పారిస్ ఒలింపిక్స్‌లో బౌట్‌కు ముందు బరువు సమస్యతో పతకం కోల్పోయిన రెజ్లర్ వినేశ్ ఫొగాట్ తరహాలోనే, ఆసియా క్రీడల్లో భారత ఎంఎంఏ ఫైటర్ సుచిక తరియాల్‌కు కూడా బరువు అంశమే శాపంగా మారింది. తాను పోటీ పడుతున్న విభాగం పరిమితిలోనే ఉన్నప్పటికీ, ప్రత్యర్థి కంటే కాస్త ఎక్కువ బరువు ఉండడం వల్ల ఆమె ఫైనల్‌కు దూరమై, కాంస్య పతకంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామం ఆమెను కన్నీటిపర్యంతం చేసింది.

నగోయాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ (ఎంఎంఏ) ఫైటర్ సుచిక తరియాల్ చివరకు కాంస్యంతోనే ముగించుకుంది. సోమవారం జరిగిన మహిళల 60 కేజీల విభాగం సెమీఫైనల్లో ఆమె సింగపూర్ క్రీడాకారిణి హుయ్ హూన్ టియో చేతిలో ఓటమి పాలైంది. ఈ పోరులో ఇద్దరు క్రీడాకారిణులు హోరాహోరీగా తలపడ్డారు.

రెండు రౌండ్ల మ్యాచ్ ముగిసేసరికి స్కోర్లు సమంగా ఉండటంతో బౌట్ ఫలితాన్ని తేల్చేందుకు రిఫరీలు ప్రత్యేక విధానాన్ని అనుసరించారు. ముగ్గురు జడ్జిల్లో ఒకరు ఇద్దరికీ 19-19 పాయింట్లు ఇవ్వగా, మిగతా ఇద్దరిలో ఒకరు 19-20, ఇంకొకరు 20-19 స్కోరింగ్ ఇవ్వడంతో మొత్తం స్కోరు సమమైంది. అనంతరం ఒక నిమిషం టైబ్రేక్ నిర్వహించారు. ఇందులో ఇద్దరు జడ్జిలు టియోకు 10 పాయింట్లు కేటాయించడంతో ఆమె ఆధిక్యంలోకి వెళ్లింది.

ఈ స్కోరింగ్‌పై భారత బృందం అభ్యంతరం వ్యక్తం చేయడంతో మరో ముగ్గురు జడ్జిలు మ్యాచ్‌ను తిరిగి పరిశీలించి స్కోరింగ్ ఇచ్చారు. అందులో ఇద్దరి స్కోర్లు సమంగా ఉన్నట్లు తేలడంతో, అంతర్జాతీయ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్ నిబంధనల ప్రకారం విజేతను నిర్ణయించారు. మ్యాచ్‌కు ముందు బరువు కొలిచినప్పుడు సుచిక 59.2 కిలోలు, టియో 58.5 కిలోలు ఉన్నారు. టియో కంటే సుచిక 700 గ్రాములు అధిక బరువు ఉండడం ఆమెకు ప్రతికూలంగా మారింది.

రింగ్‌లో గొప్పగా పోరాడినా, ఆటేతర కారణం వల్ల ఫైనల్‌కు దూరమవ్వడం సుచికను తీవ్రంగా కలిచివేసింది. టియోను విజేతగా ప్రకటించగానే ఆమె బోరుమని ఏడ్చేసింది. అయినప్పటికీ సుచికకు దక్కింది కాంస్యమే అయినా, అది భారత ఎంఎంఏ చరిత్రలో గొప్ప ఘనతగా నిలిచింది. ఈ ఏడాదే ఎంఎంఏ ఆసియా క్రీడల్లో తొలి అడుగు పెట్టగా, ఈ క్రీడలో భారత్‌కు తొలి ఆసియా క్రీడల పతకం అందించిన ప్లేయర్‌గా సుచిక రికార్డుల్లో స్థానం సంపాదించింది.

ఫలితం పట్ల నిరాశచెందాను. నేను ఫైట్ గెలిచానని అనుకున్నా. అందుకే ఓటమిని అంగీకరించలేకపోయా. ఇది న్యాయమైన ఫలితం కాదు. రెండు రౌండ్లలోనూ నేను బాగా ఆడాను. ప్రత్యర్థిపై పైచేయి సాధించాను. ఆమె ఒక్కసారి కూడా నన్ను కింద పడేయలేదు. ఆమె నా మీద కొన్ని బలమైన పంచ్‌లు విసిరిన మాట వాస్తవం. కానీ నేను కూడా గట్టి పంచ్ ఇచ్చాను. చివరి నిమిషంలో ఆమె రక్షణాత్మకంగా ఆడితే, నేను చాలా దూకుడుగా ఆడాను