వెస్ట్‌ఇండీస్‌తో సొంతగడ్డపై జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం భారత జట్టును సీనియర్‌ సెలక్షన్‌ కమిటీ బుధవారం ఖరారు చేసింది. అజిత్‌ అగార్కర్‌ నేతృత్వంలోని కమిటీ ప్రకటించిన జాబితాలో కొన్ని కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.

చిరకాలంగా వన్డే జట్టులో స్థానం దక్కించుకోలేకపోతున్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌లకు ఈసారి కూడా అవకాశం లభించలేదు. వీరిద్దరిని టీ20 జట్టులోనూ పరిగణనలోకి తీసుకోకపోవడం గమనార్హం.

హరియాణాకు చెందిన ఆల్‌రౌండర్‌ నమన్‌ ధీర్, జమ్మూకశ్మీర్‌ వేగవంతమైన బౌలర్‌ ఆకిబ్‌ నబి తొలిసారిగా భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నారు. సీనియర్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా, హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ వన్డే జట్టులోకి తిరిగి వచ్చారు.

ఆంధ్ర యువ ఆల్‌రౌండర్‌ నితీశ్‌కుమార్‌ రెడ్డికి రెండు ఫార్మాట్లలోనూ అవకాశం లభించింది. పని భార నిర్వహణలో భాగంగా సీనియర్‌ ఫాస్ట్‌బౌలర్‌ జస్ప్రిత్‌ బుమ్రాకు వెస్ట్‌ఇండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి విశ్రాంతి కల్పించారు. ప్రస్తుతం అఫ్గాన్‌తో సిరీస్‌ ఆడుతున్న బుమ్రా త్వరలో ఆసియా క్రీడల్లోనూ బరిలోకి దిగనున్న విషయం తెలిసిందే.

శుభ్‌మన్‌ గిల్‌ నాయకత్వంలోని వన్డే జట్టులో వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ కేఎల్‌ రాహుల్‌ వైస్‌ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. ఆసియా క్రీడల్లో పాల్గొననున్న టీ20 జట్టునే ఎక్కువగా వెస్ట్‌ఇండీస్‌ సిరీస్‌కు కొనసాగించిన సెలక్టర్లు, యశ్‌ ఠాకూర్‌, విప్రాజ్‌ నిగమ్‌ల స్థానంలో మయాంక్‌ యాదవ్‌, ప్రిన్స్‌ యాదవ్‌లను ఎంపిక చేశారు.

వెస్ట్‌ఇండీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ ఈ నెల 27న ప్రారంభం కానుంది. అనంతరం రెండు జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్‌ జరగనుంది.

భారత వన్డే జట్టు:
శుభ్‌మన్‌ గిల్‌ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రుతురాజ్‌ గైక్వాడ్‌, కేఎల్‌ రాహుల్‌ (వైస్‌ కెప్టెన్‌), ధ్రువ్‌ జురెల్‌, నితీశ్‌కుమార్‌ రెడ్డి, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ప్రసిద్ధ్‌ కృష్ణ, గుర్నూర్‌ బ్రార్‌, మహ్మద్‌ సిరాజ్‌, ఆకిబ్‌ నబి, యశస్వి జైస్వాల్‌, నమన్‌ ధీర్‌.

భారత టీ20 జట్టు:
శ్రేయస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ, ఇషాన్‌ కిషన్‌, సంజు శాంసన్‌, తిలక్‌ వర్మ (వైస్‌ కెప్టెన్‌), శివమ్‌ దూబె, కుల్‌దీప్‌, అక్షర్‌ పటేల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, రవి బిష్ణోయ్‌, నితీశ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, మయాంక్‌.