక్–చిరాగ్ జంట చివరికి 21-18తో గేమ్, మ్యాచ్‌ను కైవసం చేసుకుని సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
శ్రీకాంత్ ప్రయాణం క్వార్టర్స్‌లోనే ముగింపు
పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు కిదాంబి శ్రీకాంత్ చైనా మాస్టర్స్‌లో తన ప్రయాణాన్ని క్వార్టర్‌ఫైనల్ దశలోనే ముగించాడు. హాంకాంగ్ ఆటగాడు లీ చూక్ యు చేతిలో శ్రీకాంత్ 16-21, 16-21 స్కోరుతో పరాజయాన్ని చవిచూశాడు.
గత మ్యాచ్‌లో ప్రపంచ ర్యాంకింగ్‌లో తొమ్మిదో స్థానంలో ఉన్న విక్టర్ లాయ్‌పై అద్భుత ప్రదర్శనతో విజయం సాధించిన శ్రీకాంత్, ఈ మ్యాచ్‌లో అదే స్థాయి ఆటను కొనసాగించలేకపోయాడు. తొలి గేమ్‌ను 3-0 ఆధిక్యంతో ఆరంభించిన అతడు, ఆ తర్వాత తన రీతిని కోల్పోయాడు. వరుసగా మూడు పాయింట్లు సాధించిన లీ చూక్ యు స్కోరును సమం చేసి, అక్కడి నుంచి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. మధ్యలో 14-6తో భారీ ఆధిక్యంలోకి వెళ్లి, చివరికి తొలి గేమ్‌ను 21-16తో సులభంగా గెలుచుకున్నాడు.
రెండో గేమ్ ఆరంభంలో కూడా శ్రీకాంత్ బాగానే ఆడి 4-0తో ముందంజలో నిలిచాడు. అయితే వెంటనే పుంజుకున్న లీ చూక్ యు స్కోరును 4-4తో సమం చేశాడు. ఆ తర్వాత గేమ్ సుదీర్ఘ ర్యాలీలతో ఆసక్తికరంగా సాగింది. ఆధిక్యం మారుతూ పోయింది. ఒక దశలో ఇద్దరు ఆటగాళ్లు 15-15తో సమంగా నిలిచారు. కీలక సమయంలో లీ చూక్ యు వరుస పాయింట్లు సాధించి 18-15తో ముందంజలోకి వెళ్లాడు. ఆ తర్వాత శ్రీకాంత్‌కు పుంజుకునే అవకాశమివ్వకుండా గేమ్, మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకుని సెమీఫైనల్ దశకు చేరుకున్నాడు.







